25.2 C
Hyderabad
May 8, 2024 07: 27 AM
Slider సంపాదకీయం

రేగుతున్న వివాదం: అసలు అశోక స్తంభం కధ ఏమిటి?

#ashokstupam

కొత్త పార్లమెంట్ భవనం పైకప్పుపై నిర్మించిన అశోక స్తంభానికి సంబంధించిన వివాదం మరింత ముదురుతోంది. దీన్ని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఆవిష్కరించారు. దీనిపై ప్రతిపక్షాలు అనేక ఆరోపణలు చేస్తున్నాయి. అసలు అశోక స్థంభం ఆకారాన్ని తారుమారు చేసి కొత్త స్తంభాన్ని నిర్మించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించిన భారీ అశోక స్తంభం బరువు 9500 కిలోలు. కాంస్యంతో చేసిన ఈ జాతీయ చిహ్నం ఎత్తు 6.5 మీటర్లు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి 100 మందికి పైగా హస్తకళాకారులు దీనిని తయారు చేశారు. దీన్ని తయారు చేయడానికి తొమ్మిది నెలలకు పైగా పట్టింది.

అధిక స్వచ్ఛత కలిగిన కాంస్యంతో తయారు చేసిన  ఈ చిహ్నం, భూమికి 33 మీటర్ల ఎత్తులో అమర్చారు. దాని సహాయక నిర్మాణాలతో సహా దాని మొత్తం బరువు 16,000 కిలోలు. జాతీయ చిహ్నం బరువు 9,500 కిలోలు కాగా సహాయక నిర్మాణం 6,500 కిలోల బరువు ఉంటుంది. కొత్త పార్లమెంట్ భవనం పైకప్పుపై జాతీయ చిహ్నాన్ని అమర్చే పని ఎనిమిది వేర్వేరు దశల్లో పూర్తయింది. ఇది క్లే మోడల్ తయారీ నుంచి కంప్యూటర్ గ్రాఫిక్స్ తయారీ నుంచి కాంస్య బొమ్మల పాలిషింగ్ వరకు ఉంటుంది.

సింహం గర్జిస్తున్నట్లు కనిపిస్తున్నదా?

అశోక స్థంభంలో సింహ భంగిమపై ప్రస్తుతం వివాదం నడుస్తోంది. ఇప్పటి వరకూ ఉన్న జాతీయ చిహ్నంలోని సింహాలు నోరు మూసుకున్నాయి. అయితే, కొత్త పార్లమెంటు భవనంలోని అశోక స్తంభం సింహాలు దూకుడుగా కనిపిస్తున్నాయి. ఆ సింహాల నోరు తెరిచినట్లుగా ఉంది. ఇప్పుడు సత్యమేవ జయతే నుంచి సింహ మేవ్ జయతేగా మారుతున్నట్లు గా ఉంది అంటూ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ట్వీట్ చేశారు.

అశోక స్తంభం క్రీస్తుపూర్వం 273 నాటిది. ఆ సమయంలో, మౌర్య వంశానికి చెందిన మూడవ పాలకుడు అశోక చక్రవర్తి పరిపాలించాడు. అశోక చక్రవర్తి సామ్రాజ్యం తక్షశిల నుండి మైసూర్ వరకు, బంగ్లాదేశ్ నుండి ఇరాన్ వరకు విస్తరించింది. తన హయాంలో అశోకుడు అనేక ప్రదేశాలలో ఈ స్తంభాలను స్థాపించాడు. దీని ద్వారా సంబంధిత దేశం తన ఆధీనంలో ఉందన్న సందేశాన్ని ఇచ్చాడు.

ప్రస్తుతం ఉన్నది సారానాథ్ మోడలేనా?

ఈ స్తంభాలలో సింహం బొమ్మ ఉంటుంది. వారణాసి సమీపంలోని సారనాథ్ మరియు భోపాల్ సమీపంలోని సాంచి వద్ద ఉన్న స్తంభాలలో సింహాలు ప్రశాంతంగా కనిపిస్తాయి. అశోకుడు బౌద్ధమతాన్ని స్వీకరించిన తర్వాత ఈ రెండు చిహ్నాలను రూపొందించినట్లు చెబుతారు. జాతీయ చిహ్నంగా అంగీకరించిన తర్వాత అశోక స్తంభం ఆకారాన్ని సారనాథ్ నుండి తీసుకున్నారు. ఈ స్తంభం పైన నాలుగు సింహాలు కూర్చుని ఉంటాయి.

అయితే ఒక వైపు నుంచి చూస్తే వాటిలో మూడు మాత్రమే కనిపిస్తాయి. ఒక సింహం బొమ్మ వెనుక దాక్కుని ఉంటుంది. అశోక స్తంభంలోని నాలుగు సింహాలు బలం, ధైర్యం, విశ్వాసం మరియు గర్వానికి ప్రతీక. అశోక స్తంభం నుండి తీసుకున్న జాతీయ చిహ్నంలో మరొక విషయం అశోక చక్రం. జాతీయ జెండాలో ఈ అశోక చక్రం కనిపిస్తుంది.

ఇది బౌద్ధ ధర్మచక్రం. ఇందులో 24 చువ్వలు ఉన్నాయి. అశోక చక్రాన్ని విధి చక్రం అని కూడా అంటారు. ఇందులో ఉండే చువ్వలు మనిషిలోని 24 లక్షణాలను సూచిస్తాయి. ఈ చక్రం భారతీయ త్రివర్ణ పతాకం మధ్య భాగంలో ఉంచారు. అశోక స్తంభం కింది భాగంలో తూర్పున ఏనుగు, పడమర వైపు ఎద్దు, దక్షిణం వైపు గుర్రం, ఉత్తరం వైపు సింహం ఉంటాయి.

ఈ మొత్తం చిహ్నం తామర పువ్వు మూలాంశంపై చెక్కి ఉంటుంది. బుద్ధుడు తన మొదటి ఉపన్యాసం ఇచ్చిన ప్రదేశానికి గుర్తుగా సారనాథ్ సమీపంలో ఈ స్తంభాన్ని నిర్మించారు. బౌద్ధమతంలో, సింహం బుద్ధునికి పర్యాయపదంగా పరిగణిస్తారు. జ్ఞానోదయం పొందిన తరువాత, బుద్ధ భగవానుడు బౌద్ధమత ప్రచారాన్ని ప్రారంభించిన ప్రదేశం, ఈ రోజు దీనిని సారనాథ్ అని పిలుస్తారు.

బౌద్ధమతాన్ని స్వీకరించిన తర్వాత అశోక చక్రవర్తి ఇక్కడ ఈ స్తంభాన్ని నిర్మించాడు. స్వాతంత్య్రానంతరం జాతీయ చిహ్నంగా దీన్నే స్వీకరించారు. సామాజిక న్యాయం, సమానత్వం గురించి కూడా ఈ అశోకస్తంభంలో ఉంటుంది.

ఈ స్తంభానికి జాతీయ చిహ్నం హోదా ఎప్పుడు వచ్చింది?

భారత ప్రభుత్వం 26 జనవరి 1950న అశోక స్తంభాన్ని తన చిహ్నంగా స్వీకరించింది. అశోక స్తంభం జాతీయ చిహ్నంగా ఎంపిక చేశారు. ఎందుకంటే ఇది నిగ్రహించబడిన శక్తిని, అదే సమయంలో శాంతిని సూచిస్తుంది. ముఖ్యమైన ప్రభుత్వ పత్రాలు, నాణేలపై అశోక స్తంభం కనిపిస్తుంది.

1950లో, అశోక స్తంభాన్ని జాతీయ చిహ్నంగా పరిగణించినప్పుడు, దానికి సంబంధించి కొన్ని నియమాలు కూడా రూపొందించారు. ఉదాహరణకు, అశోక స్థూపాన్ని రాజ్యాంగ పదవులలో ఉన్న వ్యక్తులు మాత్రమే ఉపయోగించాలి. ఇందులో భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు, ఉన్నతాధికారులు ఉంటారు.

అనధికారికంగా ఈ చిహ్నం వాడితే జైలు శిక్ష

కానీ పదవీ విరమణ తర్వాత, ఏ మాజీ అధికారి మాజీ మంత్రి, మాజీ ఎంపీ లేదా ఎమ్మెల్యే ఈ జాతీయ చిహ్నాన్ని ఉపయోగించ కూడదు. సాధారణ పౌరులు కూడా దీనిని ఉపయోగించలేరు. అనధికారికంగా ఈ చిహ్నాన్ని వాడితే రెండు సంవత్సరాల కు పైబడిన కాలానికి జైలు శిక్ష విధిస్తారు. దీనితో బాటు కనీసం ఐదు వేల రూపాయల వరకూ జరామానా విధిస్తారు.

జాతీయ చిహ్నంలో ఎలాంటి మార్పు చేయలేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. సారనాథ్‌లోని అశోక స్తంభం 1.6 మీటర్ల ఎత్తు, పార్లమెంటు కొత్త భవనంపై ఏర్పాటు చేసిన స్తంభం 6.5 మీటర్ల ఎత్తు, సారనాథ్‌లోని అశోక స్థంభం కంటే నాలుగు రెట్లు ఎక్కువ. అయితే దీని డిజైన్‌లో ఎలాంటి మార్పు లేదని నేషనల్ ఐకాన్ మేకర్ సునీల్ డియోర్ చెప్పారు. అసలు బొమ్మ కంటే పెద్ద విగ్రహం కిందికి భిన్నంగా కనిపించవచ్చని ఆయన చెప్పారు.

Related posts

వాలంటీర్ల వ్యవస్థతో గ్రామ స్వరాజ్యం అంతం

Satyam NEWS

టీడీపీ పార్లమెంట్ కార్యాలయంలో జాతీయ జెండాకు వందనం

Satyam NEWS

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

Satyam NEWS

Leave a Comment