31.7 C
Hyderabad
May 2, 2024 09: 51 AM
Slider విజయనగరం

ఎవరినైనా నొప్పిస్తే అన్యధా భావించవద్దు: కలెక్టర్ సూర్య కుమారి

#suryakumari

2021 జులై లో విజయనగరం కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ఏ.సూర్య కుమారి రెండేళ్లు పూర్తి కాకుండా నే పంచాయతీ రాజ్ ప్రత్యేక కార్యదర్శి గా వెళిపోతున్నారు. విజ‌య‌న‌గ‌రం జిల్లా క‌లెక్ట‌ర్ గా ఎ. సూర్య‌కుమారి దాదాపు రెండు సంవ‌త్స‌రాల పాటు ప్ర‌శంస‌నీయ‌మైన రీతిలో సేవ‌లందించార‌ని, త‌నదైన శైలితో సామాన్యుల‌కు చేరువ‌య్యార‌ని జిల్లా ప‌రిష‌త్ ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు పేర్కొన్నారు.

ప‌రిపాల‌న‌లో త‌నదైన మార్కు వేసుకున్నార‌ని, భ‌విష్య‌త్తులో వ‌చ్చే అధికారుల‌కు మార్గ‌ద‌ర్శిగా నిలిచార‌ని కితాబిచ్చారు. జ‌డ్పీ స‌మావేశ మందిరంలో జరిగిన జిల్లా ప‌రిష‌త్‌ స‌ర్వ స‌భ్య స‌మావేశంలో భాగంగా జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్యకుమారిని ప్ర‌త్యేకంగా స‌త్క‌రించారు. స‌భ్యులంద‌రూ ఆమెకు ఆత్మీయ వీడ్కోలు ప‌లికారు. పార్ల‌మెంటు స‌భ్యులు, శాస‌న మండ‌లి స‌భ్యులు, శాస‌న స‌భ స‌భ్యులు, జ‌డ్పీటీసీ స‌భ్యులు, ఎంపీపీలు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు ఆమెను దుశ్శాలువాల‌తో, పుష్ప‌గుచ్చాల‌తో స‌త్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలు స‌భ‌లో జిల్లా ప‌రిష‌త్ ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు ప్ర‌సంగించారు. జిల్లా క‌లెక్ట‌ర్‌గా ఎ. సూర్య‌కుమారి జిల్లాకు ఎన‌లేని సేవ‌లందించార‌ని, నిత్యం ప్ర‌జా సేవ‌లో నిమ‌గ్న‌మై ప‌రిపాల‌న సాగించార‌ని పేర్కొన్నారు. సున్నిత మ‌న‌స్కురాలైన ఆమె ముక్కు సూటిగా ఉండేవార‌ని గుర్తు చేశారు. ప్ర‌జాప్ర‌యోజ‌నం ఉందంటే ఎంత క‌ష్ట‌మైన ప‌నినైనా చేసి పెట్టేవార‌ని చెప్పారు.

ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో ప్ర‌త్యేక చొర‌వ తీసుకునే వార‌ని, ప్ర‌జా ప్ర‌తినిధుల నుంచి వెళ్లిన సిఫార్సుల‌కు సానుకూలంగా స్పందించేవార‌ని ఈ సంద‌ర్భంగా జ‌డ్పీ ఛైర్మ‌న్‌ గుర్తు చేసుకున్నారు. భోగాపురం అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి సంబంధించిన భూసేక‌ర‌ణ ప్ర‌క్రియ‌లో, నిర్వాసిత కాల‌నీల ఏర్పాటులో, సౌకర్యాల క‌ల్ప‌న‌లో ప్ర‌త్యేక చొర‌వ తీసుకొని అద్భుత ప‌నితీరు క‌న‌బ‌రిచార‌ని కితాబిచ్చారు.

ఎలాంటి సాంకేతిక ప‌రమైన చిక్కుముడులు లేకుండా 2,700 ఎక‌రాల‌ భూసేక‌ర‌ణ ప్రక్రియ‌లో కీల‌క పాత్ర పోషించార‌ని పేర్కొన్నారు. మ‌హిళ‌ల‌కు, పేద‌ల‌కు అండ‌గా నిలిచార‌ని, సి.ఎస్‌.ఆర్‌. కార్య‌క‌లాపాల్లో ప్ర‌ధాన భూమిక పోషించార‌ని గుర్తు చేశారు. గిరిజ‌న విశ్వ‌విద్యాల‌యం ఏర్పాటులో కూడా త‌న‌దైన పాత్ర పోషించార‌ని పేర్కొన్నారు. జిల్లా నుంచి బ‌దిలీపై వెళ్లిపోతూ పంచాయ‌తీ రాజ్ క‌మిష‌న‌ర్ గా జిల్లా ప్ర‌జ‌ల‌కు, స‌భ్యుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌వుతున్నార‌ని ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు అభివ‌ర్ణించారు.

డిప్యూటీ సీఎం పీడిక రాజ‌న్నదొర మాట్లాడుతూ క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను సావ‌ధానంగా ప‌రిష్క‌రించేవార‌ని, రోడ్ల మ‌ర‌మ్మ‌తుల విష‌యంలో, గిరిజ‌న విశ్వ‌విద్యాయ‌లం ఏర్పాటులో, కొఠియా గ్రామాల స‌మ‌స్య‌పై ప్ర‌త్యేక చొర‌వ తీసుకొని త‌న‌దైన రీతిలో పాల‌న సాగించార‌ని పేర్కొన్నారు. పంచాయ‌తీ రాజ్ క‌మిష‌న‌ర్ గా ఆమె ప‌దోన్న‌తి పొందినందుకు సంతోషంగా ఉన్న‌ప్ప‌టికీ.. జిల్లా నుంచి బ‌దిలీపై వెళ్లిపోతున్నందుకు మ‌రో ప‌క్క బాధగా కూడా ఉంద‌ని డిప్యూటీ స్పీక‌ర్ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర స్వామి అన్నారు.

ఎన్నో క్లిష్ట‌మైన స‌మ‌స్య‌ల‌ను సునాయాసంగా ప‌రిష్క‌రించేవారని గుర్తు చేశారు. అద్భుత‌ ప‌ని తీరు ద్వారా జిల్లా ప్ర‌జ‌ల అభిమానాలు, ఆప్యాయ‌త‌ల‌ను సంపూర్ణంగా అందుకున్నార‌ని పేర్కొన్నారు. మెడిక‌ల్ కాలేజీ రాక‌లో.. ప‌నుల విష‌యంలో కీల‌క పాత్ర పోషించార‌ని గుర్తు చేశారు.

ఎన్నో విధాలుగా బొబ్బిలి ప్రాంతానికి స‌హాయ స‌హ‌కారాలు అందించార‌ని బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంక‌ట చిన అప్ప‌ల‌నాయుడు గుర్తు చేశారు. వినూత్న‌మైన రీతిలో సేవ‌లందించి ప్ర‌జా మ‌న్న‌న పొందార‌ని పేర్కొన్నారు. ప్ర‌జా ప్ర‌తినిధుల నుంచి వ‌చ్చే విన‌తుల‌పై సానుకూలంగా స్పందించేవార‌ని చెప్పారు. పార్వ‌తీపురం జిల్లా క‌లెక్ట‌ర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి కార్య‌దీక్ష‌, ప్ర‌త్యేక‌ ప్రణాళికా క‌లిగిన వ్య‌క్తి అని కితాబిచ్చారు. ప‌రిపాల‌నాప‌ర‌మైన అంశాల్లో త‌న‌కు ఎన్నో విధాలుగా సహ‌కారం అందించార‌ని, మార్గ‌ద‌ర్శిగా నిలిచార‌ని పేర్కొన్నారు.

ఎవ‌రి మ‌న‌సైనా నొప్పించి ఉంటే క్ష‌మించండి

ఆత్మీయ వీడ్కోలు స‌భ అనంత‌రం జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి త‌న అభిప్రాయాలు పంచ‌కున్నారు. జిల్లాతో త‌న‌కు ఏర్ప‌డిన బంధం గురించి వివ‌రించారు. జిల్లాలో ప‌ని చేసిన కాలం ఎప్ప‌టికీ మ‌రువ‌లేన‌ని, ఇక్క‌డ ప్ర‌జ‌లు, ప్ర‌జా ప్ర‌తినిధులు వారి సంపూర్ణ స‌హ‌కారంతో నా మ‌న‌సుకు ద‌గ్గ‌ర‌య్యారని పేర్కొన్నారు. మార్చి నెల‌తో స‌రిగ్గా స‌ర్వీసులోకి వ‌చ్చి 27 ఏళ్ల‌య్యింద‌ని.. జిల్లాలో ప‌ని చేసిన కాలం మాత్రం ప్ర‌త్యేక‌మ‌ని చెప్పారు.

ఇక్క‌డి నుంచి బ‌దిలీపై వెళ్లిపోతున్ప‌టికీ త‌న వంతు స‌హ‌కారం అందిస్తాన‌ని హామీ ఇచ్చారు. ఇక్క‌డ ప‌ని చేసిన కాలంలో తెలిసో.. తెలియ‌కో ఎవ‌రి మ‌న‌సైనా నొప్పించి ఉంటే క్ష‌మించాల‌ని క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి ఈ సందర్భంగా కోరారు. విజ‌య‌న‌గ‌రం జిల్లా త‌న‌కి పుట్టినిల్లు లాంటిద‌ని దానిని త‌క్కువ చేసి ఎవ‌రూ మాట్లాడొద్ద‌ని.. ఇక నుంచి వెనుక‌బ‌డిన జిల్లా అని సంబోధించ వద్ద‌ని ఈ సంద‌ర్భంగా విజ్ఞ‌ప్తి చేశారు.

అత్యంత పోటీ వాతావ‌ర‌ణం క‌లిగిన ప్రాంత‌మ‌ని కితాబిచ్చారు. ఈవీడ్కోలు స‌భ‌లో జిల్లాకు చెందిన పార్ల‌మెంటు స‌భ్యులు, శాస‌న మండ‌లి, శాస‌న స‌భ‌, జడ్పీటీసీ, ఎంపీటీసీ స‌భ్యులు, ఎంపీపీలు, వివిధ విభాగాల అధికారులు, జ‌డ్పీ సీఈవో, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

ఇన్వెస్టిగేష‌న్ అసిస్టెంట్లుగా శిక్ష‌ణ పూర్తి చేసుకున్న స్టేష‌న్ రైట‌ర్లు

Satyam NEWS

రఘురామపై ‘లాకప్ దాడి’ కేసులో జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

Satyam NEWS

త్వరలో హీరోయిన్ గా మంత్రి రోజా కుమార్తె అన్షు

Satyam NEWS

Leave a Comment