కొల్లాపూర్ ప్రాంత ప్రజలకు ఒక శుభవార్త. కొల్లాపూర్ లో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో రక్తం నిల్వ చేసే సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఇది రక్తం అవసరమైన రోగులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఇప్పటి వరకూ కొల్లాపూర్ ప్రాంతంలో రక్తం అవసరమైన రోగులకు ఎంతో దూర ప్రాంతం నుంచి ఆ అవసరం తీర్చాల్సి వస్తున్నందున అత్యవసర రోగులకు ప్రాణం మీదికి వస్తున్నది. ఈ కారణంతో 45 లక్షల రూపాయల వ్యయంతో కొల్లాపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో రక్త నిల్వ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన వస్తుసామాగ్రి వచ్చింది. గది నిర్మాణం కూడా పూర్తి అయితే రక్త నిల్వ కేంద్రం కొల్లాపూర్ లో అందుబాటులోకి వస్తుంది. కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పనులు పూర్తి చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. కొల్లాపూర్ లో రక్త నిల్వ కేంద్రం ఎంతో కాలంగా అవసరం ఉన్నా కొల్లాపూర్ ప్రాంతానికి చెందిన కే.మదన్ మోహన్ రావు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ విభాగానికి ప్రధాన కార్యదర్శిగా ఉండటం వల్ల రక్త నిల్వ కేంద్రానికి సంబంధించిన పనులు మరింత వేగంగా జరుగుతున్నాయి. రక్త నిల్వ కేంద్రాన్ని అతి త్వరగా ప్రారంభించేందుకు అవసరమైన సాయాన్ని ఉన్నత స్థాయిలో ఉన్న మదన్ మోహన్ రావు అందిస్తున్నారు. కొల్లాపూర్ లో రక్త నిల్వ కేంద్రం పూర్తి అయితే రోడ్డు ప్రమాదంలో గాయపడి తీవ్రంగా రక్తం కోల్పోయిన వారికి, డెలివరీ సమయంలో రక్త హీనతతో బాధపడే తల్లులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
previous post