Slider ప్రత్యేకం

అనపర్తి అరాచకంతో జగన్ ప్రభుత్వానికి చరమగీతం

#raghurama

అనపర్తి అరాచక  ఘటనతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి శుభం కార్డు పడినట్టేనని  సుస్పష్టమైందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు  రఘు రామకృష్ణంరాజు తెలిపారు. మొన్నటి వరకు తమ పార్టీ పాతిక సీట్లలో  విజయం సాధిస్తుందని అనుకున్నాం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది కూడా కష్టమేనని అనిపిస్తోందన్నారు. అనపర్తి లో  పోలీసులు ఒకరకంగా ప్రధాన  ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు పై  దాడి చేసినంత పని చేశారన్నారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి,  సకల శాఖ మంత్రి సజ్జల  రామకృష్ణారెడ్డి,  పోలీసుల అఘాయిత్యాలు నిచ్చెన మెట్లుగా చేసుకొని చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్లారని కొనియాడారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి సంఘటనలు  పునరావృత్తం కాకుండా ప్రజలంతా ఏకమవ్వాలని పిలుపునిచ్చారు.   శనివారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఇది ఒక పార్టీకి వచ్చిన సమస్య కాదని, ప్రజాస్వామ్య వ్యవస్థకు వచ్చిన ముప్పని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్య వాదులంతా స్పందించాలని  విజ్ఞప్తి చేశారు. అనపర్తి ఘటనపై  జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు  విష్ణుకుమార్ రాజు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించిన తీరు పట్ల హర్షం వ్యక్తం చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు తో సహా, ఆ పార్టీ ముఖ్య నేతలు స్పందించాలని సూచించారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా స్ట్రీట్ కార్నర్   సమావేశాలను నిర్వహిస్తోందని, రేపు ఎవరైనా ఆ పార్టీ  పెద్ద నాయకులు  హాజరైనప్పుడు,  జనం అధికంగా వస్తే వారికి ఇదే సమస్య తలెత్తనుందన్నారు.

ఎవరికి వారు మనకెందుకులే అనుకుంటే రేపు మనకు ఇటువంటి సమస్యలే ఎదురయ్యే అవకాశాలు ఉంటాయన్నారు.  తనపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేసి, లాకప్ లో చిత్రహింసలకు గురిచేసి జగన్మోహన్ రెడ్డి ఆనందించినప్పుడే రాష్ట్రంలో ప్రభుత్వ అరాచకం  మొదలయ్యిందన్నారు. తనని లాకప్ లో చిత్రహింసలు పెట్టినప్పుడు, ప్రధాన ప్రతిపక్ష నేత  చంద్రబాబు నాయుడు స్పందించి… ఒక ఎంపీకే రక్షణ లేకపోతే, రేపు సామాన్యుల పరిస్థితి ఏమిటని, ప్రజాస్వామ్యానికి జరగనున్న ప్రమాదాన్ని ముందే గ్రహించి, ప్రతీ ఒక్కరూ స్పందించాలని పిలుపునిచ్చారని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న రోడ్ షోలకు  అనూహ్య ప్రజాదరణ లభిస్తుండడం వల్లే రాష్ట్ర ప్రభుత్వం చీకటి జీవో నెంబర్ 1 తీసుకువచ్చిందని విమర్శించారు. అనపర్తి లో   రోడ్డుపై పోలీసులు

బైఠాయించి, లారీలు ట్రాక్టర్లను అడ్డుపెట్టి చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ని  అడ్డుకోవాలని  ప్రయత్నించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు తీరని మచ్చ అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అప్రజాస్వామిక ధోరణిని అనపర్తి ప్రజలు తీవ్రంగా నిరసించారన్నారు. ఎక్కడైనా రోడ్డుపై ప్రజలు బైఠాయించి నిరసన తెలుపడం చూశామని, కానీ అనపర్తి లో మాత్రం  పోలీసులే రోడ్డు కు అడ్డంగా బైఠాయించడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. 

అనపర్తి రోడ్ షోకు చంద్రబాబు నాయుడుకు తొలుత  అనుమతి ఇచ్చిన  పోలీసులు, ఆఖరి నిమిషంలో రద్దుచేసి  చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ని  అడ్డుకునే ప్రయత్నం చేయడం  దారుణమని మండిపడ్డారు.  చంద్రబాబు నాయుడు రోడ్ షోలకు అశేష ప్రజాదరణ లభిస్తుండడం వల్ల ప్రభుత్వ పెద్దలు కంటగింపుతో  ఈ నిర్ణయం తీసుకొని, ఆఖరి నిమిషంలో అనుమతి రద్దు చేసే విధంగా పోలీసులపై ఒత్తిడి తెచ్చి  ఉంటారన్నారు.

అయినా పోలీసుల చర్యకు వెరవని చంద్రబాబు నాయుడు, 72 ఏళ్ల వయసులోనూ  ఏడు కిలోమీటర్ల దూరం  అలుపెరుగకుండా  పార్టీ కార్యకర్తలు,  అభిమానులు, సానుభూతిపరుల సెల్ ఫోన్ల లైట్ల వెలుతురులో నడుచుకుంటూ అనపర్తికి చేరుకోవడం అరుదైన ఘట్టమని అన్నారు. అనపర్తి లో  సభా వేదికను పోలీసులు కూల్చివేయగా, నిచ్చెన ద్వారా స్కార్పియో వాహనం పైకి   చేరుకొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారని తెలిపారు. సభా ప్రాంగణంలోనూ పోలీసులు  విద్యుత్  సరఫరాను నిలిపివేయగా, సభికులు సెల్ ఫోన్ లైట్లను వెలిగించగా, ఆ వెలుతురులోనే  తన ప్రసంగాన్ని పూర్తి చేశారన్నారు. పోలీసులు తనను పెట్టిన కష్టాలు , ప్రజలు పడుతున్న కష్టాలను వివరిస్తూ సాగిన  చంద్రబాబు ప్రసంగానికి అపూర్వ స్పందన లభించిందని రఘురామకృష్ణంరాజు తెలిపారు.

Related posts

తెలంగాణలో రేపటి నుంచి సినిమా థియేటర్లు మూత

Satyam NEWS

రాజంపేట గడ్డపైన ఎర్రజెండా ఎగరేస్తాం

Satyam NEWS

దేశానికి కొత్త దిశ చూపిస్తున్న మోడీ ముందు చూపు

Satyam NEWS

Leave a Comment