37.2 C
Hyderabad
May 2, 2024 13: 05 PM
Slider ప్రపంచం

ఎనాలసిస్: కుట్ర, కుతంత్రాలతో కుళ్లుతున్న చైనా

#Narendra Modi

భారత్ తో యుద్ధం చెయ్యటానికే  చైనా సిద్ధమవుతున్నట్లుగా గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు సూచిస్తున్నాయి. కరోనా వైరస్ సృష్టికర్తగా ప్రపంచ దేశాల దృష్టిలో ఇప్పటికే చైనా చెడ్డపేరు మూటగట్టుకున్నది చైనా. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అయితే చైనాను దోషిగా నిలబెట్టడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు.

అప్పటికే పటిష్టంగా ఉన్న భారత్ -అమెరికాల స్నేహబంధం కరోనా పుణ్యమా అని మరింత బలపడ్డాయి. ఇది చైనాకు కంటగింపుగా మారింది. కరోనా అవమానభారం, అమెరికా ఒత్తిళ్ళు, భారత్ పై అనుమానాలు భారత్ పై చైనా  కవ్వింపు చర్యలకు ఉత్ప్రేరకాలుగా కనిపిస్తున్నాయి.

సరిహద్దుల్లో ఉద్రిక్తత రెచ్చగొడుతున్న డ్రాగన్

2017లో డోక్లామ్ ట్రై జంక్షన్ దగ్గర చైనా-భారత్ సైన్యాల మధ్య 73 రోజుల పాటు నిరంతర ఘర్షణలు జరిగాయి. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే  వాటికి మించిన ఘర్షణలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేపాల్ ను రెచ్చగొట్టడం, నేపాల్ తో భారత్ పై కరోనా విషయంలో నిందలు వేయించడం  ఇందులో భాగమే.

ఇంకో పక్క పాకిస్తాన్ ను కూడా చైనా రెచ్చగొడుతోంది. భారత్ సరిహద్దు దేశాలన్నింటినీ భారత్ పై ఉసిగొల్పే చర్యలు చైనా ముమ్మరం చేసింది. ముందు ముందు ఈ చర్యలు ఇంకా పెంచుతుందనడంలో సందేహం లేదు. భారతదేశం, భారత్ మిత్రదేశాలతో పాటు అమెరికాకు  కూడా బలమైన హెచ్చరికలు చేసే వ్యూహంలో భాగమే ఈ దుందుడుకు చర్యలు కావచ్చు.

కమ్యూనిస్టు, క్రిస్టియన్ వ్యతిరేక దేశాలతో మైత్రి

చైనా- పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ద్వారా ఆర్ధిక ప్రయోజనాలు చూపించి, చైనా పాకిస్తాన్ కు దైవసమానంగా మారిపోయింది. ఇంకొక పక్క, తూర్పు యూరప్ దేశాలకు  కూడా చైనా ఎరవేస్తోంది. కమ్యూనిస్ట్ దేశాలతో ఒక పక్క – క్రిస్టియన్ వ్యతిరేక దేశాలతో మరోపక్క మైత్రీ బంధాలు పెంచుకునే దిశగా బలమైన అడుగులు వేస్తోంది.

2013లో  బి. ఆర్. ఐ ( బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్) అనే పేరుతో చైనా 70 దేశాలతో, అంతర్జాతీయ సంస్థలతో ఒక వ్యూహాత్మక సంబంధం ఏర్పరచుకుంది.  మౌలిక వసతుల అభివృద్ధి, పెట్టుబడులలో వీటిని భాగస్వామ్యం చెయ్యడం దీని ప్రణాళిక.

ఇది జిన్ పింగ్ వేసిన పథక రచన. పాకిస్తాన్, నైజీరియా, బంగ్లాదేశ్, ఇండోనేసియా, మలేసియా, ఈజిప్ట్, యు.ఏ.ఈ, సింగపూర్, దక్షిణ కొరియా, ఇజ్రాయిల్, రష్యన్ ఫెడరేషన్ మొదలైనవన్నీ వీటిల్లో ఉన్నాయి. ఒకప్పటి సోవిట్ యూనియన్ ను కూడా తన చెప్పు చేతల్లో పెట్టుకునే పనిలో చైనా ఉంది.

అమెరికాను, అమెరికా మిత్రదేశాలను తొక్కేసే ప్రయత్నం

అమెరికాను, అమెరికా మిత్రదేశాలను తొక్కేయ్యాలి, ప్రపంచంలో అగ్రరాజ్యంగా సుస్థిరస్థానం ఏర్పరచుకోవాలనే మహాలక్ష్యంతో చైనా ముందుకు వెళ్తోంది. అందులో భాగంగా, ప్రస్తుతం భారత్ పై తన ప్రతాపం చూపించే పనిలో నిమగ్నమైనట్లు బలంగా అనిపిస్తోంది. ఇప్పుడు, వాస్తవాధీన రేఖ చుట్టూ ఘర్షణలకు తలపడుతోంది.

జమ్మూ, కశ్మిర్ లో భాగమైన లడాఖ్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడం కూడా చైనా కోపానికి ఒక కారణం. అరుణాచల్ ప్రదేశ్ భూభాగం కూడా తమ దక్షిణ టిబెట్ కు చెందినదే అనే వాదనా ఎప్పటి నుండో చేస్తోంది. వీటన్నింటికి  తోడు, కరోనా అంశం కూడా జత కలిసి,  చైనా భారత్ పై దూకుడు పెంచుతోంది. ఇప్పటికే, 2000-2,500 మంది సైనికులను సరిహద్దులకు చేర్చింది.

మోదీ, జెన్ పింగ్ ఒప్పందాలు ఏమయ్యాయి?

భారత్ కూడా ఈ చర్యలకు పోటీగా బలగాలను పెంచుతోంది. కొన్ని కీలక ప్రాంతాల్లో చైనా బలగాలు ఎక్కువగా మోహరించి ఉన్నాయి. వాస్తవాధీన రేఖ అంశంపై ఇంతవరకూ రెండుదేశాల మధ్య స్పష్టమైన ఒప్పందం కుదర్లేదు. రెండు దేశాల మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థల సహకారాన్ని  పరిపుష్టిచేసుకునే దిశగా ” వ్యూహాత్మక మార్గ నిర్దేశనం” జరగాలి.

ఈ అంశంపై వూహన్ లో జరిగిన శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్రమోదీ,  చైనా అధినేత షీ జిన్ పింగ్ పరస్పరం చర్చించుకున్నారు. కానీ, అది ఇంతవరకూ కార్యరూపం ధరించినట్లు లేదు. భారతదేశం కంటే చైనా చాలా బలమైన దేశం. మిలిటరీ పరంగాను, ఆర్ధికంగానూ చైనాదే పెద్దచెయ్యి.

జాతీయ రక్షణా విధానంలోనూ, అంతర్గత భద్రతలోనూ భారత్ ఇంకా వ్యవస్థీకృతంగా ఎదగాలి. విధానాల రూపకల్పనలు బలంగా జరగాలి. తమ దేశ పరిధులను విస్తరించుకోవడం, మిగిలిన దేశాలను ఎర వెయ్యడం, శత్రుదేశాలుగా భావించేవాటిని చక్రబంధంలో ఇరికించడం మొదలైనవి చైనా అవలంబించే వ్యూహాలు.

జీవాయుధాలు కూడా ఉన్నాయి జాగ్రత్త

ఇవి కాక, సి. బి. ఆర్. ఎన్ అనే రక్షణా వ్యవస్థలో  బలంగా ఉంది. సి అంటే కెమికల్,  బి అంటే బయో, ఆర్ అంటే రేడియోలాజికల్, ఎన్ అంటే న్యూక్లియర్ విధ్వంసాలు. ఈ సి లో ఇప్పుడు సైబర్ కూడా చేర్చుకోవాలి. కరోనా వైరస్ ను బయో ఆయుధంగానే భావించడానికి బలమైన నిదర్శనాలు ఉన్నట్లుగా పరిశీలకులు చేస్తున్న వ్యాఖ్యలను కొట్టిపారెయ్యలేం.

ఇది చాలా ప్రమాదకరమైన పరిణామం. ఇప్పటివరకూ వివాదాస్పద భూభాగాల్లో లేని గాల్వాన్ సెక్టార్ వైపు కూడా చైనా  బలగాలు దూసుకురావడం అనుమానాస్పదం. ఆందోళనకరంగా కూడా భావించాలి. గత రెండు వారాల్లోనే గాల్వాన్ లోయలో చైనా సుమారు 100 తాత్కాలిక గుడారాలను ఏర్పరచుకుంది.

మే 5వ తేదీ నాడు పాంగాంగ్ ప్రాంతంలో రెండు దేశాల సైనికులు ఘర్షణకు దిగారు. ఇరువైపు సైనికులకూ తీవ్రగాయాలు కూడా అయ్యాయి. మే 9వ తేదీన ఉత్తర సిక్కింలోనూ ఇదే తరహా పరిస్థితులు తలెత్తాయి. తూర్పు లడాఖ్ ప్రాంతంలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులే నెలకొని ఉన్నాయి.

భారత్ – చైనాల మధ్య యుద్ధం ఆశావహపరిణామం కాదు. నిజంగా, యుద్ధమే సంభవిస్తే?  ఎంతో ప్రమాదకరం. వీలైనంత త్వరగా  చైనా – భారతదేశాల మధ్య దౌత్యపరమైన చర్యలు జరగాలి. ఈ ఘర్షణలకు ముగింపు పలకాలి.

-మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

బాంబ్ అటాక్:అసోం లో మూడుచోట్ల బాంబ్ పేలుళ్లు

Satyam NEWS

మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Satyam NEWS

బాధితులకు భరోసా కల్పించడమే ధ్యేయంగా ఉండాలి

Satyam NEWS

Leave a Comment