40.2 C
Hyderabad
May 2, 2024 17: 41 PM
Slider సంపాదకీయం

ఇప్పటికైనా వెన్నెముక ఆధారంగా నిటారుగా నిలబడతారో లేదో??

#AndhraPradeshSecretariat

ఆంధ్రప్రదేశ్ లో ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు భయం భయంగా ఎలా బతుకుతున్నారో నేడు తేటతెల్లం అయింది. చాలా కాలంగా ఈ పరిస్థితిపై చర్చలు జరుగుతున్నా నేడు అధికారికంగా రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుతో వారి దీన స్థితి బాహ్య ప్రపంచానికి వెల్లడి అయింది.

పైకి చెప్పుకోలేక లోలోన తమ పరువుపోతున్నదని ఆవేదన చెందుతున్న ఐఏఎస్ లు ఐపిఎస్ లు లెక్కకు మించి ఉన్నారనేది అధికారికంగా ఎవరూ చెప్పరు కానీ వాస్తవమే అది. గతంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి లాంటి అత్యున్నత పదవుల్లో ఉన్న వారు కూడా కోర్టు గడపతొక్కారు.

ఆంధ్రప్రదేశ్ లో డిజీపీగా ఉన్నప్పుడు గౌతమ్ సవాంగ్ ను సంబంధిత సెక్షన్లను హైకోర్టు చదివించింది. అప్పుడే రాష్ట్రంలో ఐఏఎస్, ఐపిఎస్ అధికారుల పరువు పోయిందని చెప్పవచ్చు. ప్రభుత్వంలో బాధ్యత అంతా అధికారులపైనే ఉంటుంది. మంత్రులు, ముఖ్యమంత్రులపై బాధ్యత ఉండే అవకాశం లేదు. ఎందుకంటే అన్ని ఉత్తర్వులు అధికారుల పేరు మీదే విడుదల అవుతాయి.

మంత్రులు ముఖ్యమంత్రులు కేవలం మౌఖిక ఆదేశాలు ఇస్తే అధికారులు పాటించరాదు. మంత్రులను ముఖ్యమంత్రులన లిఖితపూర్వక ఆదేశాలు ఇస్తేనే వాటిని అమలు జరుపుతామని ఐఏఎస్ లేదా ఐపిఎస్ అధికారులు చెప్పగలగాలి. ఇలా అందరూ చెప్పగలిగితే… అందరూ కాకపోయినా ఎక్కువ మంది చెప్పగలిగితే మంత్రులు లేదా ముఖ్యమంత్రులు తమ ఇష్టం వచ్చినట్లు రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తించలేరు.

రాష్ట్ర ప్రభుత్వం ఏ పని చేయాల్సినా అందుకు సంబంధించిన చట్టాలు చేసుకోవాలి. ఆ చట్టాలను రాజ్యాంగానికి లోబడి ఉండాలి. అలా చేసిన చట్టాలను మాత్రమే పాటించాలి. తాము చేసిన చట్టాలకు తామే విరుద్ధంగా ప్రవర్తించినా లేక తాము చేసిన చట్టాలు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విఘాతం కలిగించేవిగా ఉన్నా న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటాయి… ఆ తప్పును సరిదిద్దుతాయి.

అందువల్లే ‘‘చట్టప్రకారం మాత్రమే’’ చర్యలు తీసుకుంటాం అని ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు నిర్ద్వందంగా చెప్పాలి. అలా నిక్కచ్చిగా ఉంటే పెద్ద పోస్టింగ్ రాకపోవచ్చు కానీ కచ్చితంగా సమాజంలో గౌరవం మాత్రం ఎక్కువగానే దొరుకుతుంది.

పైగా ఐఏఎస్, ఐపిఎస్ లకు ఉద్యోగం అంత సులభంగా పోదు. కారు బంగ్లా అటెండర్ వారు సర్వీసులో చేరిన నాటి నుంచి పదవి విరమణ చేసే వరకూ ఉంటాయి. మరి వీరు ఇంతగా అధికారంలో ఉన్నవారికి అడుగులకు మడుగులు వత్తాల్సిన అవసరం లేదు.

పాఠశాలల్లో గ్రామ సచివాలయాల ఏర్పాటు చేయొద్దన్న హైకోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడంపై తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 8 మంది ఐఏఎస్‌లకు 2వారాల పాటు జైలుశిక్ష, జరిమానా విధించడంతో ఈ చర్చ మళ్లీ చేయాల్సి వస్తున్నది. పాఠశాల ఆవరణలో ఎటువంటి ప్రభుత్వ భవనాలు నిర్మించకూడదని గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను అధికారులు పట్టించుకోలేదు.

దాంతో ఐఏఎస్‌ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్‌, రాజశేఖర్‌, చినవీరభధ్రుడు, విజయ్‌కుమార్‌, జె.శ్యామలరావు, శ్రీలక్ష్మి, ఎంఎం నాయక్‌లకు ఈ మేరకు హైకోర్టు శిక్ష విధించింది. పాఠశాల ఆవరణలో ప్రభుత్వ భవనాలు నిర్మించవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత సంబంధిత అధికారులు అప్రమత్తమై ఈ మేరకు సంబంధిత మంత్రులపై వత్తిడి తీసుకువచ్చి అక్కడ నిర్మాణాలు జరగకుండా చూడాల్సింది.

ఇలా చేస్తే ఏమై ఉండేది? సంబంధిత పంచాయితీరాజ్ శాఖ నుంచో, పాఠశాల విద్య శాఖ నుంచో లేదా సంబంధిత శాఖ నుంచో ఆ అధికారిని బదిలీ చేసేవారు…. ఆ తర్వాత వచ్చే అధికారి కూడా ఇదే మాట చెబితే? ఇంకో అధికారి… ఇలా ఎంత మందిని మారుస్తారు? ఒకరిద్దరి కన్నా మార్చుకోలేరు కాబట్టి అధికారులు చెప్పినట్లే వినే స్థితికి ప్రభుత్వంలో పెత్తనం చెలాయించే వారు వస్తారు.

అలా కాకుండా బాధ్యత మరచి ఆదేశాలిచ్చే మంత్రులు, ముఖ్యమంత్రుల మాట వింటే ఇలానే జరుగుతుంది. నేడు శిక్ష పడ్డ అధికారులంతా బేషరతుగా కోర్టును క్షమాపణ కోరాల్సిన దయనీయమైన పరిస్థితి వచ్చింది. సమాజ సేవ చేస్తామని అధికారులు చెప్పడంతో ఆ ఉత్తర్వులను హైకోర్టు సవరించింది.

సంక్షేమ హాస్టళ్లలో నెలలో ఒకరోజు వెళ్లి సేవ చేయాలని, ఒకరోజు పాటుకోర్టు ఖర్చులు భరించాలని ఐఏఎస్‌లను హైకోర్టు ఆదేశించింది. గత మూడు సంవత్సరాలలో హైకోర్టులో అక్షింతలు పడ్డ అధికారులు ఎంతో మంది ఉన్నారు. అయినా ఎవరూ అదేమని అడగడం లేదు.

ఈ సారి హైకోర్టు ఇచ్చిన షాక్ ట్రీట్ మెంట్ తో అయినా అధికారులలో మార్పు రావాలి. ఇంతకు ముందు చీఫ్ సెక్రటరీలు, డీజీపీలు కోర్టు మెట్టు ఎక్కితేనే మారలేదు… ఇప్పుడు మారతారా అని ఎవరైనా ప్రశ్నిస్తే దానికి సమాధానం ఉండదు……

Related posts

నిరుపేదల పాలిట వరం.. సీఎంఆర్ఎఫ్ పథకం

Satyam NEWS

లిస్టు పెట్టుకుని కక్ష సాధిస్తున్న వైఎస్ జగన్

Satyam NEWS

25వరకు పలు రైళ్లు రద్దు

Bhavani

Leave a Comment