40.2 C
Hyderabad
April 29, 2024 18: 17 PM
Slider జాతీయం

చైనాతో కుమ్మ‌క్కు.. ఓలికి మ‌ళ్ళీ ప‌ట్టం క‌ట్టేరా?

china nepal

నేపాల్ ప్రధానమంత్రి కెపి శర్మ ఓలి విషయంలో మునుపెందరో అనుకున్నదే ఈ రోజు జరిగింది. చైనా చేతిలో బుట్టబొమ్మగా మారిపోవడం, వాళ్లు వేసిన సొమ్ముల ఎరలో కూరుకుపోవడమే ఆయన కొంపముంచింది. దీనికి తోడు, ప్రజాస్వామ్య విధానాన్ని మరచి, వ్యక్తి స్వామ్యంలోకి వెళ్లడంతో ఓలి శర్మ భవిష్యత్తు ప్రశ్నార్ధకమైంది. ఉన్నపళంగా పార్లమెంట్ ను రద్దు చేయడం నియంతృత్వ పోకడలో భాగమే. ఓలి శర్మకు ఉద్యోగభయం పట్టుకొని కూడా చాలాకాలమైంది. ఇవ్వన్నీ మనసులో పెట్టుకొని, రేపటి పరిణామాలు ఎట్లా ఉంటాయో అని భయపడి పార్లమెంట్ ను రద్దు చేశారని ఊహించవచ్చు.

అగ్గికి ఆజ్యం పోసిన ఓలిశ‌ర్మ చ‌ర్య‌లు

ఈ చర్యతో రగులుతున్న అగ్గికి ఆజ్యం పోసి, మరింత వ్యతిరేకతను ఓలిశర్మ వర్గం మూటకట్టుకుంది. అనూహ్యంగా పార్లమెంట్ ను రద్దు చేసి, వచ్చే ఏప్రిల్, మే నెలల్లో మధ్యంతర ఎన్నికలను ప్రకటించారు. నేపాల్ మాజీ ప్రధానులందరూ ఓలి శర్మకు వ్యతిరేకమయ్యారు. పార్లమెంట్ రద్దు అనే అంశం కూడా వివాదాస్పదంగా మారింది. మెజారిటీ సభ్యులున్న నేపథ్యంలో రద్దు చేయడం న్యాయ సమ్మతం కాదని ఇంటా బయటా చర్చనీయాంశమైంది. ఈ చర్యను న్యాయపరంగా ఎదుర్కోడానికి ప్రత్యర్ధులు సిద్ధమవుతున్నారు. ఓలి శర్మ ప్రాతినిధ్యం వహిస్తున్నది నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ.

ఓలి విధానాల‌ను తూర్పార‌బ‌డుతున్నప్ర‌తిప‌క్ష నేత‌లు

మాజీ ప్రధాని ప్రచండ నాయకత్వం వహిస్తున్నమావోయిస్ట్ సెంటర్ పార్టీని 2018లో విలీనం చేశారు. నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీగా ఏర్పడ్డాయి. వీరందరూ కలిసి పరిపాలన సాగిస్తున్నా, అనంతర పరిణామాల్లో విభేదాలు వచ్చాయి. పాలనలో ఉన్నప్పటికీ, ఓలి శర్మ వర్గం, ప్రచండ వర్గంగా చీలిపోయాయి. ఇవి పెరిగి పెద్దవిగా మారి, ఓలి శర్మను ప్రధానమంత్రి పదవి నుండి దించెయ్యాలనే స్థాయికి చేరాయి. వీరిలో ప్రచండతో పాటు, మరో మాజీ ప్రధాని మాధవ్ కుమార్ కూడా ఉన్నారు. చివరకు నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి నారాయణ్ కాజీ శ్రేష్ఠ కూడా ఓలిశర్మ విధానాలను తూర్పారపట్టారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేపాలీ కాంగ్రెస్ కూడా కారాలు మిరియాలు నూరుతోంది. వీరందరికి, మరో మాజీ ప్రధాని బాబూరామ్ భట్టారాయ్ కూడా జతకట్టారు.

త‌గిన శాస్తే జ‌రిగిందంటున్న నేపాలీలు

మొత్తంమీద సారాంశం ఏంటంటే? ఓలి శర్మను ప్రధాని పీఠం నుండి దింపెయ్యడం ప్రచండను ఎక్కించడం ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. ఓలి శర్మ తప్పులు అట్లుంచగా, మరోసారి ప్రధానమంత్రి కావాలని ప్రచండ వేస్తున్న ఎత్తులు ఊపందుకున్నాయి. ఈ అసంపతృప్త నేతలందరికీ ప్రచండ నివాసమే వేదికగా మారింది. చైనాను నమ్ముకున్నందుకు ఓలి శర్మకు మంచి శాస్తి జరిగిందని నేపాలు ప్రజలు సైతం భావిస్తున్నారు.

తాను తీసిన గోయిలో తా‌నే ప‌డ్డాడు

చైనా వలలో పడి, భారతదేశం పట్ల అధర్మంగా వ్యవహరించిన తీరు కూడా పాముగా మారి కాళ్లకు చుట్టుకుంది. భారత్ విషయంలో వరుసగా తప్పులు చేసుకుంటూ వెళ్లారు. భారత భూభాగాలైన లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురలను తమ భూభాగాలుగా భావించడమే కాక, వీటన్నిటిని కలుపుకుంటూ నేపాల్ కొత్త మ్యాప్ ను సృష్టించి, ప్రపంచ దేశాల ముందు చూపెట్టింది. ఈ చర్యకు సొంత పార్టీ, ప్రతిపక్ష పార్టీలతో పాటు నేపాల్ ప్రజల నుండి కూడా తీవ్ర ప్రతిఘటన వచ్చింది. అంతర్జాతీయ సమాజంలోనూ నేపాల్ గౌరవాన్ని, విశ్వాసాన్ని కోల్పోయింది. ఐనప్పటికీ, ప్రధాని ఓలి శర్మ తన తీరును మార్చుకోలేదు. మార్చుకోకపోగా మరింత రెచ్చిపోయారు. తాను తీసిన గోయిలో త‌నే ప‌డ్డాడ‌ని అంతా అనుకుంటుండ‌డం విశేషం.

భార‌త్‌పై ఆరోప‌ణ‌లు.. ఓలీశ‌ర్మ‌పై ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌లు

శ్రీరామజన్మభూమి భారత్ లోని అయోధ్య కాదని, అది నేపాల్ కు చెందినదని ఒక కొత్త వాదన, వివాదం తెరపైకి తెచ్చారు. అది కూడా, భారత్ లోని అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సిద్ధమైన వేళలో ఈ అంశాన్ని పైకి తెచ్చారు. నేపాల్ లో కరోనా వ్యాపించడానికి కారణం భారతదేశమేనని మరో నింద మోపారు. అది కూడా, కరోనా విషయంలో ప్రపంచమంతా చైనాను అనుమానించి దుయ్యబడుతున్న కాలంలో కావడం గమనార్హం. ఒకపక్క, భారత్ సరిహద్దుల్లో నానాయాగీ చేస్తూ, భారత భూభాగాన్నిదురాక్రమించుకోవాలని చైనా కుట్రలు చేస్తూ వుంటే, ఇంకో పక్క, భారతదేశం తమ భూభాగాలను దురాక్రమించిందంటూ నేపాల్ విమర్శలు చేసింది. వీటన్నింటికీ కారణం, నేపాల్ ప్రధానమంత్రి కెపి శర్మ ఓలి పూర్తిగా చైనా కనుసన్నల్లోకి వెళ్లడమే ప్రధానమైంది. ఓలి శర్మ చైనాకు అమ్ముడుపోయాడని, తాను అమ్ముడుపోవడమేకాలేదు
కాక, దేశాన్ని కూడా తాకట్టు పెట్టడానే విమర్శలు నేపాల్ లో పెద్దఎత్తున బయలుదేరాయి. తన సొంత పార్టీలోని అసంతృప్తనేతలు, ప్రత్యర్థి పార్టీలు ఈ విమర్శలను చేపట్టాయి.

అప్ప‌ట్లో భార‌త్‌-నేపాల్ సంబంధాలు బ‌లోపేతం

ప్రపంచంలో నేపాల్ ఏకైక హిందూ దేశం. నిన్న మొన్నటి వరకూ ఆ దేశాన్ని రాజులే పరిపాలించారు. తర్వాత సంభవించిన ఉద్యమాలతో మావోయిస్టులు, కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చారు. వారిలో పూర్వ ప్రధాని ప్రచండ ప్రసిద్ధుడు. తర్వాత జరిగిన పరిణామాలు, అంతర్గత అంగీకారాల వల్ల కెపి శర్మ ఓలి ప్రధానమంత్రి అయ్యారు. గతంలో ప్రచండ, మాధవ్ కుమార్, డాక్టర్ బాబూరామ్ భట్టారాయ్ వంటి వారు ప్రధానులుగా పనిచేసినప్పటికీ ఇంత చెడ్డపేరు మూటగట్టుకోలేదు. భారత్ విషయంలోనూ ఇంత తీవ్రంగా ప్రవర్తించలేదు. ఓలి శర్మ ముందు వరకూ, భారత్ -నేపాల్ బంధాలు చాలా వరకూ బాగానే సాగాయి. ఓలి శర్మ సమయంలోనే బాగా దెబ్బతిన్నాయి.

నేపాల్ ఓట‌ర్ల తీర్పు ఏటో?

ఓలిశర్మ ఇటీవలే భారత్ విషయంలో కాస్త స్వరం మార్చి, దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. ఇంతలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. రేపు ఏప్రిల్, మేలో జరుగబోయే ఎన్నికల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయో వేచి చూడాలి. మళ్ళీ ప్రచండ అధికారంలోకి వచ్చే అవకాశాలను కూడా కొట్టి పారెయ్యలేము. ఓలి శర్మ గెలుపు కష్టమేనని చెప్పాలి. ఎన్నికల సమయానికి, ఫలితాల తర్వాత సమీకరణాలు ఎట్లా మారతాయో ఎన్నికల తెరపై చూడాల్సిందే. నేపాల్, భారతదేశానికి కేవలం సరిహద్దు దేశమే కాక, సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా ఎంతో అనుబంధం, చారిత్రక సంబంధాలు ఉన్న భూమి. రెండు దేశాల ప్రజల మధ్య ఎటువంటి విభేదాలు లేవు. సరిహద్దు రాష్ట్రాల్లో బంధాలతో పాటు బంధుత్వాలు కూడా ఉన్నాయి. పైగా, భారత్ కంటే ఎంతో పేద దేశం, బలహీనమైన దేశం. భారత్ తో నేపాల్ కు ఎన్నోఅవసరాలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ, నేపాల్ లో ఉన్న ఎన్నో పరిశ్రమలను నడుపుతూ, వారికి ఉపాధి కల్పిస్తోంది కూడా ఎక్కువమంది భారతీయులే. రేపటి ఎన్నికల్లో గెలిచి, ఎవరు అధికారంలోకి వచ్చినా, ఈ అంశాలన్నింటినీ స్పృహలో ఉంచుకొని మెలిగితే ఉభయతారకమవుతుంది.

  • మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

జాతీయ రహదారి పనులు వేగoగా పూర్తి చేయాలి

Murali Krishna

రాబిన్ శర్మ టీంతో “ఇదేం కర్మ మన రాష్ట్రానికి” శిక్షణా కార్యక్రమం

Bhavani

అరెస్టులతో పోరాటం ఆపలేరు

Sub Editor

Leave a Comment