28.7 C
Hyderabad
April 26, 2024 08: 33 AM
Slider ప్రత్యేకం

విఆర్వోలు ఫినిష్… నెక్ట్స్ ఎంఆర్వోలా?ఎంపిడివోలా? సబ్ రిజిస్ట్రార్ లా?

#Telangana CM KCR 1

రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ఉపక్రమించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే వీఆర్వో లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరొక అడుగు ముందుకు వేసేందుకు కూడా సిద్ధం అయినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

ప్రస్తుతం సమాంతరంగా పని చేస్తున్న పంచాయితీరాజ్ శాఖలో ఎంపిడివో లు, రెవెన్యూ శాఖ కు చెందిన ఎంఆర్ వో లు సబ్ రిజిస్ట్రార్ ల వ్యవస్థలలో ఒక దానిని మాత్రమే ఉంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ యోచిస్తున్నారని అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనకు కేసీఆర్  శ్రీకారం చుట్టారని సత్యం న్యూస్ వెల్లడించిన తర్వాతే అన్ని మీడియా సంస్థలు దానిపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వీఆర్వో లను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అకస్మాత్తుగా ప్రకటించారు.

కేవలం కొన్ని గంటల సమయం మాత్రమే ఇచ్చి వీఆర్వోల నుంచి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ముందే తెలిస్తే రికార్డులు తారుమారు అయ్యే అవకాశాన్ని పసిగట్టిన సిఎం కేపీఆర్ ఆకస్మికంగా ఈ నిర్ణయాన్ని ప్రకటించి అమలు చేశారు.

ఏది చేసేదీ ఆ ముగ్గురికే తెలుసు

రెవెన్యూ శాఖకు సంబంధించిన నిర్ణయాలను ఆయన ఎవరితో చర్చించకుండానే స్వయంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొందరి నుంచి కేవలం అభిప్రాయాలు మాత్రమే తెలుసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో బాటు సలహాదారుడు రాజీవ్ శర్మ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ లకు మాత్రమే రెవెన్యూ సంబంధిత అంశాలలో జోక్యం వుంటున్నది.

ఎంపిడివోలు, ఎంఆర్ఓలు, సబ్ రిజిస్ట్రార్ లు దాదాపుగా ఒకే పని చేస్తున్నారు. ఒకే పనితో ముగ్గురికి లింక్ ఉంటున్నది. అంటే ఒకే పనిని ముగ్గురి వద్దకు తిరిగితే తప్ప పని పూర్తి కాదు. దీనివల్ల లంచాలు పెరిగిపోతున్నాయి తప్ప సమస్యలు పరిష్కారం కావడం లేదు.

రెవెన్యూ సిబ్బందిని కదిలిస్తే అవినీతి నిరోధక శాఖ వారికి కోట్ల రూపాయలు దొరుకుతున్నాయి. అందుకోసమే మూడు సమాంతర వ్యవస్థల వల్ల ప్రభుత్వానికి భారమే తప్ప లాభం లేదని ముఖ్యమంత్రి ఒక స్థిర నిర్ణయానికి వచ్చారని అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో అవినీతి తాండవిస్తున్నది. ఆ తర్వాత ఎంఆర్ వో లు అదే పనిని సర్టిఫై చేయడానికి లంచాలు గుంజుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీరిపైన ఉండే ఆర్ డి వోల వ్యవస్థ కు అర్ధమే లేకుండా పోతున్నది. తహసీల్దార్ కు కలెక్టర్ కు మధ్య ఆరో వేలు లాగా ఆర్ డి వో లు ఉంటున్నారు.

గతంలో జిల్లాకు ఒక ఐఏఎస్ అధికారి ఉండేవారు కాగా ఇప్పుడు సహాయ కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయారు. చాలా ప్రభుత్వ శాఖల్లో సిబ్బంది లేక అల్లాడుతుంటే రెవెన్యూ శాఖలో ఒకే పనిని ముగ్గురు చేస్తున్నారు.

అందుకే ఎంఆర్ఓ, ఎంపిడివో, సబ్ రిజిస్ట్రార్ లలో ఒక్క వ్యవస్థే మిగిలేలా కనిపిస్తున్నది. భూమికి సంబంధించిన అన్ని పనులూ ఒకే చోట జరిగే విధంగా నూతన వ్యవస్థను తీసుకురావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు.

క్వాసీ జ్యుడీషియల్ అధికారాలపై కూడా సమీక్ష?

వీరికి ప్రస్తుతం ఉన్న క్వాసీ జ్యుడీషియల్ అధికారాలను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షిస్తున్నారు. అందుతున్న సమాచారం మేరకు ఎంపిడివో వ్యవస్థను ఉంచి మిగిలిన రెండు వ్యవస్థలను ముఖ్యమంత్రి రద్దు చేయబోతున్నట్లు తెలిసింది.

అదే విధంగా ఆర్ డి వో వ్యవస్థకు కూడా ఇక మంగళం పాడే అవకాశం కనిపిస్తున్నది. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ తుది నిర్ణయం తీసుకోలేదు.     

Related posts

తెలంగాణ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

Bhavani

నో సిన్:కేటీఆర్ కేసీఆర్ లను కట్టేసి కొట్టినా పాపం లేదు

Satyam NEWS

అమిత్ షా ను కలసిన ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

Satyam NEWS

Leave a Comment