30.7 C
Hyderabad
April 29, 2024 03: 30 AM
Slider ప్రత్యేకం

Analysis: అభ్యర్ధులపై వ్యతిరేకత వల్లే తక్కువ శాతం ఓటింగ్

#Charminar

ఎన్నికలు లేని ప్రజాస్వామ్యాన్ని ఊహించలేం కానీ….ఎన్నికలలో ఓటు వేసేవారి శాతం నానాటికి తగ్గడం చూస్తున్నాం. తాజాగా జరుగుతున్న జీ హెచ్ ఎమ్ సీ ఎన్నికలలో కూడా ఓటింగ్ శాతం అతి తక్కువగా నమోదయింది.

 ఎన్నికలసంఘం, రాజకీయ పార్టీలు, పౌరసమాజం, ప్రజాస్వామ్యవాదులు ఎంతగా కృషిచేస్తున్నా ఓటింగ్ శాతం పెరగకపోవడానికి ప్రజలలో ఎన్నికల నిర్వహణ తీరుపై ఉన్న అనాసక్తి ప్రధానకారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

‘ఏ పార్టీ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం.

అన్నీ ఒక తాను ముక్కలే ‘ అనే భావన సగటు మనిషిలో స్థిరపడిపోయింది. పార్టీల జెండాల రంగులే వేరు కానీ…అందరి ఎజెండా ఒక్కటేనని ప్రజలు బలంగా విశ్వసిస్తారు.

డబ్బు మదం తప్ప ప్రజా బలంపై ధ్యాస లేదు

కుల, మత, వర్గ, ఇతర ప్రాధమ్యాలతో పాటు ధనబలం, మంది బలం  ఉన్నవారికే సీట్లు కేటాయించడంతో ప్రజాస్వామ్యవ్యవస్థ పై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోంది.

కోట్లువ్యయం చేసి ఎన్నికలో నెగ్గినవాళ్ళు నిస్వార్ధ ప్రజాసేవ చేస్తారని ఆశించడం అవివేకం. బంధుప్రీతి, ఆశ్రితజన పక్షపాతం ప్రదర్శించని నేతలు మచ్చుకైనా కనిపించని రాజకీయవ్యవస్థలో సచ్ఛీలురకు స్థానం కల్పించేందుకు పార్టీలు సాహసించవు.

ఎన్నికలు అత్యంత ఖరీదైన ప్రహసనంగా మారడమే ఈ దుస్థితికి కారణం. ఎన్నికలలో పోలైన ఓట్లలో 20 నుంచి 30 శాతం తెచ్చుకుని గట్టెక్కిన వ్యక్తి 100 శాతం ప్రజలకు ప్రతినిధిగా వ్యవహరించడం మరో విడ్డూరం. గెలిచిన వారు ప్రజల బాగోగులు గమనించి సక్రమంగా పరిపాలన చేస్తారా? అంటే అదీ లేదు.

డబ్బులు ఇచ్చి గెలిచిన వాడు సేవ చేస్తాడా?

అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి సంపాదనే ధ్యేయంగా వ్యవహరించడంలో ఎవరి శైలివారిదే. పంచాయతీ వార్డు మెంబర్ మొదలు పార్లమెంట్ సభ్యుడు వరకు అధికారంలో ఉన్నంత కాలం సొంతలాభం కోసం ఉరకలెత్తడం సాధారణ మైపోయింది.

పైగా …..పాలకపక్షం, ప్రతిపక్షం ఒకరిపై ఒకరు విద్వేషపూరిత వ్యాఖ్యలతో  బాధ్యత ఎరిగిన ప్రజాప్రతినిధిగా పాటించాల్సిన కనీస పార్లమెంటరీ సాంప్రదాయాలను త్యజించడం సహేతుకం కాదు. చట్టసభలు ముష్టి యుద్ధాలను తలపించే సమరవేదికలుగా మారడం చూస్తున్నాం.

ఒకరిపై ఒకరు పరుషపదజాలం ప్రయోగించడం, సభాపతి స్థానాన్ని అగౌరవపరచడం, సభానాయకులకు కనీస మర్యాద ఇవ్వకపోవడం, చర్చల సందర్భంగా  ఉచ్ఛరించడానికి వీలులేని భాషను ఉపయోగించడం…. ఇత్యాది కారణాలతో రాజకీయ నేతలంటే ప్రజలలో చులకన భావం పెరుగుతోంది.

భారత్ వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో నిర్బంధ ఓటుహక్కు ఇప్పట్లో సాధ్యం కాదు. అందుకే….వివేకులు నోటా వైపు మొగ్గుచూపుతున్నారు. నోటాప్రక్రియలో  అధికసంఖ్యలో ఓట్లు పోలైతే ఆ ఎన్నిక రద్దుచేసి మరల నిర్వహించడం తప్పనిసరి.

నోటాలో ఓట్లు గణనీయంగా పెరిగితే అది ఓటరు నిశ్శబ్ద నిరసనగా అర్ధంచేసుకోవాలి. దేశానికి దిశానిర్దేశం చేయగల ఎన్నికల వ్యవస్థలో  పూర్తిస్థాయి ప్రక్షాళన చోటుచేసుకోవాలని ప్రజాస్వామ్యప్రియులు కొన్ని దశాబ్దాలుగా వాదిస్తున్నారు.

రాజకీయ వ్యవస్థను భ్రస్టు పట్టిస్తున్న అవాంఛనీయ శక్తులు

చట్టంలోని లొసుగులు ఆధారంచేసుకుని అవాంఛనీయ శక్తులు రాజకీయ వ్యవస్థలో ప్రవేశించి భ్రష్టుపట్టించడంతో ఎన్నికలపై ప్రజలలో దురభిప్రాయం గాఢంగా ముద్రితమైంది.

విద్యావంతులు, సంస్కరణ వాదులు, రాజ్యాంగ నిపుణులు, మీడియారంగ ప్రముఖులు, నీతివంతులైన రాజకీయనేతలు, ఇతర రంగ మేథావులు ప్రస్తుత ఎన్నికల వ్యవస్థను రాజ్యాంగ పరిధులకు లోబడి బలోపేతం చేసేందుకు ఉద్యమిస్తే మెరుగైన ఫలితాలు సాధించడం అసాధ్యమేమీ కాదు.

కానీ….’పిల్లి మెడలో గంట కట్టే సాహసి ఎవరు? ‘ అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

పొలమరశెట్టి కృష్ణారావు

Related posts

పోలీసు కేసులకు భయపడేది లేదు: మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్

Satyam NEWS

హుజూర్ నగర్ అపూర్వ పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Satyam NEWS

వచ్చే నెల 15 లోగా వైద్య కళాశాల నిర్మాణపనులు పూర్తి చెయ్యాలి

Satyam NEWS

Leave a Comment