29.7 C
Hyderabad
May 2, 2024 05: 06 AM
Slider ప్రత్యేకం

Analysis: గెలిచింది ఎవరైనా ఓడింది మాత్రం ఓటరే

#GHMCElections

జీహెచ్ఎమ్ సీ ఎన్నికల ఫలితాలు తెరాస పార్టీకి ఊహించని చేదు అనుభవాన్ని  మిగిల్చాయి. తొలిసారి వెల్లడైన పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రావడం ఎన్నికల ఫలితాలను సూచన ప్రాయంగా తెలిపాయి. తెరాస

పార్టీ పట్ల ప్రజలలో తగ్గుతున్న ప్రజాదరణకు నిదర్శనంగా  జీ హెచ్ ఎమ్ సీ ఎన్నికల ఫలితాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

దుబ్బాక ఉపఎన్నిక విజయంతో ఊపుమీదున్న బీజేపీ జీహెచ్ ఎమ్ సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికల ప్రక్రియ ఆరంభమైన నాటి నుంచి బీజేపీ తనదైన అజెండాతో ప్రజల్ని ఆలోచింపచేయడంలో కృతకృత్యమైనట్లు పరిశీలకులు భావిస్తున్నారు.

ఎన్నికల వేడి పెంచిన సర్జికల్ స్ట్రైక్స్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎన్నికల ప్రచారంలో ఉపయోగించిన భాష పార్టీ శ్రేణులను ఉత్తేజపరచి నట్లు పార్టీ అనుకూలవర్గాలు అంటున్నాయి. ‘ సర్జికల్ స్ట్రైక్ ‘ వంటి  పదజాలంతో రాజకీయాలలో వేడి పుట్టించి కొత్త తరహా ఒరవడికి బీజేపీ తెర తీసింది.

మత విద్వేషాలు రెచ్చగొట్టే విధ్వంసక ధోరణులను తిప్పికొట్టాలని, మతతత్త్వ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చిన తెరాస గత ఎన్నికలలో 99 స్థానాలు  సాధించిన తెరాస  తాజా ఎన్నికలలో కేవలం 56 స్థానాలకే పరిమితం కావడం ఆ పార్టీ నేతలకు మింగుడుపడని విషయం.

కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగిన కమలం

2019 పార్లమెంట్ ఎన్నికలలో 4 స్థానాలు గెలిచిన బీజేపీకి తెలంగాణ రాష్ర్టంలో బలం పుంజుకునేందుకు అవకాశం చిక్కినట్లైంది. పాలక తెరాస ప్రభుత్వంపై ప్రజలలో పెల్లుబుకుతున్న అసంతృప్తిని వినియోగించుకుని ఓట్లు రాబట్టుకోవడంలో బీజేపీ కాంగ్రెస్ కు అసలైన ప్రత్యామ్నాయంగా ప్రజల ఆదరణ చూరగొంది.

49 స్థానాలు గెలుపొందడమే కాకుండా చాలా స్థానాలలో తెరాస గెలుపును నియంత్రిచే స్థాయికి బీజేపీ చేరుకోవడం ఆ పార్టీ నేతలకు ఆనందం కలిగించే అంశం. 2023 శాసనసభ ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో బీజీపీని బలోపేతం చేసేందుకు జీహెచ్ ఎమ్ సీ ఎన్నికల ఫలితాలు ఉత్ప్రేరకంగా పనిచేస్తాయని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.

పాత మేనిఫెస్టోతో పచ్చడైన తెరాస

ఇక తెరాస ఓటమికి పలు అంశాలు ప్రధానకారణాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు. జీహెచ్ఎమ్ సీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన అనేక అంశాలు గత అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తెలిపినవే కావడం ఒక ప్రధాన లోపంగా గుర్తించారు.

డబల్ బెడ్రూమ్ ఇళ్ళపంపిణీ, ఆక్రమణకు గురైన చెరువుల క్రమబద్ధీకరణ,నాలాల విస్తరణ , ప్రజావసరాలకు తగిన మౌలిక సదుపాయాల కల్పన వంటి విషయాలు కేవలం మాటలకే పరిమితమైనట్లు ప్రజలు భావించి తెరాసను తిరస్కరించారని ఓ వాదం వినిపిస్తోంది.

భారీ వర్షాలలో కొట్టుకుపోయిన తెరాస

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నగరంలో అనేక ప్రాంతాల ప్రజలు రోజుల తరబడి మురికిలో జీవనం సాగించారు. వారికి కనీస సహాయం అందించేందుకు తెరాస నేతలు రాకపోవడం ఆయా ప్రాంత ప్రజలలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. బాధితులకు ఆర్థిక సాయం  అందించాల్సిన విషయంలోనూ అవకతవకలు జరిగిన ఉదంతాలు ఉన్నాయి.

గత కార్పొరేషన్ ఎన్నికలలో గెలిచినవారు ప్రజలకు అందుబాటులో లేకపోవడం కూడా తెరాస ఓటమికి ఒక కారణమని పరిశీలకుల భావన. ఇప్పుడు జీహెచ్ ఎమ్ సీ అధికారం అధిరోహించేది ఎవరనే విషయం తేలాల్సివుంది. 56 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించిన తెరాస ఎత్తుగడ ఎలా ఉంటుందో వేచిచూడాలి.

ఎంఐఎంతో కలిసిపోతారా?

ఎక్స్ అఫిషియో సభ్యల మద్దతుతో కావలసిన మెజారిటీ సాధిస్తుందా లేదా మిత్రపక్షం ఎమ్ ఐ ఎమ్ తో కలిసి అధికారం పంచుకుంటుందా ? అనేది తేలాల్సి ఉంది. తెరాసకు గట్టిపోటీ ఇచ్చి 49 స్ధానాలలో గెలిచిన బీజేపీ జీహెచ్ఎమ్ సీ లో ప్రతిపక్ష పార్టీగా తనవాణిని బలంగా వినిపించనుంది.

ఇటు తెరాస అటు ఎమ్ ఐ ఎమ్ పార్టీలను ఇరుకునపెట్టేందుకు బీజేపీ కి అధిష్టానం నుంచి ఆశీస్సులు ఉండడం సహజం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణ రాష్ట్రంలో పట్టు సాధించేందుకు జీహెచ్ ఎమ్ సీ ఫలితాలు బీజేపీకి దోహదపడనున్నాయి.

ఇదిలావుండగా…..కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన వ్యవసాయ సంస్కరణ బిల్లులు, విద్యుత్ సంస్కరణల బిల్లులను తెరాస తీవ్రంగా వ్యతిరేకించింది. ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా కేంద్రం వ్యవహరించి రాష్ట్రాల హక్కులను కేంద్రప్రభుత్వం హరిస్తోందని తెరాస ధ్వజమెత్తింది.

కరోనా నేపథ్యంలో తెరాస ప్రభుత్వానికి ఆశించిన స్థాయిలో ఆర్ధిక సహకారం అందించక పోవడం దుర్మార్గమని ముఖ్యమంత్రి కేసీఆర్ దుయ్యబట్టారు. అయితే పై కారణాలవల్ల తెరాస ఊహించినట్లు ప్రజల మద్దతు  పొందడంలో ఆ పార్టీ విఫలమైందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

రానున్న కొద్ది రోజులలో తెలంగాణ రాష్ట్ర రాజకీయ సమీకరణలు వేగంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయాలలో అధికారం కోసం ఎత్తులు పైఎత్తులు సహజమనే విషయం తెలిసిందే. ఎవరో అన్నట్లు.. “రాజకీయ పార్టీల వ్యూహప్రతివ్యూహాల్లో అంతిమంగా గెలిచేది ఎవరైనా పరాజితుడు ఎప్పటికీ ఓటరేనన్నది నిష్ఠురసత్యం.”

పొలమరశెట్టి కృష్ణారావు

Related posts

మాజీ ప్రధాని పి.వి. పై కవితలకు ఆహ్వానం

Satyam NEWS

స్టేట్ మెంట్: కమ్మోళ్ళు మమ్మల్ని ఏమీ చేయలేరు

Satyam NEWS

శాసన మండలి రద్దు తొందరపాటు నిర్ణయం

Satyam NEWS

Leave a Comment