28.7 C
Hyderabad
April 27, 2024 04: 39 AM
Slider సంపాదకీయం

ఆశ లావు పీక సన్నం: విఫలమైన ‘జాతీయ స్వప్నం’

#National Dream

జాతీయ రాజకీయాల్లో తమ తడాఖా చూపించాలనుకుని వచ్చిన చాలా మంది నేతలు ఇప్పుడు చతికిలబడి కూర్చుకొన్నారు. శరద్ పవార్, మమతా బెనర్జీ లాంటి వారు కూడా కాంగ్రెస్ ను ఆలంబనగా చేసుకుని రాజకీయాలు నడిపి ఆ పార్టీపైనే పెత్తనం చేయాలని చూశారు. కూర్చున్న కొమ్మను నరుక్కున్న చందంగా సాగిన వీరి రాజకీయాలు నరేంద్రమోదీ ప్రాభవం ముందు చతికిలపడిపోయాయి. చాలా మంది ప్రాంతీయ నాయకులు ఎంతో ఆశతో జాతీయ పార్టీలను ప్రారంభించి పక్క రాష్ట్రాలలో కూడా ప్రవేశించలేని స్థితిలో ఉండిపోయారు. దేశంలోనే సీనియర్ నాయకుడైన శరద్ పవార్ తన మిత్రులైన తారిక్ అన్వర్, పిఏ సంగ్మాలతో కలిసి స్థాపించిన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర బోర్డర్ దాటి బయటకు రాలేకపోతున్నది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తమ రాజకీయ ప్రతిభతో కాంగ్రెస్ పార్టీని ఇబ్బందుల పాలు చేసేవారు. కేంద్రంలో తమ వంతు షేర్ సాధించుకుంటూ ఎప్పటికప్పుడు అధికారం చెలాయించే వారు తప్ప రాజకీయంగా వేరే రాష్ట్రాలలో ఎక్కడా ప్రభావం చూపించలేదు.

అదే విధంగా కాంగ్రెస్ తానులో ముక్కలాగా ఉండి బయటకు వచ్చిన మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆ పార్టీని ఒక ఆట ఆడుకున్నారు. పక్క రాష్ట్రాల్లో ప్రతిష్ట నిలుపుకోవడానికి ఏ ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఇప్పుడు నరేంద్రమోదీ ని సవాల్ చేయడం అటుంచి ఆయనకు శాల్యూట్ చేసి పక్కన నిలబడుతున్నారు. జనతా దళ్ (యునైటెడ్) నాయకుడు నితిష్ కుమార్ కూడా ప్రధాని అభ్యర్ధిగా పలుమార్లు తెరపైకి వస్తారు తప్ప బిహార్ రాష్ట్రం దాటి ఏనాడూ బయటకు రాలేదు. ఆయన పార్టీ మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ లలో కొద్ది పాటి ప్రభావం చూపుతూ ఉంటుంది.

అదే తానులో ముక్క అయిన జనతా దళ్ (సెక్యులర్) పార్టీని స్థాపించిన మాజీ ప్రధాని హెచ్ డి దేవెగౌడ పరిస్థితి కూడా అంతే కర్నాటకలోనే ప్రభావం చూపించలేకపోతున్న ఈ పార్టీకి జాతీయ ఆశలు చాలా ఉన్నాయి. మాయావతి అధ్యక్షురాలుగా ఉన్న బహుజన సమాజ్ పార్టీ కూడా ఇదే పరిస్థితిలో ఉంది. జాతీయ స్థాయిలో దాదాపు అన్ని రాష్ట్రాలలో పోటీ చేస్తున్న ఈ పార్టీ జాతీయ పార్టీ గా కాదు కదా సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ లో కూడా ప్రస్తుతం ఎలాంటి ప్రభావం చూపించలేని స్థితిలో ఉన్నది. ఒక దశలో ప్రధాన మంత్రి అభ్యర్ధిగా ముందుకు వచ్చిన మాయావతి ఇప్పుడు తన పార్టీ అస్తిత్వం కోసం పోరాడుతున్నారు. తాజాగా రాజకీయ సంచలనం గా మారిన అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో రెండో సారి గెలవడం, పంజాబ్ లో అధికారం హస్తగతం చేసుకోవడంతో ఆయనే మోదీకి తదుపరి ప్రత్యామ్నాయం అనే స్థితికి వెళ్లారు.

అయితే గుజరాత్ లో ఆయన పార్టీ ఎలాంటి ప్రభావం చూపించకపోవడంతో కేజ్రీవాల్ జాతీయ గ్రాఫ్ డౌన్ అయింది. ఢిల్లీ మునిసిపల్ ఎన్నికల్లో గెలిచిన అనంతరం మోదీకి ఆయన శాల్యూట్ చేయడమే కాకుండా మీరే కాపాడాలి అనే రీతిలో మాట్లాడారు. ఇక ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్న ఫరూక్ అబ్దుల్లా లాంటి వాళ్లు వారి వారి సొంత రాష్ట్రం దాటే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీనే కేవలం రెండు రాష్ట్రాలలో మాత్రమే అధికారంలో ఉన్న ఈ పరిస్థితుల్లో ఈ ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయికి ఎదుగుతాయా? ప్రస్తుతం ప్రాంతీయ పార్టీ అయిన టీఆర్ఎస్ పేరు మార్చుకుని బీఆర్ఎస్ గా జాతీయ రాజకీయాలలోకి వెళుతున్న నేపథ్యంలో జాతీయ రాజకీయ పార్టీ నేతలపై విస్త్రత చర్చ జరుగుతున్నది.

Related posts

రాత్రి సమయంలో బాలికల వసతి గృహాన్ని సందర్శించిన కలెక్టర్

Satyam NEWS

ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపుతోనే హుజూర్ నగర్ అభివృద్ధి

Satyam NEWS

జగన్ చర్యలతో ఘోషిస్తున్న పర్యావరణం

Satyam NEWS

Leave a Comment