Slider సంపాదకీయం

రెంటికీ చెడ్డ రేవడి….. పాపం… చినజియర్ స్వామి….

#chinajeeyarswmy

పాపం… చినజియర్ స్వామి…. తాను చేసిన పొరబాటుకు చింతిస్తూ ఉండి ఉంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆయనకు ఇప్పుడు అర్ధం అయి ఉంటుంది. యాదాద్రి పునర్ నిర్మాణం తర్వాత అత్యంత వైభవంగా జరుగుతున్న కార్యక్రమాలకు చిన జియర్ ను ఎవరూ పిలవలేదు.

ఆలయ సంప్రోక్షణ, పున:ప్రారంభ ఘట్టాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు పాల్గొన్నారు తప్ప చిన జియర్ కు స్థానం కల్పించలేదు. మహకుంభ సంప్రోక్షణ ఎంతో వైభవంగా జరిగింది. యాదగిరి గుట్ట క్షేత్రానికి యాదాద్రిగా నామకరణ చేసిన చిన జియర్ ఆ తర్వాత జరిగిన పునర్ నిర్మాణ కార్యక్రమాల్లో అప్పటిలో చురుకుగా పాల్గొనేవారు. ఆలయాన్ని ఆగమ శాస్త్రం ప్రకారం ఎలా తీర్చిదిద్దాలి అనే అంశంపై చిన జియర్ ఎన్నో సలహాలు ఇచ్చేవారు.

సినీ రంగానికి చెందిన ఆనంద సాయి అనే ఆర్కిటెక్టును తీసుకువచ్చి యాదగిరి గుట్ట పునర్ నిర్మాణ ప్రాజెక్టులో భాగస్వామ్యం కల్పించింది కూడా చిన జియరే. ఆనంద సాయి మొత్తం ప్రాజెక్టును చిత్ర రూపంలో ముందుగానే చిన జియర్ కు, ముఖ్యమంత్రి కేసీఆర్ కు చూపించేవారు.

వారిద్దరూ అంగీకరించిన తర్వాత వాటిని శిలలపైకి మలచేవారు. అలా యాదాద్రి పునర్ నిర్మాణ ప్రాజెక్టు రెండేళ్లలో పూర్తి కావాల్సి ఉన్నా ఆరేళ్లు పట్టింది. ఆరేళ్ల కాలంలో జరిగిన పరిణామాలు ఒక ఎత్తు అయితే గత రెండు మూడు నెలల్లో జరిగిన పరిణామాలు ఒక ఎత్తు. ఈ కాలంలో చిన జియర్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహానికి గురయ్యారు.

ఇద్దరి మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. చిన జియర్ శంషాబాద్ ప్రాంతంలోని ముచ్చింతల లో రామానుజుడి విగ్రహ ప్రాజెక్టు ను చేపట్టారు. అది చాలా కాలం తర్వాత పూర్తి అయింది. ఆ ప్రాజెక్టు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతోనే జరిగింది.

అయితే ఆ ప్రాజెక్టును ప్రారంభించే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు విరుద్ధంగా చిన జియర్ ప్రవర్తించారు. చిన జియర్ ఏం చేశారు? కేసీఆర్ కు ఎందుకు కోపం వచ్చింది అనేది మన ఊహాగానమే. అయితే ఇద్దరి మధ్య సంబంధాలు చెడిపోయాయి అనేది మాత్రం వాస్తవం.

ఈ వాస్తవాన్ని చిన జియర్ చాలా కాలం అంగీకరించలేదు. రామానుజుడి విగ్రహం కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చురుకుగానే పాల్గొన్నారు కదా అంటూ ఆయన ఎదురు ప్రశ్నలు వేశారు. చిన జియర్ చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ ఎలాంటి ప్రతిస్పందన కూడా వ్యక్తం చేయాలేదు.

యాదాద్రి పునర్ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించాలని గతంలో కేసీఆర్ భావించారు. ఈ మేరకు ఆయన ప్రధానికి సమాచారం కూడా అందించారు. అయితే ఆ తర్వాత అకస్మాత్తుగా కేసీఆర్ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై కాలుదువ్వారు.

ప్రధానిని, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీని దారుణంగా తిట్టారు. ఈ సమయంలోనే చిన జియర్ ప్రధాని మోడీని రాముడితో పోల్చారు. ప్రధాని నరేంద్రమోడీని పొగడ్తలతో ముంచెత్తారు. ఆ కార్యక్రమానికి కేసీఆర్ గైర్హాజర్ అయ్యారు. ఆ తర్వాత నుంచి కేసీఆరే కాకుండా టీఆర్ఎస్ కు సంబంధించిన వారెవరూ కూడా ముచ్చింతల ముచ్చటే ఎత్తలేదు.

అప్పటి నుంచే యాదాద్రి పునర్ నిర్మాణ అనంతర కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ చిన జియర్ ను పిలుస్తారా లేదా అనే ఊహాగానాలు చెలరేగాయి. చిన జియర్ ను ఆహ్వానించకపోవచ్చుననే అందరూ అనుకున్నారు. అందరూ అనుకున్నట్లుగానే సీఎం కేసీఆర్ ఆయనను పిలవలేదు.

నిర్మాణ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు కాబట్టి చిన జియర్ పై ఉన్న విభేదాలను పక్కన పెట్టి సీఎం కేసీఆర్ పిలుస్తారని కొందరు అనుకున్నారు కానీ అలాంటి వారి ఆశలను కేసీఆర్ పట్టించుకోలేదు. సాధారణంగా దేవాలయాల ప్రారంభోత్సవాలకు స్వామీజీలను పిలిచి వారితో పవిత్ర కార్యక్రమాలు నిర్మించడం, అనంతరం వారికి సత్కారం చేయడం ఆనవాయితీ.

ఈ ఆనవాయితీ ప్రకారం అయినా చిన జియర్ ను పిలుస్తారేమోనని మరి కొందరు అనుకున్నారు. అయితే కేసీఆర్ ఇలాంటివేవీ పట్టించుకోలేదు. తొమ్మిదేళ్ల కిందట చిన జియర్ వనదేవతలైన సమ్మక్క సారలమ్మపై అవాకులు చెవాకులు పేలిన ఒక వీడియో ఇటీవల సోషల్ మీడియాలో విడుదల అయింది.

ఈ వీడియో చూసిన వారంతా కూడా చిన జియర్ ను దారుణంగా విమర్శించారు. కొన్ని ఎస్ టి సంఘాలైతే చిన జియర్ ను అరెస్టు చేయాలని కూడా డిమాండ్ చేశాయి. సమ్మక్క సారలమ్మలు దేవలోకం నుంచి దిగి వచ్చారా అంటూ తాను మాట్లాడిన మాటలకు క్షమాపణ చెప్పేందుకు కూడా చిన జియర్ నిరాకరించారు.

పైగా అవే మాటలను సమర్ధించుకుంటూ ఆయన వివరణ ఇచ్చారు. ఇది తెలంగాణ సమాజాన్ని మరింత బాధ పెట్టింది. ఈ దశలో జరిగిన యాదాద్రి పునర్ నిర్మాణ మహోత్సవంలో చిన్న జియర్ ప్రస్తావనే లేకుండా పోయింది. అటు కేసీఆర్ దగ్గరకు రానీయకుండా…. ఇటు తెలంగాణ సమాజం ఆగ్రహం గా ఉన్న ఈ సమయంలో….. పాపం… చినజియర్ స్వామి…. తాను చేసిన పొరబాటుకు చింతిస్తూ ఉండి ఉంటారు.

Related posts

డైవర్షన్: అమ్మఒడి పథకం కోసం దళితులకు శఠగోపం

Satyam NEWS

ఘనంగా భూవరాహ లక్ష్మీనారసింహస్వామి పూజ

Satyam NEWS

సిఎం సహాయ నిధికి మైక్రోసాఫ్ట్ అధినేత విరాళం

Satyam NEWS

Leave a Comment