39.2 C
Hyderabad
April 28, 2024 11: 53 AM
Slider ముఖ్యంశాలు

ఉద్యమంలో చూసిన చావులు మూడు నెలల్లో చూస్తున్నాం

#kavita

రాజకీయాలు, కేసీఆర్ ను తిట్టడంపై ఉన్న శ్రద్ధ విద్యార్థులపై లేదు: కామారెడ్డిలో సీఎంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్

గత తెలంగాణ ఉద్యమంలో చూసిన విద్యార్థుల చావులు ఈ మూడు నెలల్లో చూస్తున్నామని నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. సోమవారం బోధన్ హాస్టల్లో జరిగిన ఘటనలో మృతిచెందిన గాంధారి మండలం తిప్పారం తండాకు చెందిన డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థి హర్యాల వెంకట్ కుటుంబాన్ని ఎమ్మెల్సీ కవిత మంగళవారం పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు జనార్దన్ రెడ్డి, ఆయన భార్య ప్రతిభ నిన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా వారి కుటుంబాన్ని ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. అనంతరం కామారెడ్డి పరిధిలోని పొందుర్తి శివారులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. బోధన్ హాస్టల్ లో విద్యార్థుల మధ్య జరిగిన చిన్న గొడవ ఆపడానికి వార్డెన్, వాచ్ మెన్ కూడ లేకపోవడంతో గొడవలో గాంధారి మండలం తిప్పారం తండాకు చెందిన హర్యాల వెంకట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థి మృతి చెందడం హృదయవిదారకమని అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి చేతగానితనం ఇది

ఒక్క విద్యార్థి చనిపోతే హత్య కేసులో మిగతా 7 మంది విద్యార్థులు జైలులో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఒక్క ఘటనతో 8 మంది నవ యువకులు, వారి కుటుంబాలు నాశనం అయ్యే పరిస్థితి ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్ మీడియట్ విద్యార్థులు మర్డర్ కేసులో వెళ్తుంటే దారుణమైన విషయమన్నారు. ఇది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యమని, సీఎం రేవంత్ రెడ్డి పట్టిలేనితనంతో జరిగిన సంఘటన అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మార్చి నుంచి జూన్ వరకు విద్యార్థులకు పరీక్షల కాలం. విద్యాశాఖకు మంత్రి లేకపోవడంతో సీఎం వెంటనే రాజకీయం చేయకుండా తక్షణమే విద్యాశాఖపై సమీక్ష చేయాలని చెప్తూనే ఉన్నామన్నారు. కేవలం బిసి,ఎస్సి, ఎస్టీ గురుకులల్లో ప్రత్యక్షంగా తాను 5 వ చావు చూస్తున్నానని, దాదాపు 12 నుంచి 15 మంది విద్యార్థులను ఈ ప్రభుత్వం పొట్టన పెట్టుకుందని ఆరోపించారు. డిసెంబర్ లో ఏర్పడిన ఈ ప్రభుత్వం విద్యాశాఖపై సమీక్ష చేసుంటే బాగుండేదని అభిపాయపడ్డారు.

ఎంతసేపు పబ్లిసిటీ స్టంట్స్, పొలిటికల్ స్పీచ్, ఇప్పటికీ కేసీఆర్ ను తిట్టడం తప్పితే చేసిందేమీ లేదని విమర్శించారు. ఇప్పటికైనా విద్యాశాఖపై సీఎం రివ్యూ చేయాలని, ఇది పిల్లల ఆట కాదన్నారు. పొలిటికల్ స్పీచ్ ఇచ్చి, కేసీఆర్ ను తిడితే సమస్యలు పరిష్కారం కావన్నారు. బిసి హాస్టల్ లో భవ్య, వైష్ణవి అనే ఇద్దరు ఆడపిల్లలు చనిపోయారని, వాళ్ళిద్దరికి న్యాయం చేయాలి, కనీసం విచారణ చేయించాలని చెప్పినా చేతకాని సీఎం రేవంత్ రెడ్డి అని అన్నారు.

ఆ ఇద్దరు పిల్లల తల్లిదండ్రులు ధర్నా చౌక్ లో ధర్నా చేయడానికి వస్తే అరాచకంగా వారిని పోలీసులు తీసుకెళ్లి అరెస్ట్ చేశారని, కేసీఆర్ పాలనలో ధర్నాచౌక్ లేదని, ఆ అవసరం కూడా రానివ్వలేదని తెలిపారు. ఎవ్వరోచినా మాట్లాడినం.. సమస్య పరిష్కారం చేసినం.. వెన్ను చూపించి పారిపోలేదన్నారు. ప్రజా జీవితంలో సమస్యలు వస్తాయని, వాటిని తట్టుకుని నిలబడాలని, అవి పరిష్కరిస్తేనే ప్రభుత్వం అవుతుంది తప్ప విమర్శిస్తే కాదన్నారు.

కేసీఆర్ ఉద్యోగాలిస్తే రేవంత్ రెడ్డి వాటి పత్రాలు మాత్రమే ఇచ్చారు

కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు ఇచ్చే ఉద్యోగ నియామక పత్రాలిచ్చిన కార్యక్రమంలో కూడా పొలిటికల్ స్పీచ్ మాట్లాడారని, మున్ముందు పార్లమెంట్ ఎన్నికలున్నాయని, రాజకీయంగా మాట్లాడుకుంటే మాట్లాడుకోనన్నారు. భువనగిరి ఎస్సి వెల్ఫేర్ హాస్టల్ లో ఇద్దరు విద్యార్థులు అనుమానాస్పదంగా మృతి చెందితే దానిపై ఈ ప్రభుత్వం చడిచప్పుడు లేదని, ఆ కేసు ఏమవుతుందో ఇప్పటికి తెలియదన్నారు. నాడు తెలంగాణ ఉద్యమంలో ఇన్ని చావులు చూసినమంటే మళ్ళీ ఈ మూడు నెలల్లోనే చూసామని, ఇది సిగ్గుచేటని, పరిపాలన చేతగాని ప్రభుత్వమని, కేవలం ప్రతిపక్షాలను ఆడిపోసుకోవడానికే ముఖ్యమంత్రి ఉన్నారని విమర్శించారు. 

అడబిడ్డల తల్లిదండ్రులు గంటసేపు ధర్నా చేసుకుంటే మీకు పోయేదేముండే.. వాళ్ళను గొర్రెల్ని ఈడ్చుకెళ్లినట్టు ఈడ్చుకెళ్తారా అని ప్రశ్నించారు. ఇదేనా ప్రజా తెలంగాణ.. ఇందుకేనా ప్రజలు మీకు అధికారం అప్పగించింది.. మార్పు కావాలంటే ఇదేనా మీరు చూపించిన మార్పు అని నిలదీశారు. జిల్లాలో వార్డెన్లు, వాచ్ మెన్లు లేని హాస్టళ్లలో ఒక హోంగార్డు లేదా కానిస్టేబుల్ ను నియమించాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్, సిపి లను డిమాండ్ చేసామని, కలెక్టర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.

సీఎంకు సమీక్ష చేసేంత తీరిక లేదని, ఆయనకు పిల్లలంటే పట్టింపు లేదని, పిట్టల్లా రాలిపోతున్నా పట్టించుకోవడం లేదన్నారు. కలెక్టర్లు.. మీరైనా విద్యాశాఖపై రివ్యూ చేయండి అని కోరారు. బోధన్ ఘటనలో చనిపోయిన విద్యార్థిది నిరుపేద గిరిజన కుటుంబమని, స్పెషల్ కేసుగా తీసుకుని విద్యార్థి తల్లికి తక్షణమే పింఛన్ ఇవ్వాలన్నారు. మృతుని సోదరునికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తే ఈరోజు ఉదయమే ఆర్డర్ కూడా రావడం సంతోషమన్నారు.

బాధిత కుటుంబానికి బిసి వెల్ఫేర్ హాస్టల్, బిసి వెల్ఫేర్ శాఖ, విద్యాశాఖతో పాటు ఇతరత్రా మార్గాల ద్వారా 15 లక్షల నష్టపరిహారం అందించాలని, ఆ కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేసారు. పరీక్షలు కొనసాగుతున్న ఈ రెండుమూడు నెలల పాటు ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేస్తే విద్యార్థులను కాపాడుకునే అవకాశం ఉందని ప్రభుత్వానికి సూచించారు.

గతంలో సూర్యాపేట ఘటనలో ఇద్దరు విద్యార్థినులు చనిపోయినప్పుడు చెప్పినమన్న ఆమె ఇప్పుడు కూడా చేతులు జోడించి వేడుకుంటున్నామని, విద్యాశాఖకు మంత్రి లేనందున సీఎం తక్షణమే ఆ శాఖపై సమీక్ష జరపాలన్నారు. ఎక్కడెక్కడ సమస్యలున్నాయో గుర్తించి పరిష్కరించాలన్నారు. తల్లిదండ్రులు తమ బిడ్డల ప్రాణాలను పణంగా పెట్టి హాస్టళ్ళకు పంపిస్తున్నారని, వారి బాధను పట్టించుకోవాలి కోరారు

ఆరెస్సెస్ జ్ఞాపకాలు గుర్తొచ్చాయేమో

నిన్నటి మోడీ సభలో మోడీ మా పెద్దన్న అని సీఎం రేవంత్ రెడ్డి సంభోదించడంపై ఎమ్మెల్సీ స్పందిస్తూ.. గతంలో పని చేసిన ఆరెస్సెస్ జ్ఞాపకాలు రేవంత్ రెడ్డికి గుర్తొచ్చి ఉంటాయన్నారు. గడిచిన బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా కేటాయించని ప్రధాని మోడీ పెద్దన్న ఎలా అవుతాడని ప్రశ్నించారు. పొలిటికల్ అండర్ స్టాండింగ్ ఉండటం వల్లనే పెద్దన్న అని సంభోదించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.

ప్రజా సమస్యలను పక్కన పెట్టకుండా వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబోద్దీన్, జడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, సీనియర్ నాయకులు నిట్టు వేణుగోపాల్ రావు, ఎంజి వేణుగోపాల్ గౌడ్, బీఆర్ఎస్ కామారెడ్డి పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

బిజెపి నేషనల్ కౌన్సిల్ సభ్యునిగా చల్లా వెంకటేశ్వర రావు

Satyam NEWS

నిబంధనలు అతిక్రమించే ప్రైవేట్ ట్రావెల్స్ పై కఠిన చర్యలు

Satyam NEWS

మినిస్టర్స్ వాయిస్: పల్లెలు, పట్టణాల అభివృద్ధే లక్ష్యం

Satyam NEWS

Leave a Comment