అధికారం మాకు అవసరం లేదు కానీ ఇచ్చిన మాట ప్రకారం ఉండాల్సిన అవసరం రాజకీయాలలో ఉందని శివసేన అంటున్నది. లోక్ సభ ఎన్నికల సమయంలో అసెంబ్లీ ఎన్నికలలో అనుసరించాల్సిన విధానాలపై బిజెపి అధ్యక్షుడు అమిత్ షా స్పష్టంగా చెప్పారని, ఆ ప్రకారమే తాము ముఖ్యమంత్రి స్థానం కోరుతున్నామని శివసేన చెబుతున్నది. అయితే తానే పూర్తి కాలపు ముఖ్యమంత్రిగా ఉంటానని ప్రస్తున్న ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెబుతున్నారు. ఈ పీటముడి వీడకముందే బిజెపి రాజ్యసభ సభ్యుడు సంజయ్ కక్కడే వివాదాస్పద ప్రకటన చేశారు. 45 మంది శివసేన ఎంఎల్ఏలు బిజెపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. ప్రభుత్వ ఏర్పాటుపై రెండు పార్టీలూ మల్లగుల్లాలు పడుతున్న నేపథ్యంలో బిజెపి ఎంపి ఈ విధమైన ప్రకటన చేయడం శివసేనకు ఆగ్రహం తెప్పించింది. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి 105 స్థానాలలో గెలుపొందగా శివసేన 56 స్థానాలలో గెలిచింది. గెలిచిన 56 మందిలో 45 మంది శివసేన ఎంఎల్ఏలు తమతో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని బిజెపి ఎంపి ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పాటుపై సందిగ్ధత లేకుండా వ్యవహరించాలని తమను కూడా ప్రభుత్వంలో చేర్చుకోవాలని వారు కోరుతున్నట్లు బిజపి ఎంపి ప్రకటించారు. బిజెపితో కలిసిపోయేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తనతో శివసేన ఎంఎల్ఏలు అంటున్నారని ఆయన అన్నారు.
previous post