38.2 C
Hyderabad
April 29, 2024 12: 58 PM
Slider ప్రత్యేకం

ది డే ఫర్ ద ఫాదర్: నాన్న అంతా నువ్వే

#Fathers Day 1

(సత్యం న్యూస్ ప్రత్యేకం)

నాన్న ఓ ఉగ్రనరసింహుడు, అగ్నిహోత్రుడు… రుద్రనేత్రుడు, ఆయన కళ్లెర్ర చేస్తే ఇంటిల్లిపాదికీ ఒళ్ళంతా వణుకే. ఆయనకు ఎదురుపడాలన్నా, మాట్లాడాలన్నా అందరికీ హడల్. అసలు ఆయనంటేనే ఓ హంటర్… ఇవన్నీ ఒకప్పుడు నాన్న గురించి భయం భయంగా చెప్పుకునే మాటలు.

సింహంలా గర్జించినా, పులిలా గాండ్రించినా ఆయన కర్కశుడు కాదు. కుటుంబాన్ని కట్టుబాట్లల్లో, కష్టాల్లేని రీతిలో నడపాలన్నదే ఆయన తపన. నాన్నంటే ఓ సింహం, ఓ పులి కానే కాదు. ఆయనో మార్గదర్శి. అందరికి పెద్ద దిక్కు. నిజానికి నాన్నంటే ఇంటి పైకప్పు’. అందుకే తల్లి లాంటి లాలన, తండ్రిలాంటి రక్షణ అన్నారు.

పైకి కోపం గా కనిపించినా కాసింత ప్రేమ కోసం నిలువెల్లా కరిగిపోతాడు నాన్న. బిడ్డల శ్రేయస్సేపరమావధిగా భావించి ఎన్ని కష్టాలైనా భరిస్తాడు. – ఇంటి పనులలోనూ…. కుటుంబంలో తన హోదాను, భేషజాలను పక్కన పెట్టి పిల్లల భవిత కోసం నేటి నాన్న ఎంతగానో పరితపిస్తున్నాడు.

తాను కష్టపడుతూ పిల్లల శ్రేయస్సే ధ్యేయంగా

తన కళ్లతో పిల్లలకు ప్రపంచాన్ని చూపడంలో, తాను కష్టపడుతూ పిల్లల శ్రేయస్సే ధ్యేయంగా నిరంతరం ఆలోచనల్లో సంచరిస్తాడు… పిల్లల్ని సాకడంలో అమ్మకంటే తానేమీ తీసిపోలేదని ఇప్పటి నాన్న నిరూపిస్తున్నాడు. కుటుంబ నిర్వహణలో అమ్మతోపాటు బాధ్యతలను పంచు కోవడానికి నాన్న పోటీపడుతున్నాడు.

వంటపనిలో, ఇంటిపనిలో అమ్మకు చేదోడు వాదోడుగా ఉంటూ పిల్లల సంరక్షణలో తన వంతు సహాయం చేసేందుకు నాన్న సంసిద్ధత వ్యక్తం చేయడం నేడు చాలా ఇళ్లలో చూస్తున్నాం. వంటపనిలో అమ్మ బిజీగా ఉంటే పిల్లల్ని నిద్రలే పడం, స్నానం చేయించడం, వారిని బడికి సిద్ధం చేయడంలోను నాన్న సహకరిస్తున్నాడు.

ఒకప్పుడు తండ్రి చెంతకు పిల్లలు వెళ్లాలంటే జంకే వారు. ఇప్పుడు ఆ పరిస్థితులు ఎక్కడా లేవు. పిల్లలచదువు, వారి ఆరోగ్యం గురించి తండ్రులు ఎంతో ఆప్యాయంగా ఆరా తీస్తున్నారు. ఉద్యోగం, సంపాదన యావలో ఉన్నా, పిల్లలతో గడిపేందుకు ఎంతో కొంత సమయం కేటాయిస్తున్నారు.

పిల్లలతో గడిపేందుకే తండ్రులు మొగ్గు

ప్రతి రోజూ ఏదో సమయంలో పిల్లలను దగ్గరకు తీసుకుని వారితో ప్రేమగా సంభాషిస్తున్నారు. వారాంతపు సెలవుల్లో పిల్లల్ని బయటకు తీసుకువెళ్ళి వారు అడిగిన వస్తువులను కొనేందుకు నాన్నలు ‘ఓకే’ అంటున్నారు. పిల్లలు ఏదైనా తప్పు చేస్తే ఎప్పుడైనా కోప్పడడం సహజమే అయినా, వారిని లాలించడంలో, వారి ఇష్టాలను తీర్చడంలో నాన్న ముందంజలోనే ఉంటున్నాడు.

పిల్లల సంరక్షణ విషయంలో ఎలాంటి గొప్పలకు పోకుండా భార్యకు సహకరిస్తూ తన బాధ్యతలను నెరవేరుస్తున్నాడు చదువుల్లో పిల్లల మార్కులు, ర్యాంకుల గురించి ఆరా తీస్తూ వారి భవిష్యత్ కలలను సాకారం చేసేందుకు నాన్న ఎంతగానో ఆలోచిస్తున్నాడు.

ధైర్యం నూరిపోసేవాడే నాన్న

పరీక్షల సమయంలో అనుక్షణం పిల్లలను సాకుతూ, వారికి ధైర్యాన్ని నూరి పోయడంలో నాన్న చేస్తున్న కృషి తక్కువేమీ కాదు. అభిరుచులను ఆదరిస్తూ… ఒకప్పుడు పిల్లలంతా తండ్రిమాటను జవదాటని వారే! ఆధునిక యుగంలో ఆ పరిస్థితి ఎంతో మారింది. పిల్లల మనోభావాలను తెలుసుకుంటూ వారి ఇష్టప్రకారమే అంతా జరగాలని తండ్రులు భావిస్తున్నారు.

పిల్లల అభిరుచులు, అభిప్రాయాలను గౌరవించినప్పుడు మేలే జరుగుతుందన్న విషయాన్ని నాన్నలు గ్రహిస్తున్నారు. చదువు విషయంలోగానీ, పెళ్ళి విషయంలోగానీ పిల్లల మనోభావాలను గుర్తించేందుకు తండ్రులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఉదయాన్నే నిద్ర లేపి పిల్లల చేత పద్ధతి ప్రకారం చదివించడం, వారి యోగక్షేమాలు విచారించడం, పరీక్షలు రాసేందుకు ధైర్యం ఇస్తూ వారిని పరీక్షాకేంద్రాల వద్దకు తీసుకువెళ్ళడం, మంచి మార్కులొస్తే అభినందించడం, తక్కువ మార్కులోస్తే ధైర్యం చెప్పడం, వారి ఇష్టప్రకారం అనువైన కోర్సులు చదివించడం, అనుకున్న ఉద్యోగం దక్కేలా ప్రోత్సహించడం, యుక్తవయసుకొచ్చి ప్రేమలో పడితే నిండుమనసుతో అంగీకరించడం, నచ్చినవారితో పెళ్ళి జరిపించడం… ఈ బాధ్యతలన్నీ తండ్రులు నేడు మనస్ఫూర్తిగా నిర్వహిస్తున్నారు.  

పిల్లల చేత ఇష్టంలేని పనులు చేయించాలని తల్లిదండ్రులు భావించకపోవడం….. కుటుంబ వ్యవస్థలో ఇటీవల కాలంలో వచ్చిన పెను పరిణామం. ఇలాంటి మార్పులే కుటుంబ వ్యవస్థ మరింతగా బలపడడానికి, మమతానురాగాలు వెల్లివిరియడానికి దోహదం చేస్తాయి.

నాన్న అంటే ఎటిఎం కార్డు కాదు…

తాము అడిగినవన్నీ ఇస్తూ తమ కోర్కెలను తీర్చేందుకు నాన్న ఓ ‘ఎటిఎం కార్డు కాదన్న వాస్తవాన్ని నేటి పిల్లలు సైతం గ్రహించాలి. తాము కూడా నాన్న పట్ల బాధ్యత వహించాలి. ‘సక్సెస్ ఫుల్ ఫాదర్’ అని నిరూపించేందుకు నాన్న ఎంతగా పరితపిస్తున్నాడో, పిల్లలు అంతగా తపన చెందాలి.

మంచి ఉద్యోగం వచ్చాక రెక్కలొచ్చిన పక్షి’ మాదిరి నేడు ఎంతోమంది పిల్లలు తల్లిదండ్రులు దూరమవుతున్నారు. ఉద్యోగం, సంపాదన, తన కుటుంబం.. అని గిరి గీసుకుంటూ…. తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేస్తున్నవారు ఎందరో ఉన్నారు. కొందరైతే మరీ కఠినంగా… వయోభారం పెరిగిన తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తూ చేతులు దులిపేసుకుంటున్నారు.

అమెరికాలోనో, ఇంకెక్కడో ఉద్యోగాలు చేసుకుంటూ సొంతగడ్డపై ఉన్న పేరెంట్సను మరిచిపోతున్నారు. ఇది మంచిది కాదని ఎవరైనా ఆప్తులెవరైనా అంటే ‘డబ్బు పంపుతున్నాం. వృద్ధాశ్రమాల్లో అన్ని ఏర్పాటు చేసాం’ అని కొందరు పుత్రరత్నాలు చెబుతుంటారు. ఆప్యాయతలు, అనురాగాలు డబ్బుతో కొనలేమని వారు తెలుసుకోలేకపోతున్నారు. తాము వృద్ధులమైనప్పుడు తమ పరిస్థితి కూడా ఇంతే కదా! అన్న నగ్న సత్యాన్నికొందరు విస్మరిస్తున్నారు. ఆస్తిపాస్తులను, అనురాగాన్ని పంచిన అమ్మానాన్నలను అలక్ష్యం చేస్తే భవిష్యత్ లో అలాంటి వేదనలేఎదురవుతాయని వారు అనుకోవడం లేదు.

ఫాదర్స్ డే ఒకరోజు వేడుక కాదు…

జీవితాన్ని బంగారు భవిష్యత్తును తమకు ప్రసాదించిన నాన్న సేవలను గుర్తు చేసుకోవడానికి ‘ఫాదర్స్’ డే అంటూ మొక్కుబడిగా ఒక రోజు ఏదో హడావుడి చేస్తే చాలదు. నాన్న ఆప్యాయతను గుర్తు చేసుకోవడానికి, ఆయనకు సేవ చేయడానికి ఏడాదిలో లున్నా చాలవు.

‘ఫాదర్స్ డే’ పేరిట సందడి చేయడం కొన్ని విదేశాల్లో మొదలైనా, ఆ సంప్రదాయం మన దేశంలోనూ ఇటీవలి కాలంలో వేలం వెర్రిలా మొదలైంది. నాన్న అంతరంగాన్ని చదివి, ఆయనకు అన్నివిధాలా ఆనందం కలిగించడం పిల్లల కనీస కర్తవ్యం. దాన్ని విస్మరించడం ఘోరమైన తప్పు.

నాన్నంటే ఓ నీడ.. వెన్నంటి ఉంటే ఓ గోడ అన్న భావాన్ని ఈతరం పిల్లలు అలవరచుకోవాలి. ఇదిలా ఉండగా తల్లిదండ్రులలో తండ్రిది ప్రత్యేక స్థానం. భారతీయ సంప్రదాయం ప్రకారం తండ్రి ఉత్తర పక్షమైతే, తల్లి దక్షిణ పక్షం. మోక్షమార్గాన్ని చూపేది తండ్రే. తల్లి ఒక నిజం అయితే తండ్రి ఒక నమ్మకం. తల్లి భావోద్వేగాలు అయితే తండ్రి జ్ఞానదీపం.

– అనిల్ కుమార్ శ్రీనీ, సీనియర్ జర్నలిస్టు జనగామ జిల్లా

Related posts

సహకార సొసైటీ ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ

Satyam NEWS

ప్రజావాణి సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

Satyam NEWS

ఆదుకోండి బాబు గారు లేకపోతే లావై పోతారు

Satyam NEWS

Leave a Comment