38.2 C
Hyderabad
April 27, 2024 17: 10 PM
Slider ప్రత్యేకం

గవర్నర్ తో ‘‘సై’’ అంటున్న అధికార పక్షం

#TamilsaiSoundararajan

అటు ఉత్తరధృవం..ఇటు దక్షిణధృవం… అవి ఎప్పటికీ కలవనే కలవవు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అధికార, ప్రతిపక్షపార్టీలు పరస్పరం ఆరోపణలు సంధిస్తూ వినోదం కలిగిస్తున్నాయి. ఒకరిపై ఒకరు అప్రజాస్వామిక ధోరణిలో అసత్యాలు, అర్ధసత్యాలతో ప్రజలకి రాజకీయాలంటే ఏవగింపు కలిగిస్తున్నాయి.

ఇదిలా ఉండగా… అధికారపార్టీకి , గవర్నర్ మధ్య కొన్నాళ్లుగా అగాధం ఏర్పడింది. పరిపాలనలో జోక్యం చేసుకుని గవర్నర్ ఆ పదవికి ఉన్న గౌరవాన్ని తగ్గిస్తున్నారని అధికార పక్షం విమర్శిస్తోంది. రాజ్యాంగానికి అనుగుణంగానే గవర్నర్ వ్యవహరిస్తున్నారని రాజ్ భవన్ వర్గాలు వివరణ ఇస్తున్నాయి. పూర్వ గవర్నర్ ఈ ఎస్ ఎల్. నరసింహన్ అనంతరం గవర్నర్ పదవి చేపట్టిన తమిళ సై మొదట్లో రాష్ట్ర ప్రభుత్వంతో తటస్థంగా వ్యవహరించినా తరువాత కొద్దికాలానికే తెలంగాణ ప్రభుత్వానికి తలనెప్పిగా మారినట్లు తెరాస పార్టీ శ్రేణులు బహిరంగంగానే విమర్శిస్తున్నాయి. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా  కౌశిక్ రెడ్డి ఎంపిక విషయంలో రాష్ట్రమంత్రి వర్గం అభ్యర్థనను కావాలనే రాజ్ భవన్ తాత్సారం చేసినట్లు తెరాస పార్టీ అభిప్రాయపడింది.

అలాగే… కేంద్ర ప్రభుత్వ విధానాలపై ముఖ్యమంత్రి కే. చంద్ర శేఖర్ రావు సూటిగా, నిర్మొహమాటంగా విమర్శించడం వంటి రాజకీయ పరిణామాలపై రాష్ట్రగవర్నర్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా…రాష్ట్రానికి చెందిన ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై పలువిధాలుగా ఒత్తిడి చేయడం, కేంద్రానికి రావాల్సిన బయ్యారం స్టీల్ ప్లాంట్, కొత్త  రైల్వే మార్గాలు, కేంద్రం నుంచి అందాల్సిన నిధుల విషయంలో అనవసర కాలయాపన వంటి అంశాలు రాష్ట్ర ముఖ్యమంత్రి , గవర్నర్ మధ్య మరింత దూరం పెంచాయని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం.

తెలంగాణ లో తెరాస ప్రభావాన్ని తగ్గించాలనే లక్ష్యంతో తమిళనాడుకి చెందిన భాజపా సీనియర్ నేత తమిళ్ సై ని గవర్నర్ గా పంపినట్లు ఒక వాదన అప్పట్లో బలంగా వినిపించింది. రాజ్ భవన్ లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి గైర్హాజరు కావడం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ సందర్భంగా ముచ్చింతల్ సందర్శించినప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గా వెళ్లకపోవడం పలు వివాదాలకు దారితీసింది.

ఇటువంటి సంఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో గవర్నర్,ముఖ్యమంత్రుల మధ్య సహజంగానే విభేదాలు ప్రవేశించాయి. అవి చిలికి చిలికి గాలివాన అయినట్లు గవర్నర్ ప్రసంగం లేకుండానే రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నిర్వహించడానికి సిద్ధం కావడం రాజ్యాంగ విలువల్ని కాలరాయడమేనని రాష్ట్ర బీజేపీ విమర్శిస్తోంది. దీనికి తోడు.. జాతీయస్థాయిలో భాజపా వ్యతిరేక శక్తులను ఏకం చేయడం కోసం కే సీఆర్ సాగిస్తున్న ప్రయత్నాలు భాజపా అధిష్టానానికి మింగుడుపడడం లేదు. భాజపా తో రాజకీయ వైరం ఉన్న వేర్వేరు రాష్ట్రాలకు చెందిన శివసేన, ఎన్ సీ పీ, డీ ఎంకే, తృణమూల్ కాంగ్రెస్ …వంటి అనేక మంది రాజకీయనేతల మద్దతు కోరడం, వారు సానుకూలంగా స్పందించడం కేసీఆర్ ప్రయత్నానికి ఊతం ఇచ్చాయి.

ఈ పూర్వరంగంలో రాష్ట్ర ప్రభుత్వం, రాజ్ భవన్ ల మధ్య రాజుకున్న విభేదాలు మరింత పెరిగాయి. రానున్న రోజుల్లో ఈ విభేదాలు ఎటువంటి రాజకీయ విష పరిణామాలకు దారి తీయగలవనేది పెద్ద ప్రశ్నగా మారింది. రాజ్యాంగ విలువల్ని గౌరవించాల్సిన ముఖ్యమంత్రి దేశప్రధాని, గవర్నర్ ల విషయంలో అనుచితంగా ప్రవర్తించడం తగదని  రాజ్యాంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అంతిమంగా ప్రజా శ్రేయస్సు కోసం కర్తవ్య పాలన చేయాల్సిన రెండు కీలక వ్యవస్థల మధ్య సఖ్యత కొరవడడం ఏ కోణంలో చూసినా తప్పేనని వారు అంటున్నారు. రేపు జరగబోయే రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు తీవ్ర ఉత్కంఠ కలిగిస్తున్నాయి. ఇద్దరిలో ఏ ఒక్కరు ఒక మెట్టు దిగినా …వారి గౌరవానికి భంగం కలగకపోగా వారు అధిష్టించిన పదవికి వన్నె పెరుగుతుందని ఖచ్చితంగా అనుకోవచ్చు.

” రాజకీయాలలో ఏదైనా జరగవచ్చు, ఎప్పుడైనా జరగవచ్చు ” అని అంటారు. ప్రస్తుతానికి ఏమి జరగనున్నది నిరీక్షించాల్సిందే.

పొలమరశెట్టి రమా కృష్ణారావు

Related posts

“చిట్టిముత్యాలు – రొమాన్స్ విత్ రైస్” పేరు చాలా గట్టిగా వినిపిస్తుండడం సంతోషం

Satyam NEWS

ది డే ఫర్ ద ఫాదర్: నాన్న అంతా నువ్వే

Satyam NEWS

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ నాయకుల చిత్రపటాలు అందజేత

Satyam NEWS

Leave a Comment