29.7 C
Hyderabad
May 7, 2024 03: 10 AM
Slider ప్రత్యేకం

ఇప్పడు జరుగుతున్న గేమ్ ముందే చెప్పిన రాధాకృష్ణ

#AndhraJyothi

‘‘రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో సన్నిహితంగా మెలిగిన వారందరూ జగన్ కంటే షర్మిల ఎక్కువ మొండి అని చెబుతున్నారు.

ఆమె ఒక నిర్ణయానికి వస్తే మార్చడం ఎవరితరంకాదని వారంటున్నారు’’ జనవరి 24వ తేదీన ఆంధ్రజ్యోతి ప్రచురించిన వార్తలో ప్రముఖంగా ఉన్నవి ఈ వాక్యాలు.

షర్మిలా రెడ్డి కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ గత మూడు నెలల నుంచి చర్చలు జరుగుతున్నాయి అని ఇప్పుడు చెబుతున్నవారు ఎవరూ కూడా ఇంతకు ముందు ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పలేదు.

ఆ విషయాన్ని చెప్పిన ఏకైక వ్యక్తి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. షర్మిలారెడ్డి కొత్త పార్టీ పెట్టబోతున్నారని, అదీ కూడా తెలంగాణ లో కొత్త పార్టీ ప్రారంభించేందుకు అన్ని సిద్ధం చేసుకున్నారని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసినప్పుడు ఎవరూ నమ్మలేదు.

పైగా ఎల్లో మీడియా కాబట్టి అలానే రాస్తుంది, అన్నా చెల్లెళ్లకు మధ్య విభేదాలు వస్తాయా? అంటే ఆవేశంగా ప్రశ్నించిన జగన్ భక్తులు కూడా చాలా మంది ఉన్నారు.

ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తను రెండు రోజుల తర్వాత షర్మిలా రెడ్డి ఖండించినప్పుడు సంతోషించిన వాళ్లు చాలా మంది ఉన్నారు. ‘‘నేను చెప్పానా, ఆంధ్రజ్యోతి లో రాసింది తప్పు అని, ఇప్పుడు చూడు షర్మిల ఏం చెప్పారో’’ అంటూ దీర్ఘాలు తీసిన వారు కూడా ఉన్నారు.

ఎల్లో మీడియా ఇప్పుడు ఏం సమాధానం చెబుతుంది అంటూ ఆవేశంగా ప్రశ్నించిన వారు కూడా ఉన్నారు. షర్మిలా రెడ్డి ఖండన పంపిన తర్వాత కూడా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తొణకలేదు. పరువునష్టం దావా వేస్తానని ఆమె హెచ్చరించినా కూడా రాధాకృష్ణ భయపడలేదు.

పైగా ‘‘ నీవు పట్టుకునే బైబుల్ పై ప్రమాణం చేసి చెప్పు…. పార్టీ పెట్టడం లేదని’’ అంటూ ఎదురు సవాల్ విసిరారు. షర్మిలారెడ్డి తెలంగాణలో రాజకీయ పార్టీని ప్రారంభించడం జరిగితే ఏపి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి విశ్వసనీయతకు గండి పడుతుందని వైఎస్ కుటుంబ సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు అని కూడా రాధాకృష్ణ రాశారు.

ఇదే విషయాన్ని ఖరారు చేస్తున్నట్లుగా షర్మిల హైదరాబాద్ లో సమావేశం ప్రారంభించగానే తాడేపల్లి నుంచి ఖండన రావడం మొదలు పెట్టింది.

రాజకీయాలు, షర్మిల పార్టీ పెట్టడం వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే విషయాలు పక్కన పెడితే ‘‘ఎల్లో మీడియా రాధాకృష్ణ’’ రాసిందే షర్మిలా రెడ్డి ఫాలో అయ్యారు. ఈ విషయాన్ని అందరికన్నా ముందుగా పబ్లిక్ లో పెట్టిన రాధాకృష్ణను ఈ సందర్భంగా అభినందించకతప్పదు.

Related posts

అక్రమ సంబంధం కారణంగా ఒకని దారుణ హత్య

Satyam NEWS

రెండు రాష్ట్రాల్లో బిజెపికి సీట్లు తగ్గడం శుభ సూచకం

Satyam NEWS

దేవరకొండ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు

Satyam NEWS

Leave a Comment