తమిళ నటుడు దర్శన్, నటి సనమ్ శెట్టిల వివాదం మరింత ముదిరింది. బిగ్ బాస్ షో తో సెలబ్రిటీలుగా మారిన ఇద్దరూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటుండటంతో ప్రేక్షకులకు వినోదం పెరిగింది. ఒక చిత్రంలో నటిస్తున్నప్పుడు ఇద్దరి మధ్య ప్రేమ పుట్టగా, గత సంవత్సరం మేలో ఇద్దరికీ ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. ఆ తరువాత బిగ్ బాస్ రియాల్టీ షోలో దర్శన్ పాల్గొనడంతో అతనికి మరింత పాప్యులారిటీ వచ్చింది.
షో నుంచి బయటకు వచ్చిన తరవాత ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు గాని సనమ్ శెట్టి చెన్నై పోలీసు కమిషనర్ ను కలిసి దర్శన్ పై ఫిర్యాదు చేసింది. దర్శన్ కు పేరు రావడానికి కారణం తానేనని సనమ్ చెబుతున్నది. దర్శన్ కోసం ఎంతో డబ్బు ఖర్చు చేశానని, అయితే అతను మారిపోయాడని ఆమె ఆరోపించింది. ఈ విషయంలో దర్శన్ తల్లిదండ్రులను సంప్రదిస్తే, అప్పుడు నీపై ప్రేమ ఉందని, ఇప్పుడు లేదని చెబుతూ, తనను గెంటేశారని వాపోయింది. దర్శన్ తనకు నమ్మకద్రోహం చేశాడంటూ ఫిర్యాదు చేసింది.
ఇక సనమ్ ఆరోపణలపై స్పందించేందుకు దర్శన్ మీడియా ముందుకు వచ్చాడు. ఇటీవల తన బాయ్ ఫ్రెండ్ తో సనమ్ గడిపిందని సంచలన ఆరోపణలు చేశాడు. ఒక రాత్రంతా ఫ్రెండ్ తో ఉన్న ఆమెను తానెలా వివాహం చేసుకుంటానని ప్రశ్నించాడు. ఆమెను పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని కుండ బద్దలు కొట్టాడు. వీరిద్దరి ప్రేమ, నిశ్చితార్థం, అది రద్దు కావడం, ఇప్పుడు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలు పెను చర్చకు దారితీశాయి.