23.7 C
Hyderabad
February 29, 2024 01: 03 AM
Slider సంపాదకీయం

చావు దెబ్బలతో రక్తం కారుతున్న హస్తం

Sonia_Rahul

లోక్ సభ ఎన్నికలలో చతికిలబడిన కాంగ్రెస్ పార్టీ ఇన్ని నాళ్లయినా కోలుకోలేదు సరికదా మరింత దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్లిపోతున్నది. లోక్ సభ ఎన్నికల లో పరాజయం నుంచి తేరుకోవడం పెద్ద కష్టమైన పనేం కాదు కానీ లోక్ సభ ఎన్నికల తర్వాత జరిగిన రెండు సంఘటనలు కాంగ్రెస్ పార్టీ ని మరింత దెబ్బ తీశాయి. జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయానికి దేశ వ్యాప్తంగా విశేషమైన స్పందన వచ్చింది. అయితే ఆర్టికల్ 370 రద్దు ను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తే దేశంలోని ముస్లిం వర్గాల నుంచి మద్దతు లభిస్తుందని కాంగ్రెస్ అనుకున్నదేమో తెలియదు కానీ అది మాత్రం జరగలేదు సరికదా దేశ ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వాదనను వ్యతిరేకించారు. లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ చేసిన వాదన కు ఏ వర్గం నుంచి మద్దతు రాలేదు సరికదా లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆధిర్ రంజన్ చౌదరి సెల్ప్ గోల్ కొట్టుకుని పార్టీ పరువు మొత్తం తీసేశాడు. సరిహద్దు అవతల పాకిస్తాన్ ఏ వాదన వినిపిస్తున్నదో లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ ఆ వాదన వినిపించడం ప్రజలకు స్పష్టంగా కనిపించింది. దాంతో కాంగ్రెస్ పార్టీలోని నాయకులే పార్టీ పై తిరుగుబాటు చేశారు. ఆర్టికల్ 370 రద్దు జమ్మూ కాశ్మీర్ ప్రజలకేమో గానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం శరాఘాతంలా తగిలింది. లోక్ సభ ఎన్నికలు, ఆర్టికల్ 370 రద్దు ఈ రెండింటితో కుదేలైపోయిన కాంగ్రెస్ పార్టీకి మూడో దెబ్బ చిదంబరం రూపంలో తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు పి.చిదంబరం వేల కోట్ల రూపాయాలు దోచినట్లు సిబిఐ ఆరోపించడం, అరెస్టు చేయడం చకచకా జరిగిపోయాయి. కేంద్ర హోం మంత్రిగా ఉన్నప్పుడు చిదంబరం సిబిఐతో అమిత్ షాను అరెస్టు చేయించారని, అందుకు ఇప్పుడు అమిత్ షా కక్ష తీర్చుకున్నాడని చాలా మంది ప్రచారం చేస్తున్నారు కానీ వాస్తవానికి కోర్టులు జోక్యం చేసుకోవడం వల్ల చిదంబరం అరెస్టు జరిగింది. కోర్టులు ఈ కేసును సీరియస్ గా తీసుకుని ఉండకపోయి ఉన్నట్లయితే చిదంబరం అరెస్టు మరింత వాయిదా పడి ఉండేదే. అమిత్ షా సంగతి అలా ఉంచితే చిదంబరం, ఆయన కొడుకు కార్తీ లు కొల్లగొట్టిన ఆస్తుల వివరాలు బయటకు రావడం, ఇన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులను చిదంబరం కొల్లగొట్టాడని ప్రజలు నమ్మడం కూడా చకచకా జరిగిపోయింది. అయితే కాంగ్రెస్ పార్టీ దురదృష్టం ఎలా ఉందంటే చిదంబరం ను కాపాడాల్సిన అనివార్య పరిస్థితిలో కాంగ్రెస్ ఉండిపోయింది. వేల కోట్ల రూపాయలు దోచిన దొంగను కాంగ్రెస్ పార్టీ సపోర్టు చేస్తున్నది అనే మెసేజ్ దేశ ప్రజలకు వెళ్లడం కాంగ్రెస్ పార్టీకి మరో అతి పెద్ద దెబ్బ. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని లూటీ చేసినట్లు మెజారిటీ ప్రజలు నమ్ముతున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ నాయకులు దోచుకున్నారని వచ్చిన ఆరోపణలను ఆ పార్టీ ఖండించే వీలు కలగలేదు. పైగా చిదంబరం లాంటి అక్రమార్జన చేసిన వ్యక్తుల కేసులు తరచూ తెరపైకి వస్తుండటం, వాటిని కాంగ్రెస్ సమర్ధించాల్సి రావడం లాంటి కారణాలతో ఆ పార్టీ జనంలో మరింత చులకన అయిపోతున్నది. లోక్ సభ ఎన్నికల పరాజయం, ఆర్టికల్ 370 రద్దు, చిదంబరం అరెస్టు లాంటి ఈ మూడు కారణాలతో కాంగ్రెస్ పార్టీ పీకల్లోతు కష్టాలలో కూరుకుపోయింది. ఆ పార్టీ కోలుకోవడం ఇప్పటిలో సాధ్యం కాదు. పైగా ఈ ఊబి నుంచి బయటపడేసేందుకు ఆ పార్టీకి నాయకుడు కూడా లేడు. ఇంకొక్క దెబ్బ తగిలితే కాంగ్రెస్ ముక్త్ భారత్ ను ఈ జనరేషనే చూస్తుంది. వచ్చే జనరేషన్ వరకూ ఆగాల్సిన అవసరం లేదు.

Related posts

కొల్లాపూర్ పర్యటనకు వస్తున్న మంత్రి కేటీఆర్

Satyam NEWS

జులై 3న దేశవ్యాప్త నిరసనలను జయప్రదం చేయండి

Satyam NEWS

ఫలించిన శాసనసభ్యుని ప్రయత్నం:తీరిన ఆయకట్టు రైతుల కష్టాలు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!