33.7 C
Hyderabad
April 30, 2024 01: 49 AM
Slider ముఖ్యంశాలు

బార్లు తెరిచేస్తున్నారు రండి కరోనా పంచుకుందాం

#Bar in AP

భారతదేశంలో సెప్టెంబర్ 1 వ తేదీనుంచి అన్ లాక్ -4 ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనిలో భాగంగా మెట్రో రైళ్ళు తిరిగి పట్టాలెక్కనున్నాయి. అయితే మెట్రో రైళ్ళ పునఃప్రారంభం పై వస్తున్న అనేక సంశయాలపై వివిధ వర్గాలతో సంప్రదింపులు ముమ్మరంగా కొనసాగుతున్న ట్లు అధికారులు చెబుతున్నారు.

కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మెట్రోరైళ్ళను నడిపినా రాగల కొత్త సమస్యల కోణంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వ్యక్తిగత శానిటైజేషన్, మాస్కుల వినియోగం కఠినంగా అమలుపరచినా….భౌతిక దూరం పాటించేవిషయంలో సాధ్యాసాధ్యాలపై చర్చించాలని వారు అధికారులకు సలహా ఇస్తున్నారు.

బార్లు తెరిస్తే ఇక ఆందోళన రెట్టింపు

రోజురోజుకూ పెరుగుతున్న కోవిడ్ పాజిటివ్ కేసుల నేపథ్యంలో రద్దీ నియంత్రణకు తీసుకునే చర్యలపై స్పష్టత ఉండాలని మెట్రోరైళ్ళ వినియోగదారులు సైతం కోరుతున్నారు. ఇదిలా ఉండగా గత కొద్దినెలలుగా మూతపడి ఉన్న బార్లు కూడా సెప్టెంబర్ 1 నుంచి తెరుచుకోనున్నాయి.

మద్యం ప్రియులకు ఇది మంచివార్తే అయినా కోవిడ్ నిబంధనలు త్రోసిరాజని మద్యంషాపులు నిర్వహిస్తున్న తీరు గమనిస్తున్న వారికి ఆందోళన కలిగించే అంశమే. కోవిడ్ దెబ్బకు చిన్నాచితకా  ఉద్యోగాలు కోల్పోయినవారి  సంఖ్య గణనీయంగా ఉందన్న విషయం ప్రభుత్వాధినేతలకు తెలియంది కాదు.

ఇప్పటికే  అరకొరసంపాదనతో బతుకులీడుస్తున్న దుర్భర పరిస్థితి లో మద్యం ఏరుల్ని పారించడం విజ్ఞతకాదని ఏలికలు గ్రహించాలి. కోవిడ్ బారినపడి కోట్లాది కుటుంబాలు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పర్యవసానంగా దిగువ,మధ్యతరగతి కుటుంబీకులలో మానసిక ఒత్తిళ్ళు, ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.

ఫలితంగా కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమవుతున్న ఉదాహరణలు వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో మద్యం వినియోగం సమస్యను మరింత జఠిలం చేసే అవకాశాలు ఎక్కువకాగలవని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మహారాష్ట్ర లో ఇంకా తగ్గని విజృంభణ

ఇక….దేశంలో కరోనా దాడి ఆగడంలేదు. బుధవారం నాటికి తాజాగా 67,152 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 32, 34,474 కు చేరుకుంది. ఇప్పటికి మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 59, 499 కి చేరుకుందని కేంద్రఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

తాజాగా నమోదైన 1059 మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 329కాగా, తర్వాతి స్థానాలలో తమిళనాడు, కర్ణాటక ఉన్నట్లు ఆ ప్రకటన తెలిపింది. దేశవ్యాప్తంగా 1524 ల్యాబుల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర అధికారులు చెబుతున్నారు.

దేశంలో కోవిడ్-19 ఉద్ధృతి గమనిస్తే….అన్ లాక్ -4 ప్రక్రియ ప్రారంభంకావడానికి ముందే … ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులున్న దేశాలలో ప్రస్తుతం ఉన్న బ్రెజిల్(36,74,176) ను దాటి అమెరికా తరువాత 2వ స్థానానికి భారత్ ఎగబాకడం ఖాయమని నిర్ధారించవచ్చు.

బ్రెజిల్ ను మించి పోతున్న మరణాలు

మరణాల సంఖ్య విషయంలో బ్రెజిల్ (1,16,666)తో పోటీ పడకపోయినా పాజిటివ్ కేసుల విషయంలో అతిత్వరలోనే బ్రెజిల్ ను అధిగమించడం ఖాయమని నిపుణులు అంటున్నారు. భారత్ లో బుధవారం నాటికి రికవరీ రేటు 76.30 శాతానికి పెరిగినట్లు, మరణాల రేటు 1.80 శాతానికి తగ్గినట్లు కేంద్రం తెలిపింది.

అయినా…ప్రతీ 24 గంటలలో పెరుగుతున్న కొత్త కేసులసంఖ్య ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. జీరో వైరస్ వ్యాప్తిదశను ఇప్పట్లో ఊహించలేము. వ్యాప్తి నిరోధానికి ఉపయుక్తంకాగల వాక్సిన్, టీకాలు ఇంకా ప్రయోగ దశలోనే ఉన్నాయి. మానవ వినియోగానికి  రావడానికి సుమారు 3 లేదా4 నెలలు పట్టవచ్చని వివిధ వర్గాల సమాచారం.

పీడిస్తున్న ప్రయివేటు ఆసుపత్రులు

వాస్తవాలు ఇలా ఉండగా…. అన్ లాక్- 4 ప్రక్రియ ప్రారంభం కోసం కేంద్రప్రభుత్వం సమాయత్తం కావడం పలు విమర్శలకు తావిస్తోంది. ఒకవైపు….కోవిడ్ నుంచి ప్రాణరక్షణ కోసం ఆశ్రయించినవారిని ప్రైవేటు హాస్పిటల్స్ అమానవీయంగా పీడిస్తున్న కేసులు ఎక్కువవుతున్నాయి.

మరోవైపు సాధారణ ప్రజానీకం ఆర్ధిక, సామాజిక, ఆరోగ్య సమస్యలతో విలవిలలాడుతోంది. వైరస్ నిరోధక మందులు బ్లాక్ మార్కెటింగ్ ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోంది. బాధ్యత గల మీడియా, పౌరసమాజం, వైద్య,ఆరోగ్య నిపుణులు, సంబంధిత అధికారులు అనేక రూపాలలో స్వీయపరిరక్షణ కోసం చైతన్యం కలిగిస్తున్నాయి.

అయినా…. విద్యాధికులు సైతం కోవిడ్ నిబంధనలు పాటించక విచ్చలవిడిగా తిరగడం సమాజం పట్ల వారికి ఉన్న నిర్లక్ష్యాన్ని బహిర్గతపరుస్తోంది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే కోవిడ్ ధాటికి భారత్ భారీమూల్యాన్ని చెల్లించడం తప్పదంటున్న ప్రమాదఘంటికలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికైనా…. ఏలికలు మేలుకుని , వ్యర్ధ భేషజాలు విడిచిపెట్టి అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి కోవిడ్ ముప్పును సమర్ధవంతంగా ఎదుర్కునేందుకు ఉమ్మడి వ్యూహానికి సంసిద్ధం కావాల్సిన ఆవశ్యకతను గుర్తించాలని జనబాహుళ్యం అభిలషిస్తోంది.. సువిశాల భారతదేశ విశాలహితాన్ని దృష్టిలో ఉంచుకుని నేతలు ముందడుగు వేస్తారని ఆశిద్దాం.

పొలమరశెట్టి కృష్ణారావు

Related posts

కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి: సిఐటియు

Satyam NEWS

కొత్తవలస పోలీసు స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ దీపికా

Satyam NEWS

స్థితప్రఙ్ఞుడు

Satyam NEWS

Leave a Comment