అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టుకు తప్పకుండా హాజరు కావాల్సిందేనని ఏపి సిఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ఏ1, ఏ2 నిందితులు ప్రతి శుక్రవారం విచారణకు హాజరు కావాల్సిందేనని జగన్ తరపు న్యాయవాదికి సీబీఐ కోర్టు చెప్పింది.
వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు జరిగిన అనంతరం.. ఏ1, ఏ2 నిందితులుగా ఉన్న జగన్, విజయసాయిరెడ్డి కోర్టుకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. ఈనెల 10న విచారణకు హాజరై తీరాల్సిందేనని తేల్చి చెప్పింది. నేరానికి, హోదాకు సంబంధం లేదని న్యాయస్థానం పేర్కొంది.