తెలంగాణ రాష్ట్రానికి అదనంగా ఐపీఎస్ అధికారులను కేటాయించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు కేవలం 76 మంది ఐపీఎస్ అధికారులను కేటాయించారని తెలిపారు. జిల్లాల విభజన, వివిధ శాఖల పర్యవేక్షణ నిమిత్తం రాష్ట్రానికి అదనంగా 29 అదనపు ఐపీఎస్ పోస్టులు కేటాయించాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తికి కేంద్ర మంత్రి అమిత్ షా సానుకూలంగా స్పందించారు.
2024లో కొత్తగా వచ్చే ఐపీఎస్ బ్యాచ్ నుంచి తెలంగాణకు అధికారులను అదనంగా కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాను రేవంత్‌రెడ్డి ఢిల్లీ నార్త్‌బ్లాక్‌లోని ఆయన కార్యాలయంలో గురువారం సాయంత్రం కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి చెందిన పలు అంశాలను అమిత్ షా దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్లారు.
రాష్ట్ర పునర్విభజన చట్టం తొమ్మిదో షెడ్యూల్‌లో పేర్కొన్న సంస్థల విభజనను పూర్తి చేయాలని, పదో షెడ్యూల్ పరిధిలోని సంస్థల వివాదాన్ని పరిష్కరించాలని, న్యూఢిల్లీలోని ఉమ్మడి రాష్ట్ర భవన్ విభజనను సాఫీగా పూర్తి చేయాలని, చట్టంలో ఎక్కడా పేర్కొనకుండా ఉన్న సంస్థలను ఆంధ్రప్రదేశ్ క్లెయిమ్ చేసుకోవడం విషయంపై దృష్టిసారించాలని కేంద్ర హోం శాఖ మంత్రికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో బలోపేతానికి రూ.88 కోట్లు, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో బలోపేతానికి రూ.90 కోట్లు అదనంగా కేటాయించాలని కేంద్ర హోం శాఖ మంత్రిని ముఖ్యమంత్రి కోరారు.
రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్, హైకోర్టు భవనం, లోకాయుక్త, ఎస్‌హెచ్ఆర్సీ వంటి భవనాలను ఆంధ్రప్రదేశ్ వినియోగించుకున్నందున ఆ రాష్ట్రం నుంచి వడ్డీతో కలిపి మొత్తం రూ.408 కోట్లు ఇప్పించాలని కేంద్ర హోం శాఖ మంత్రిని ముఖ్యమంత్రి కోరారు.
హైదరాబాద్ మెట్రో రెండో దశ సవరించిన ప్రతిపాదనలు ఆమోదించండి…
హైదరాబాద్ మెట్రో రెండో దశ సవరించిన ప్రతిపాదనలు ఆమోదించాలని కేంద్ర పట్టణాభివృద్ది, గృహనిర్మాణ శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్ పురీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఙప్తి చేశారు. కేంద్ర మంత్రిని గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్ మెట్రో రెండో దశను (బీహెచ్ఈఎల్-లక్డీకాపూల్, నాగోల్-ఎల్‌బీ నగర్, 26 కి.మీ., రూ.9,100 కోట్ల అంచనా వ్యయం), (విమానాశ్రయం మెట్రో కారిడార్- రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 32 కి.మీ, రూ.6,250 కోట్ల అంచనా వ్యయం) సవరించాల్సి ఉందని తెలిపారు.
సవరించిన ప్రతిపాదనల ప్రకారం ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టే విషయాన్ని పరిగణించాలని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిని కోరారు. హైదరాబాద్‌లోని మూసీ రివర్ ఫ్రంట్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేయాలని నిర్ణయించామని, అమ్యూజ్‌మెంట్ పార్కులు, వాటర్ ఫాల్స్, చిల్డ్రన్స్ వాటర్ స్పోర్ట్స్, బిజినెస్ ఏరియా, దుకాణ సముదాయాలతో బహుళ విధాలా ఉపయోగపడేలా చేయాలనుకుంటున్నట్లు కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రికి వివరించారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరమని, అవసరమైన మద్దతు ఇవ్వాలని కేంద్రమంత్రి పురీని ముఖ్యమంత్రి కోరారు.
రాష్ట్రంలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వాటిని ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. తెలంగాణకు ఇళ్లు మంజూరు చేయడంతో పాటు ఇవ్వాల్సిన బ్యాలెన్సు నిధులు విడుదల చేయాలని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
పాలమూరు-రంగారెడ్డికి జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించండి…
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించాలని జల్ శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఙప్తి చేశారు. జల్‌శక్తి మంత్రి షెకావత్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి గురువారం సాయంత్రం కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, నీటి పారుదల శాఖ మంత్రి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రాధాన్యతను కేంద్ర మంత్రికి వివరించారు.
కరవు, ఫ్లోరైడ్ పీడిత జిల్లాలైన నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వికారాబాద్, నారాయణపేట, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో 12.30 లక్షల ఎకరాలకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల నుంచి సాగు నీరు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. ఈ ప్రాజెక్టు నుంచి ఆరు జిల్లాల పరిధిలోని 1226 గ్రామాలతో పాటు హైదరాబాద్ మహా నగరానికి తాగు నీరు సరఫరా చేయాల్సి ఉందన్నారు.
ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే పలు అనుమతులు తీసుకున్నా ఇంకా హైడ్రాలజీ, ఇరిగేషన్ ప్లానింగ్, అంచనా వ్యయం, బీసీ రేషియో, అంతరాష్ట్ర అంశాలు కేంద్ర జల సంఘం పరిశీలనలో ఉన్నాయని, వాటికి వెంటనే ఆమోదం తెలపాలని కోరారు. ప్రాజెక్టు ప్రాధాన్యం దృష్ట్యా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వాలని జల్‌శక్తి మంత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి కోరారు.
కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు: ఉత్తమ్ కుమార్‌రెడ్డి
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు అదనపు నిధుల కేటాయింపునకు జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సానుకూలంగా స్పందించారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. జల్ శక్తి మంత్రిని కలిసిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తాము పాలమూరు-రంగారెడ్డికి జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించాలని జల్‌శక్తి మంత్రిని కోరామని తెలిపారు. 2014 తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించలేదని, ఈ విధానం ప్రస్తుతం అమలులో లేదని జల్‌శక్తి మంత్రి తెలిపారన్నారు.
అయితే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రాధాన్యం దృష్ట్యా ఆ ప్రాజెక్టుకు తమ శాఖ పరిధిలోని మరో పథకం కింద 60 శాతం నిధులు కేటాయిస్తామని జల్‌శక్తి మంత్రి హామీ ఇచ్చారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. భారాస ప్రభుత్వ హయాంలో టీఎస్‌పీఎస్సీ పూర్తిగా విఫలమైందని, పేపర్ లీకులతో భ్రష్టు పట్టినందున దానిని సంస్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. టీఎస్‌పీఎస్సీని యూపీఎస్సీ తరహాలో మార్చేందుకుగానూ శుక్రవారం యూపీఎస్సీ ఛైర్మన్‌తో ముఖ్యమంత్రి, తానూ సమావేశం అవనున్నట్లు ఆయన చెప్పారు.