30.7 C
Hyderabad
April 29, 2024 06: 28 AM
Slider ప్రత్యేకం

అమరావతి తరలింపుపై మరింత వేగంగా చర్యలు

Amaravathi 261

ఎవరు అడ్డుకున్నా రాజధాని తరలింపు ఆగదని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి ప్రకటించడం వెనుక పటిష్టమైన వ్యూహం ఉన్నట్లే కనిపిస్తున్నది. తెరవెనుక అన్ని ఆప్షన్లు చూసుకున్న తర్వాతే విజయసాయి రెడ్డి విశాఖపట్నంలో ఇటీవల ఆ వ్యాఖ్య చేశారని అంటున్నారు.

సాధారణ పరిస్థితుల్లో అయితే ఇప్పటికే రాజధాని విశాఖపట్నం కు తరలిపోవాల్సి ఉంది. ఈ మేరకు అప్పటిలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మౌఖిక ఆదేశాలు కూడా జారీ చేశారు. సచివాలయ ఉద్యోగ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మౌఖిక ఆదేశాలను అంగీకరించాయి కూడా.

తమకు కావాల్సిన సౌకర్యాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని అప్పటిలోనే సచివాలయ ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. అయితే రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపినా కౌన్సిల్ లో మెజారిటీ ఉన్న తెలుగుదేశం పార్టీ మోకాలు అడ్డింది.

వికేంద్రీకరణ బిల్లును కౌన్సిల్ తిరస్కరించి ఉంటే మళ్లీ అసెంబ్లీకి వచ్చిన తర్వాత ఆమోదించుకుంటే సరిపోయేది కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్న మేధావులు బిల్లును తిరస్కరించకుండా సెలక్టు కమిటీకి పంపడంతో అటు బిల్లు తిర్కరించినట్లుగానీ ఆమోదించినట్లు గానీ కాకుండా పెండింగులో పెట్టినట్లు అయింది.

దాంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలనుకున్న సమయంలో రాజధాని తరలింపు జరగలేదు. కౌన్సిల్ అడ్డంకి లేకపోతే లేకపోతే ఇప్పటికే రాజధాని తరలింపు జరిగి ఉండేది. కౌన్సిల్ రద్దు చేయాలని పంపిన తీర్మానం కేంద్రం వద్ద పెండింగులో ఉండటం, అది ఇప్పటిలో పార్లమెంటుకు వెళ్లే అవకాశం లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఆలోచనకు వచ్చింది.

ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎదుట మూడు ఆప్షన్లు ఉన్నాయని రాజ్యంగా నిపుణులు అంటున్నారు. అవి 1. వికేంద్రీకరణ బిల్లును సెలెక్టు కమిటీకి పంపాలన్న కౌన్సిల్ నిర్ణయం అమలు జరగలేదు. మూడు నెలలు గడచి పోయినా సెలక్టు కమిటీ ఏర్పాటు కాలేదు.

సెలెక్టు కమిటీని ఏర్పాటు చేసి మూడు నెలల్లో నివేదిక ఇచ్చేలా చూడాలని కౌన్సిల్ చైర్మన్ భావించారు. సెలెక్టు కమిటీ ఏర్పడి ఉంటే, అది తన పని తాను చేసుకుంటూ ఉంటే మరో నెలో రెండు నెలలో పొడిగించేందుకు అవకాశం ఉంటుంది కానీ అసలు కమిటీనే ఏర్పాటు కాలేదు.

పైగా ఈ నెల 24 నాటికి మూడు నెలల కాలపరిమితి పూర్తి అయింది. అందువల్ల సెలెక్టు కమిటీ నిర్ణయం వీగిపోయినట్లే అవుతుంది. కౌన్సిల్ లో తెలుగుదేశం పార్టీకి అప్పటిలో ఉన్నంత బలం లేదు. ఐదుగురు తెలుగుదేశం సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తే సరిపోతుంది. లేదా సభకు ఆ రోజు రాకపోతే సరిపోతుంది.

ఇది చేయించడం పెద్ద కష్టమైన విషయం కానందున తక్షణమే (కరోనా వెసులుబాటు వచ్చిన వెంటనే) కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి బిల్లును ఆమోదించేలా చేయడం. 2. కౌన్సిల్ రద్దు పై ఇప్పటికే నిర్ణయం జరిగిపోయినందున మళ్లీ కౌన్సిల్ ను పిలవకుండా అసెంబ్లీలోనే పై విషయాన్ని (కౌన్సిల్ రద్దు చేసే ప్రక్రియ సగంలో ఉన్నందున సెలెక్టు కమిటీకి పంపాలనే కౌన్సిల్  నిర్ణయం అమలు కాలపరిమితి పూర్తి అయిపోయినందున) తీర్మానం చేసి బిల్లును మళ్లీ ఆమోదించి రాష్ట్ర గవర్నర్ కు పంపించడం.

దీనికోసం (కరోనా ఉధృతి తగ్గగానే) మూడు రోజుల స్వల్ప వ్యవధి సమావేశం ఏర్పాటు చేసుకోవడం.3. పై రెండు విషయాలకు కరోనా నిబంధనలు సహకరించకపోతే సెలెక్టు కమిటీ తనకు సహజంగా ఉండే మూడు నెలల కాలపరిమితిలో ఏర్పాటు కానందున ఆనాడు కౌన్సిల్ చైర్మన్ తన విచక్షణాధికారంతో తీసుకున్న నిర్ణయం వీగిపోయినట్లేనని కౌన్సిల్ కార్యదర్శి ఒక నోటిఫికేషన్ ద్వారా ప్రకటించడం.

ఇలా కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేస్తే వికేంద్రీకరణ బిల్లును కౌన్సిల్ ఆమోదించినట్లుగా భావించే అవకాశం ఉంటుంది. అప్పుడు తక్షణమే వికేంద్రీకరణ బిల్లు చట్టంగా మారుతుంది కాబట్టి అన్ని అడ్డంకులు తొలగిపోతాయనేది రాష్ట్ర ప్రభుత్వ వ్యూహం గా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే విజయసాయి రెడ్డి అంత ధీమాగా రాజధాని తరలింపు విషయంపై స్పష్టమైన ప్రకటన చేశారని అంటున్నారు.

Related posts

కొల్లాపూర్ రాజా పై పది కోట్ల రూపాయలకు పరువునష్టం దావా

Satyam NEWS

ప్రజాసమస్యలు గాలికి వదిలేసి నా వెనక పడ్డారేమిటి?

Satyam NEWS

నూతన జాతీయ విద్యా విధానం రద్దుకై పోరాటాలు

Bhavani

Leave a Comment