మెహుల్ చోక్సీతో కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.13, 570 కోట్ల మోసం చేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీపై మరో క్రిమినల్ కేసు నమోదు అయింది. కంపెనీ డైరక్టర్లలో ఒకరైన ఆశిష్ మోహన్భాయ్ లాడ్ ను చంపేస్తానని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయని సీబీఐ తెలిపింది.
కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీ కంపెనీ డైరక్టర్లలో ఆశిష్ లాడ్ కూడా ఉన్నారు. ఈ కేసులో ఆశిష్ లాడ్ అరెస్ట్ అవకుండా ఉండేందుకు దుబాయ్ ద్వారా కైరో వెళ్లి తలదాచుకున్నాడు. జూన్ 2018లో మళ్లీ ఇండియాకు తిరిగి వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నఆశిష్ లాడ్‌ను తన సోదరుడు నేహాల్ మోదీ ద్వారా నీరవ్ మోదీ ఫోన్‌లో బెదిరింపులకు పాల్పడినట్లు తమ దర్యాప్తులో తేలిందని సీబీఐ కోర్టుకు స్పష్టం చేసింది.
నీరవ్‌మోదీ మాట్లాడక ముందు అతని సోదరుడు నేహాల్ మోదీ యూరోపియన్ కోర్టులో నీరవ్ మోదీకి అనుకూలంగా సాక్ష్యం చెప్పాలంటూ ఆశిష్‌కు రూ. 20 లక్షలు ఆఫర్ చేశారు. ఆశిష్ లాడ్ తిరస్కరించడంతో చంపేస్తామంటూ నీరవ్ మోదీ బెదిరింపులకు పాల్పడినట్లు సీబీఐ పేర్కొంది. ఈ కేసులో అరెస్ట్ కాకుండా ఉండేందుకు నీరవ్‌మోదీ విదేశాలకు పారిపోయాడు.
దీంతో నీరవ్ మోదీని తిరిగి రావాలంటూ భారతదేశానికి చెందిన పలు దర్యాప్తు సంస్థలు, కోర్టులు సమన్లు జారీ చేసిన తిరిగి రాకపోవడంతో అతనిపై ఫ్యజిటివ్ ఎకనమిక్ అపెండర్ చట్టం కింద పలాయన ఆర్థిక నేరస్తుడిగా పేర్కొంది. నీరవ్ మోదీ ప్రస్తుతం నైరుతి లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో ఉన్నాడు.