హైదరాబాద్‌లోని మంత్రి మల్లారెడ్డికి చెందిన మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో దారుణం జరిగింది. కళాశాలలోని ప్రయోగశాలలో ఓ విద్యార్థినిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ అత్యాచారానికి తెగబడ్డాడు. పేట్‌బషీరాబాద్ పోలీసుల కథనం ప్రకారం నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ఎర్రవల్లికి చెందిన మల్లకంటి వెంకటయ్య తార్నాకలో ఉంటూ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు.
సోమవారం సాయంత్రం ప్రయోగం కోసమంటూ ఓ విద్యార్థినిని ల్యాబ్‌కు పిలిచిన వెంకటయ్య తలుపులు మూసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అదే రోజు బాధితురాలు తనపై జరిగిన దారుణం గురించి కుటుంబ సభ్యులకు చెప్పగా, వారు నిన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంకటయ్యను అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం బాధిత విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు.