31.7 C
Hyderabad
May 2, 2024 09: 31 AM
Slider సంపాదకీయం

అసమ్మతి కాదు…‘‘సమ్మతి’’ శాతం తగ్గింది…. అంతే

#jagan

మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ తో రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఏమిటో జగన్ కు తెలిసి వచ్చింది. ఇంత కాలం ‘ నా మాటే శాసనం’ అనే స్థితి ఉందని ఆయన అనుకుని ఉండి ఉంటారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని తేలడంతో పార్టీని గాడిన పెట్టుకోవాల్సిన అవసరాన్ని జగన్ గుర్తించి ఉంటారు.

పార్టీలో ఇంత పెద్ద ఎత్తున తిరుగుబాటు వస్తుందని బహుశ ఆయన ఊహించి ఉండరు. బొత్స సత్యానారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వారికి వారు అడగకుండా, వత్తిడి తీసుకురాకుండా మంత్రి పదవి మళ్లీ ఇచ్చి ఉండరు. ఈ పెద్ద తలకాయలు ఏం చేశారో మనకు తెలియదు కానీ ఈ ఇద్దరికి మంత్రి పదవి మళ్లీ ఇవ్వాల్సి రావడం వల్లే జగన్ ఇంత వత్తిడిని ఎదుర్కొనాల్సి వచ్చింది.

దాంతో తప్పుల మీద తప్పులు చేయాల్సి వచ్చింది. రాష్ట్రంలోని చాలా చోట్ల ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని బాహాటంగా వ్యక్తం చేయడం పార్టీ పై పెను ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. మొదటి రోజున ఉన్న వేడి ఆ తర్వాత రోజుకు లేదు. మూడో రోజుకు మొత్తం చల్లారి పోయింది. అయితే అసంతృప్తుల్ని బుజ్జగించడానికి జగన్ పడిన పాట్లు మాత్రం సాధారణంగా లేవు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికలలో 151 స్థానాలు సాధించడంతో జగన్ మాటే వేదవాక్కు అయింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఏ రోజూ ఎమ్మెల్యేలతో సమావేశం అయింది లేదు. ఎమ్మెల్యేలే కాదు ఒకరిద్దరు మినహా మంత్రులతో కూడా ఆయన రెగ్యులర్ గా మాట్లాడిన దాఖలాలు లేవు.

అన్ని వ్యవహారాలనూ జగన్ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి చూడాల్సిందే తప్ప అప్పటి మంత్రులు స్వతంత్రంగా వ్యవహరించిన దాఖలాలు లేవు. జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడంతో జగన్ మాటకు తిరుగులేకుండా, చర్యకు ఎదురులేకుండా పోయింది.

ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు సైతం కిక్కురుమనకుండా పనులు చేస్తుండటంతో అంతా జగన్ కంట్రోల్ లో కట్టుదిట్టంగా ఉందని అందరూ భావించారు. రాజకీయ వ్యవస్థ, పాలనా వ్యవస్థలు పూర్తిగా అదుపులో ఉండటంతో పార్టీ అత్యంత పటిష్టంగా ఉందని కూడా అందరూ అనుకున్నారు.

రాష్ట్రం ఆర్ధికంగా దివాలా తీసినా ఎవరూ మాట్లాడలేదు. రాజకీయంగా కక్షసాధింపులు చేస్తున్నా ఎవరూ అడగలేదు. కులాల పేరుతో బాహాటంగా రాజకీయాలు చేస్తున్నా అదేమని ఎవరూ ప్రశ్నించలేదు. ఈ కారణాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత బలంగా ఉందని అందరూ నమ్మేశారు.

గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ పార్టీకి తిరుగులేదని అందరూ అనుకున్నారు. ఈ దశలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ అంటే నల్లేరు మీద నడకే అనుకున్నారు. ఎవరిని పీకినా, ఎవరిని ఉంచినా అడిగే వారు ఉండరని అందరూ భావించారు.

ఈ భావనతో జగన్ మంత్రివర్గ కూర్పునకు శ్రీకారం చుట్టారు. ‘‘పెద్ద నాయకులకు’’ మంత్రి పదవులు కొనసాగించాల్సిన అనివార్య పరిస్థితులు వచ్చాయి. ఈ పెద్ద నాయకులను ఎందుకు కొనసాగించాల్సి వచ్చిందో కారణాలు బహిరంగంగా చర్చించేవి కాదు కానీ అలా చేయాల్సి వచ్చింది.

దాంతో మంత్రివర్గం జాబితాను చాలా సార్లు మర్చాల్సి వచ్చింది. ‘‘సామాజిక న్యాయం’’ సాధించినట్లు జాబితా పూర్తిగా వెల్లడికాకముందు నుంచే వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేయడం మొదలు పెట్టింది. మంత్రుల జాబితాను గవర్నర్ వద్దకు చేరే లోపునే సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవాల్సి వచ్చింది.

మంత్రి వర్గం జాబితాను లీక్ చేసి రియాక్షన్ లు బేరీజు వేసుకోవాల్సి వచ్చింది. ఇంతా కష్టపడ్డ తర్వాత కూడా అసమ్మతి భగ్గుమన్నది. అసమ్మతిని చల్లార్చడానికి చర్చోపచర్చలు జరపాల్సి వచ్చింది. మంత్రి పదవులు పోయిన వారికి ‘‘అంతకన్నా పెద్ద పదవులు’’ ఇస్తామని పదే పదే చెప్పుకోవాల్సి వచ్చింది. ఇదంతా పార్టీ పటిష్టంగా ఉన్నదనడానికి గుర్తు కాదు. అసమ్మతి చల్లారిందని సంతోషించినా అది తాత్కాలికమే అవుతుంది.

Related posts

విశ్లేషణ: అత్యంత ప్రమాదకరమైన 3 వ దశ లోకి వచ్చేశామా?

Satyam NEWS

ప్రోటో కాల్ ఉల్లంఘన: అధికారులపై కార్పొరేటర్ దూసరి లావణ్య ఫైర్

Satyam NEWS

స్పందన ఫిర్యాదులపై తక్షణమే స్పందించండి

Satyam NEWS

Leave a Comment