పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా ఒక వర్గం (మతం కాదు) చేస్తున్న ఆందోళనలు అర్ధరహితమని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించడం సబబుగానే అనిపిస్తున్నది. ఎందుకంటే పౌరసత్వ సవరణ బిల్లు అకస్మాత్తుగా తెచ్చింది కాదు. ఒక్క రోజులో వచ్చిందీ కాదు. పౌరసత్వ సవరణ బిల్లు 2016 నుండి ప్రజల మధ్యలోనే ఉంది.
దీనిపై చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి. దాదాపు అన్ని పార్టీలూ ఈ బిల్లు తీసుకురావాలని చాలా సందర్భాలలో కోరాయి. పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ఈ బిల్లును క్లియర్ చేసింది. ఇందులో అన్ని పార్టీలకు చెందిన 30 మంది లోక్ సభ, రాజ్య సభ సభ్యులు ఉన్నారు.
అదే బిల్లు ఉభయ సభల ఆమోదం పొంది చట్టంగా మారుతున్నది. మూడు దేశాలకు చెందిన ఆరు మైనారిటీ వర్గాల పౌరులకు భారత పౌరసత్వం ఇచ్చేందుకు ఈ చట్టం వీలుకల్పిస్తున్నది. రాజ్యాంగం మౌలిక సూత్రాలకు ఈ చట్టం భిన్నంగా ఉందనే వాదన వినిపిస్తున్నది. రాజ్యాంగంలో మత ప్రాతిపదికన పౌరసత్వం కల్పించే వీలు లేదు. కరెక్టే.
మరి భారత్ కు వస్తున్న శరణార్థులు మతప్రాతిపదికనే వారి వారి దేశాలలోని మెజారిటీ మతస్థుల హింసకు తట్టుకోలేక వలస వస్తున్నారు కదా? అలా మత ప్రాతిపదికన వస్తున్న వారికి భారత పౌర సత్వం ఇచ్చే సమయంలో మత ప్రస్తావన లేకుండా చట్టాన్ని ఎలా రూపొందిస్తారు?
మన చుట్టూ ముస్లిం దేశాలు ఉండటం వల్ల అక్కడ మెజారిటీ ప్రజలైన ముస్లింలు వేధించే మతాల వారు మన దేశానికి వలస వస్తుంటారు. అలా ముస్లిం దేశాల నుంచి మత హింసను తట్టుకోలేక ముస్లింలు వలస వచ్చే అవకాశం లేదు కదా? మయన్మార్ సమస్యను పక్కన పెట్టి ఆలోచిస్తే ఈ చట్టంలో ఇంత పెద్ద ఎత్తున ఆందోళనలు చేయాల్సిన అవసరం కనిపించడం లేదు.
2014 లో భారత్, బంగ్లాదేశ్ మధ్య సరిహద్దు ఒప్పందం కుదిరింది. 50 పరగణాలను బంగ్లాదేశ్ నుండి భారతదేశంలోకి చేర్చారు. ఫలితంగా, 14864 బంగ్లాదేశ్ పౌరులకు భారత పౌరసత్వం లభించింది. హోం మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ప్రకారం వీరిలో అత్యధికులు ముస్లింలే.
చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం, మతపరమైన హింసకు గురైన బాధితులు 2014 డిసెంబర్ నాటికి భారతదేశానికి వచ్చిన వారికి మాత్రమే ఈ చట్టం వర్తిస్తుంది. ఈ వర్గంలో చాలా మందికి భారత ప్రభుత్వం దీర్ఘకాలిక వీసా పథకాన్ని ఇప్పటికే ప్రవేశపెట్టింది. ఈ కోవకు చెందిన వారు చాలా కాలంగా భారత భూభాగంలోనే ఉంటున్నారు.
వీరు ఇప్పుడు పౌర సవరణ చట్టం క్రింద భారతదేశ పౌరసత్వం పొందుతారు. ఎప్పటికప్పుడు భారత ప్రభుత్వ ప్రత్యేక నిబంధనల ప్రకారం విదేశీ పౌరులకు భారత పౌరసత్వం కల్పిస్తూనే ఉందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నాయి. గత ఆరేళ్లలో 2830 మంది పాకిస్తానీ పౌరులు, 912 మంది ఆఫ్ఘనియులు, 172 మంది బంగ్లాదేశీయులను భారత పౌరులుగా చేశారు.
1964- 2008 మధ్య కాలంలో భారత సంతతికి చెందిన 4.61 లక్షల తమిళులకు భారత పౌరసత్వం లభించింది. 1964,1974 లో భారత శ్రీలంక మధ్య అంతర్జాతీయ ఒప్పందం ఉన్నందున తమిళులు ఇంత పెద్ద సంఖ్యలో పౌరసత్వం పొందే వీలుకలిగింది. ప్రస్తుతం 95 వేల మంది శ్రీలంక శరణార్థులు తమిళనాడులో నివసిస్తున్నారు. వారికి రేషన్ కార్డులతో సహా ఇతర సౌకర్యాలు కల్పించారు.
సకాలంలో భారతీయ పౌరసత్వం పొందడానికి వారు దరఖాస్తు చేసుకోవడానికి ఇప్పుడు వీలుకలుగుతుంది. 1962-1978 మధ్య, బర్మాలో నివసించిన భారతీయ సంతతికి చెందిన రెండు లక్షలకు పైగా ప్రజలు భారతదేశంలో స్థిరపడ్డారు. కారణం, వారికి బర్మాలో పెద్ద వ్యాపారం ఉంది, కాని దానిని అక్కడి ప్రభుత్వం బలవంతంగా స్వాధీనం చేసుకుంది.
ఈ ప్రజలు మన దేశానికి వచ్చారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో నివసిస్తున్నారు. అసలే మత హింసతో బాధపడుతూ ఉన్నది వదిలేసుకుని వచ్చిన తర్వాత కూడా అక్రమ పౌరులుగా ఉంటున్నారనే అవమానాన్ని దిగమింగుకునే వారికి ఈ చట్టం మేలుకలిగిస్తుంది. అంతే తప్ప దేశంలో ఉండే వారికి, ఇక్కడ పుట్టిన వారికి ఈ చట్టంతో ఎలాంటి ప్రమాదం లేదు.
ఈ చట్టం వల్ల తీవ్రంగా నష్టపోయేవి ఈశాన్య రాష్ట్రాలలో నివసించే కొన్ని జాతులు. వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత మాత్రం కేంద్ర ప్రభుత్వంపై ఉంది. వారికి రక్షణ కల్పిచడం తక్షణ అవసరం. పౌరసత్వ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాలలో, పశ్చిమబెంగాల్ లోని కొన్ని ప్రాంతాలలో జరిగే ఆందోళలకు అర్ధం ఉంది.
వాటిని పరిష్కరించాల్సిన బాధ్యతా ఉంది. అంతే తప్ప దేశంలోని మిగిలిన ప్రాంతాలలో మరీ ముఖ్యంగా ఢిల్లీ లాంటి ప్రాంతాలలో జరిగే ఆందోళనలన్నీ రాజకీయ ప్రేరేపితమే. వాటిని అణచి వేయాల్సిందే.