23.7 C
Hyderabad
July 14, 2024 07: 04 AM
Slider సంపాదకీయం

చెత్త పలుకు:నిజం అంగీకరించినందుకు థ్యాంక్స్

pjimage (10)

పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు దక్కించుకున్న ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ సకాలంలో పనులను చేపట్టలేకపోయిందని దాంతో సబ్ కాంట్రాక్లర్లను రంగంలో దించి పనులను అప్పగించారని ఈ క్రమంలో ఆశ్రితపక్షపాతం చోటు చేసుకుని ఉంటే ఉండవచ్చునని చెత్తపలుకు చెప్పేసింది. ఆశ్రిత పక్షపాతంతో సబ్ కాంట్రాక్టు ఇచ్చిన సిబినాయుడి తప్పేం లేదట, ఇప్పుడు పోలవరం నిలిచిపోతే జగన్మోహన్ రెడ్డిదే తప్పట. ఆహా ఏం విశ్లేషణ. పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కేవలం ఒక్క వై స్ ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆరోపించలేదు. అప్పటిలో బిజెపి నాయకులు కూడా దుమ్మెత్తి పోశారు. చంద్రబాబునాయుడి పైనా ఆయన సామాజిక వర్గానికి చెందిన కాంట్రాక్టర్ల పైనా కక్ష సాధించేందుకే జగన్మోహన్ రెడ్డి నవయుగ కంపెనీని తప్పుకోవాల్సిందిగా లేఖ రాయించారని కూడా చెత్త పలుకు తీర్పు చెప్పేసింది. జగన్మోహన్ రెడ్డి నియమించిన నిపుణుల కమిటీ అంత అవినీతి జరిగింది ఇంత అవినీతి జరిగింది అని ఆగమేఘాలపై నివేదిక ఇచ్చిందని, దాంతో ఏం ఉల్లంఘనలు జరిగాయో చెప్పకుండానే ప్రభుత్వ సౌకర్యం కోసం నిర్మాణ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిందిగా ప్రభుత్వం లేఖ రాసిందని ఇది తప్పని చెత్త పలుకు చెబుతున్నది. ఏ ఏ కారణాలపై తప్పిస్తున్నామో చెబితే దానిపై న్యాయపరమైన సంశయాలు లేవనెత్తి కాంట్రాక్టును మరో కంపెనీ చేపట్టకుండా, పనులను పూర్తిగా స్థంభింప చేసేందుకు అవకాశం ఉంటుంది.

నేరం నితిన్ గడ్కరి ఖాతాలోకి నెట్టే యత్నం

బహుశ ఇదే తెలుగుదేశం పార్టీ దాని అనుకూల పచ్చమీడియా అధిపతి కోరుకుంటున్నారు. అందుకే కారణాలు చెప్పకుండా తొలగించేశారంటూ మిద్దెలెక్కి అరుస్తున్నారు. నవయుగ కంపెనీకి బాధ్యతలు అప్పగించడంలో తప్పు జరిగి ఉంటే అందులో ఒక్క సిబి నాయుడికే కాదట కేంద్ర ప్రభుత్వానికి కూడా వాటా ఉండాలట. పైగా మరో చెత్త పలుకు ఏమిటంటే నవయుగ కంపెనీని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ఎంపిక చేశారట. సిబినాయుడికి మకిలి అంటకుండా ఉండేందుకు ఎన్ని అసత్యాలనైనా ప్రచారం చేయవచ్చుననేది పచ్చమీడియా సిద్ధాంతం కాబోలు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా మార్పు చేసినందుకు అప్పటి వరకూ ఖర్చు చేసిన ఆరువేల కోట్ల రూపాయలు తిరిగి ఇవ్వాలని వితండవాదం చేసిన సిబి నాయుడి ప్రభుత్వం కావాలని కేంద్రంతో కయ్యం పెట్టుకుని మేమే కట్టుకుంటాం అని చెప్పిన మాట చెత్త రాసే రైటర్ మర్చిపోయాడు. చేసిన ఖర్చులు లెక్క చెబితే అదనపు నిధులు ఇస్తామని నితిన్ గడ్కరి ఎన్ని సార్లు చెప్పినా లెక్కలు పంపని సిబినాయుడి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును జాప్యం చేసింది. తమకు కావాల్సిన వారికి కాంట్రాక్టు దక్కించుకోవడమే తప్ప ప్రాజెక్టుపై వారికి చిత్తశుద్ధి ఉన్నట్లు కనిపించలేదు. ఇది వాస్తవం కాగా దీన్ని మరుగున పరచేందుకు చెత్తపలుకు తెగ ఆరాటపడిపోయింది. పోలవరం శాపగ్రస్తం కాదు. జగన్మోహన్ రెడ్డి జాప్యం చేయడమూ లేదు. తప్పులు జరిదిద్ది ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తుంటే ఆ ప్రయత్నానికి సహకరించాల్సింది పోయి భోరున ఏడవడం పచ్చమీడియా వక్ర బుద్ధికి నిదర్శనం.

స్వామీజీలపై ఈ ఏడుపు ఏమిటి బ్రదర్

పోలవరంపై ఏడుపు ఈ విధంగా ఉంటే మరో ఏడుపు స్వామీజీలపై. తన ఛానెల్ టి ఆర్ పి పెంచుకోవడానికి ఉపయోగపడిన ఈ స్వాములు ఇప్పుడు చెత్తపలుకు రైటర్ కంటికి రాక్షసుల్లా కనిపిస్తున్నారు. ఎందుకంటే ఈ ఇద్దరు స్వాముల దగ్గరకు ఇద్దరు ముఖ్యమంత్రులూ వెళుతున్నారు. ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఈ ఇద్దరు స్వాములు (స్వామీ స్వరూపానందేంద్ర సరస్వతి, చిన జియర్ స్వామి) ఎవరి పని వారు చేసుకుంటున్నారు. వీరిద్దరి మధ్య పోటీ ఉన్నట్లు, ముఖ్యమంత్రి కేసీ ఆర్ తన వద్దకు రాలేదని చిన జియర్ స్వామి బాధపడుతున్నట్లు రాయడం కన్నా మూర్ఖత్వం ఇంకొకటి లేదు. ఎందుకంటే చిన జియర్ స్వామి కే సీ ఆర్ కు ఎంత సన్నిహితుడో అందరికి తెలుసు. ఆయన సలహాపై నిర్మిస్తున్న యాదాద్రి పుణ్య క్షేత్రం పూర్తి కావస్తున్న సందర్భంగా నిర్వహించ తలపెట్టిన యాగానికి ఆహ్వానించేందుకు కే సీ ఆర్ ముచ్చింతలకు వెళితే దాన్ని కూడా వక్రీకరిస్తూ రాసిన చెత్త పలుకు రైటర్ కు కనీస సమాచారం కూడా లేనట్టే కనిపిస్తున్నది. కుడుం ఇస్తే సంతోషించే స్వరూపానందేంద్ర అని ఈ వాచాలకుడు రాస్తున్నాడు. ఈ వాచాలకుడు ఆయనకు ఎప్పుడైనా కుడుం ఇచ్చాడా? స్వరూపానందేంద్రకు అక్కడ పెద్దగా పేరు లేదని కూడా రాశాడు. పేరు కోసం పబ్లిసిటీ కోసం ప్రయత్నించేవాడు స్వామి ఎలా అవుతాడు. వారి పనులు వారు చేసుకుంటూ పోతారు. అలాంటి వారే స్వాములు అవుతారు. కుల మత బేధం లేకుండా హిందువులు అందరూ కలిసి ఉండాలని స్వరూపానందేంద్ర చెబుతుంటారు. ఆయన చేసే పనులు కూడా అలానే ఉంటాయి.

అడ్డంగా రాస్తే నిజం అయిపోదు బ్రదర్

ఎవరో కూడా తెలియని ఒక పిల్లవాడిని ఉత్తరాధికారిగా ప్రకటించుకున్న స్వరూపానందేంద్ర విలువ కొడుకు, కూతురు కోసం తపించిపోయి వారికి కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టి ఇచ్చే వారికి ఏం తెలుస్తుంది? ఇదేదో స్వాముల్ని దైవాంశ సంభూతులు అని చెప్పే ప్రయత్నం కాదు. ఈ ఇద్దరు స్వాముల దగ్గరకు నేను ఎప్పుడూ వెళ్లలేదు కూడా. వారు చేసే మంచి పనులు చూడాలి కానీ ఇద్దరు సి ఎంలు వారి వద్దకే వెళుతున్నారు నా దగ్గరకు వచ్చే సిబి నాయుడు ఘోరంగా ఓడిపోయాడు అనే నిర్వేదంతో చెత్త పలుకులు రాయడం సబబు కాదు. మరో ఆణిముత్యం ఉంది చెత్త పలుకులో.. అదేమిటో తెలుసా?

రుణాలు ఎగ్గొట్టే కంపెనీలపై ప్రభుత్వం సానుభూతి చూపాలట

పరిస్థితులు వికటించి ఇబ్బంది పడే కంపెనీల పట్ల ప్రభుత్వం సానుభూతితో ఉండాలట. కాఫీడే సిద్ధార్ధ్ గురించి సానుభూతి వాక్యాలు రాస్తూ సదరు చెత్త పలుకు రైటర్ ఇచ్చిన జడ్జిమెంటు. అంటే విజయ్ మాల్యా, నీరవ్ మోడీ లాంటి వారిని, ఇంకా బ్యాంకుల్ని మోసం చేసిన వారు ఎవరైనా ఉంటే వారందరిని ప్రభుత్వం కనికరించి మరిన్ని అప్పులు ఇప్పించాలి. అదే కోవలోకి తన సామ్రాజ్యానికి కూడా చెల్లించకపోయినా రుణాలు ఇప్పిస్తే ఈయనకు ఎంతో సంతోషం. తీసుకున్నఅప్పులు కట్టకపోతే ఆర్ధిక సంస్థలు అడగ కూడదా? బ్యాంకులు తమ బకాయిలు చెల్లించాలని ఒత్తిడి తీసుకురా కూడదా? కట్టాల్సిన పన్ను చెల్లించకపోతే ఆదాయపు పన్ను శాఖ అడగ కూడదా? సిద్ధార్ధ్ మరణంపై ఎంతో సానుభూతి ఉన్నవారు కూడా ఈ ప్రశ్నలకు అవును అని సమాధానం చెప్పలేరు. సిద్ధార్ధ్ మరణాన్ని కూడా తమ వ్యాపార అవసరాలకు వాడుకోవాలని చూస్తున్న కొందరు బడా పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ కంపెనీల వారు, ఆ కార్పొరేట్ కంపెనీల దయా దాక్షిణ్యాలపై ఆధారపడి బతికే మీడియా సంస్థలు సిద్ధార్ధ్ మరణాన్ని మరో కోణంలో చూపించి ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నాయి. వక్ర రాతలతో మీడియాలో తప్పుడు సమాచారం ఇవ్వడం ఆర్ధిక నేరాల కన్నా ఘోరమైన నేరం మిస్టర్ చెత్త పలుకూ


సత్యమూర్తి పులిపాక, చీఫ్ ఎడిటర్,
సత్యం న్యూస్

Related posts

వనపర్తిలో మందు బాబులపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు

Satyam NEWS

ఎండ్ ఆఫ్ ట్రేడ్ వార్: చైనాతో వాణిజ్య ఒప్పందం ఓకే

Satyam NEWS

తల్లుల్లారా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం క్షమించండి

Satyam NEWS

Leave a Comment