28.7 C
Hyderabad
April 27, 2024 06: 18 AM
Slider కడప

మహాశివరాత్రి ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావద్దు

#KadapaCollector

శైవ భక్తులకు అత్యంత భక్తి ప్రాధాన్యమైన మహాశివరాత్రి పర్వదిన మహోత్సవాల ఏర్పాట్లను పటిష్టంగా నిర్వహించి.. ఉత్సవాలను  విజయవంతం చేయాలని కడప జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.గౌతమి సంబంధిత అధికారులను ఆదేశించారు.

మార్చి 11న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని.. శుక్రవారం కలెక్టరేట్ లోని స్పందన హాలులో.. జిల్లాలోని అన్ని ప్రముఖ శైవక్షేత్రాల్లో మహాశివరాత్రి ఉత్సవ నిర్వహణ ఏర్పాట్లపై..జిల్లా అడిషనల్ ఎస్పీ ఖాసిం సాహెబ్ తో కలిసి దేవాదాయ శాఖ, రెవెన్యూ, పోలీసు, ఆర్అండ్ బి, పంచాయతీ రాజ్, విద్యుత్తు, వైద్య ఆరోగ్య, రవాణా, ఏపీఎస్ ఆర్టీసీ, మునిసిపాలిటీ, అగ్నిమాపక తదితర శాఖల అధికారులతో జేసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్బంగా జేసి మాట్లాడుతూ… జిల్లాలో ప్రధానంగా పెండ్లిమర్రి మండలంలోని పొలతల శ్రీ మల్లీశ్వర స్వామి దేవస్థానం, సిద్దవటం మండలం వంతాటిపల్లిలోని శ్రీ నిత్యపూజ స్వామి దేవస్థానం, రాజంపేట మండలం అత్తిరాళ్ల గ్రామంలోని శ్రీ త్రైతేశ్వర స్వామి దేవస్థానం, రాయచోటిలో శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం, బ్రహ్మంగారిమఠం మండలంలోని కందిమల్లయ్య పల్లిలోని శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం శ్రీ ఈశ్వరి దేవి మఠం, ప్రొద్దుటూరు మండలంలోని శ్రీ అగస్తేశ్వర స్వామి దేవాలయం, గోపవరం మండలం ఓబులం గ్రామపరిధిలో శ్రీ మల్లెం కొండేశ్వరస్వామి దేవాలయం, చాపాడు మండలం అల్లాడిపల్లిలోని శ్రీ వీరభద్ర స్వామి దేవాలయం, బద్వేలు మండలం లంకమల్ల గ్రామంలోని శ్రీ లంకమల్లేశ్వర స్వామి దేవాలయం, ఓబులవారిపల్లి మండలం గుండాలకోన లోని శ్రీ గుండాలేశ్వర స్వామి దేవాలయం,

లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురం గ్రామం లోని శ్రీ గంగమ్మ దేవాలయం, మైలవరం మండలంలోని అగస్తికోన లోని శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవాలయం, జమ్మలమడుగు మండలంలోని కన్యతీర్థం నందు గల శ్రీ ఈశ్వర స్వామి దేవాలయం, ఖాజీపేట మండలం లోని పుల్లూరు గ్రామంలోని శ్రీ నాగేశ్వర స్వామి దేవాలయం… మొదలయిన 15 శైవక్షేత్రాల్లో అధిక సంఖ్యలో భక్తులు హజరవుతారని, వారందరికీ ఎలాంటి లోటుపాట్లు, ఇబ్బందులు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని సంబందిత ఆలయాల ఈఓలను ఆదేశించారు. మార్చి 10 నుంచి 12 వరకు 3 రోజులపాటు ప్రతి క్షేత్రం వద్ద ఖచ్చితంగా పిఎ సౌండ్ సిస్టం ను ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో శానిటేషన్ పనులు సంబంధిత అధికారులతో సమన్వయమై పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.

సదరు దేవాలయాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కలిసి త్రాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. అలాగే ఆలయాల వద్ద క్యూలైన్ల బ్యారికేడింగ్, పోలీస్ శాఖతో సమన్వయం చేసుకొని బందోబస్తు పటిష్టంగా ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి శైవక్షేత్రం వద్ద విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని, వైద్య శిబిరం, అగ్నిమాపక శిబిరం ఏర్పాటు చేయాలనీ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ప్రముఖ శైవ క్షేత్రాలకు వెళ్ళే రహదారులన్నీ బాగుండేలా చర్యలు తీసుకోవాలని, అవసరం అయిన చోట ముళ్ళపొదల తొలగింపు, రహదారుల మరమ్మతులు చేయాలనీ ఆర్ అండ్ బి, పంచాయతిరాజ్, అటవీశాఖ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్, బందోబస్తులను ప్రణాళిక ప్రకారం చేపట్టాలని పోలీస్ శాఖ, రవాణాశాఖ  అధికారులను, అవసరమైన మేర బస్సులు ఏర్పాటు చేయాలనీ ఆర్టీసి వారిని, ఆలయాల బయటి ప్రదేశాలలో పారిశుద్ధ్య నిర్వహణ చక్కగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి చోటా తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని పంచాయతి, మునిసిపల్ అధికారులకు సూచించారు. గత సంవత్సరం ఉత్సవాలలో ఎదుర్కొన్న సమస్యలపై దృష్టి సారించాలని, ముఖ్యంగా ద్వి చక్ర, ఫోర్ వీలర్ వాహనాలు, బస్సులు తదితరాల పార్కింగ్ ప్రదేశాలు, త్రాగునీటి, శానిటేషన్ ఏర్పాట్లు తదితరాలలో తీసుకోవాల్సిన చర్యలపై తాసిల్దార్, ఎంపిడివో, పోలీస్, అటవీ, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, టెంపుల్ ఈఓలు సంయుక్తంగా వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనీ చెప్పారు. ఈ కార్యక్రమాలన్ని ఆయా డివిజన్ స్థాయి సబ్ కలెక్టర్లు, ఆర్దిఓ లు తగువిధంగా పర్యవేక్షణ చేయాలనీ జేసి పేర్కొన్నారు.

కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా… ఇళ్ళ వద్దనే పూజలు శ్రేయస్కరం

కోవిడ్ నేపధ్యంలో శైవక్షేత్రానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమన్వయంగా పటిష్ట ఏర్పాట్లు చేయండి. ప్రతి క్షేత్రం వద్ద ధర్మల్ స్క్రీనింగ్, మాస్కులు, శానిటైజర్ ఏర్పాట్లు వుండాలన్నారు. భక్తులందరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలని, మాస్కు లేని వారికి ప్రవేశం లేదనే విషయాన్ని ప్రచారం చేయాలన్నారు. కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా… భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రాకూడదు. భక్తిశ్రద్దలతో ఇళ్ళ వద్దనే పూజలు చేసుకోవడం ఎంతో శ్రేయస్కరం. ఈ  విషయాన్ని కూడా ఆయా ప్రాంతాలలో విస్తృతంగా అవగాహనా కల్పించాలని సూచించారు. కోవిడ్ దృష్ట్యా కోనేరులలో దిగి స్నానాలు చేయకుండా అన్ని కోనేరుల చుట్టూ బ్యారికేడింగ్ చేయాలనీ, కోనేరు నుంచి ఒక పైపు లైను ఏర్పాటు చేసి కోనేరు నీటిని తలపై ప్రోక్షించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఎన్నికల ప్రవర్తన నియమావళిని పాటించాలి

మునిసిపల్ ఎన్నికల కోడ్ అమలులో వుందని, ఉత్సవాల లోపు జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం వుంది కాబట్టి ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఎవ్వరు అతిక్రమించకుండా జాగ్రత్త వహించాలన్నారు. మండల ఎంసిసి బృందాలు అప్రమతంగా వుండాలని, ఆలయాల వద్ద, పరిసర ప్రదేశాలలో రాజకీయ పార్టీల హోర్డింగ్స్, కటౌట్లు, బ్యానర్లు, ఫ్లేక్సిలు లేకుండా చూడాలని, ఎవరైనా ఏర్పాటు చేస్తే వాటిని వెంటనే తొలగించి, ఎన్నికల మార్గదర్శకాల మేరకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.

అనంతరం సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పి ఖాసిం సాహెబ్ మాట్లాడుతూ… మహా శివరాత్రి పండుగ సందర్భంగా అన్ని శైవక్షేత్రాలలో పోలీసు బందోబస్తు ఉండేవిధంగా చర్యలు తీసుకుంటామని, ట్రాఫిక్ క్రమబద్ధీకరించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని, అవసరమైన చోట అధిక పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. సమావేశంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమీషనర్ శంకర్ బాలాజీ మాట్లాడుతూ… అన్ని ప్రముఖ శైవ క్షేత్రాలలో భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని, కోవిడ్ నేపధ్యంలో… దేవాదాయ శాఖ కమీషనరేటు నుండి మార్గదర్శకాలు జారీ చేసారని, వాటి మేరకు పటిష్ట చర్యలు తీసుకున్నామన్నారు. ఇందులో భాగంగా ఆ రోజులలో అధిక సంఖ్యలో వచ్చే భక్తులను దృష్టిలో వుంచుకొని ఆలయాలలో అభిషెకాలు, అర్చనలు చేయడం జరగదన్నారు. అలాగే ఏర్పాట్ల పూర్తిపై అన్ని ఆలయాల ఈఓలు సంబంధిత శాఖల అధికారులకు లేఖలు వ్రాయాలని పేర్కొన్నారు. అనంతరం మహా శివరాత్రి ఉత్సవాలకు సంబంధించిన ప్రచార పోస్టర్లను జేసి, అడిషనల్ ఎస్పీ తదితరులు ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో పి.ధర్మచంద్రారెడ్డి, సబ్ కలెక్టరు ఐ. పృథ్వి తేజ్, ఆర్దిఒ నాగన్న, డిఎస్పిలు, సబ్ ఇన్స్పెక్టర్లు,   మున్సిపల్ కమిషనర్లు, తాసిల్దారులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈఓలు, విద్యుత్, ఫైర్, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, ఆర్టిసి, ఎక్సైజ్ తదితర శాఖల అధికారులు  పాల్గొన్నారు.

Related posts

వైద్యం అందక విలేఖరి గుండె పోటు తో మృతి

Satyam NEWS

సల్బతాపూర్ ఆలయంలో కల్యాణ మండపం

Satyam NEWS

యంగ్ హీరో లకు సీపీ సవాల్

Bhavani

Leave a Comment