40.2 C
Hyderabad
April 28, 2024 16: 46 PM
Slider ప్రత్యేకం

Target Satyakumar: తమ నీడను చూసి తామే భయపడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు

#satyakumarBJP

‘విభజించు పాలించు’ అనేది బ్రిటీష్ వాడి సిద్ధాంతం. ‘బెదిరించు లొంగదీసుకో’ అనేది ఇప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారమే బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ను తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియా టార్గెట్ చేసింది.

కరడుకట్టిన బిజెపి భావజాలానికి ప్రతిరూపంగా రాజకీయ రంగంలోకి వచ్చిన సత్యకుమార్ ను చంద్రబాబు అనుకూలుడుగా ముద్ర వేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా విభాగాలు విఫలయత్నం చేస్తున్నాయి. తమకు వ్యతిరేకంగా ఏ చిన్న మాట మాట్లాడినా చిగురుటాకులా వణికిపోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ నీడను చూసి తామే భయపడిపోతున్నారు.

లొంగకపోతే విషప్రచారమే…

ఈ భయాన్ని దాచుకోవడానికి బిజెపి జాతీయ కార్యదర్శిగా అంకితభావంతో పని చేస్తూ ప్రతిష్టాత్మక ఉత్తర ప్రదేశ్ బిజెపికి సహ బాధ్యుడుగా ఉన్నత స్థానంలో ఉన్న సత్యకుమార్ పై బురదచల్లుతున్నది. రెండు మూడు రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రింట్ ఎలక్ట్రానిక్ సోషల్ మీడియాలలో సత్యకుమార్ పై విషం చల్లుతున్న విధానం చూస్తుంటే వారి బెదిరింపులకు లొంగని వారిపై ఎంతటి విషప్రచారం చేస్తారో అర్ధం అవుతున్నది.

ఉత్తరప్రదేశ్ బిజెపిలో కీలక బాధ్యతలు పోషిస్తున్న సత్యకుమార్ ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు, బిజెపి జాతీయ అధ్యక్షుడు జె పి నడ్డాకు అత్యంత సన్నిహితుడు. ప్రస్తుత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడిని తన రాజకీయ గురువుగా భావించి పార్టీకి అంకితభావంతో పని చేస్తున్న సత్యకుమార్ ఒక రకంగా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్యగా మారారు.

ప్రతి విషయంలోనూ కులం కోణమే….

ప్రతి అంశాన్నీ కుల కోణంలో మాత్రమే చూసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్యకుమార్ సామాజిక నేపథ్యం పై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. తద్వారా సమాజంలో ఒక దురభిప్రాయాన్ని కలిగించడం ద్వారా బిజెపిపై బురద చల్లేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు తమ మీడియా ద్వారా చేస్తున్న ప్రచారం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.

రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ వేగంగా పడిపోతున్న తరుణంలో తీవ్ర అసహనానికి లోనవుతున్న ఆ పార్టీ నాయకులు, సత్యకుమార్ ను టార్గెట్ గా చేసుకున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న భారత రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి బిజెపి రాష్ట్ర పార్టీ వైఖరిపై సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారడంతో ఒక్క సారిగా ఉలిక్కి పడ్డ ఆ పార్టీ నాయకులు ‘అత్త కొట్టినందుకు కాదు తోటికోడలు నవ్వినందుకు’ అన్న చందంగా ప్రవర్తించడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది.

రాష్ట్రంలో కేవలం తమ స్వలాభానికి మాత్రమే నిర్ణయాలు తీసుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ నిర్ణయాలు వికటించిన ప్రతి సారీ తమకు కేంద్రంలోని బిజెపి అగ్రనేతల మద్దతు ఉన్నట్లు అసత్య ప్రచారం చేసుకోవడం పరిపాటిగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చీకటి నిర్ణయాలు తీసుకుంటూ ‘ముందే బిజెపి నాయకులకు చెప్పి చేస్తున్నాం’ అనే ప్రచారం ఎక్కువ చేస్తున్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ మైండ్ గేమ్ కు చెక్ పెడుతున్న సత్య

ఇలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైండ్ గేమ్ ను సత్యకుమార్ ఎప్పటికప్పుడు ప్రజలకు వెల్లడి చేస్తున్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వెన్నులో వణుకు పుట్టిస్తున్నది. రాష్ట్రంలో బిజెపి విజయావకాశాలపై ప్రభావం చూపించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషప్రచారం చేయడం ఇది తొలిసారి కాదు.

కేంద్ర ప్రభుత్వ సంస్థలు తక్కువ ధరకు ఇస్తున్న విద్యుత్ ను రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ ధరకు అమ్ముకుంటోందని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించిన తర్వాత అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడే తన నైజాన్ని చాటుకుంది.

ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన బిజెపి జాతీయ అధ్యక్షుడు జె పి నడ్డా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రజలకు వివరించి చెప్పారు. వెనువెంటనే బిజెపి జాతీయ అధ్యక్షుడు జె పి నడ్డా పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా విష ప్రచారానికి తెరతీసింది.

అత్యంత దారుణమైన పదజాలాన్ని వినియోగించి సోషల్ మీడియాలో ట్రోల్ చేసింది. రాష్ట్ర పార్టీకి చెందిన కొందరు నాయకులు తమ గుప్పిటిలో ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తూ ఆ నెపాన్ని ‘ఎల్లో మీడియా’ చేస్తున్నట్లు ‘కౌంటర్ ప్రచారం’ చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ‘మాస్టర్ డిగ్రీ’ చేసినట్లు కనిపిస్తున్నది.

గత కొద్ది కాలంగా సత్యకుమార్ చేస్తున్న వ్యాఖ్యలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. సమాధానం చెప్పలేని నిస్సహాయ స్థితిలో ప్రత్యారోపణలు చేయడం ఒక్కటే మార్గంగా ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో ఇది ఎక్కువ కాలం కొనసాగే అవకాశం లేదు.

Related posts

ఖమ్మం టౌన్ ఏసీపీగా పీవీ గణేష్

Murali Krishna

యోగ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఇంటివద్దకే ఉచిత భోజనం

Satyam NEWS

అగ్ని ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

Satyam NEWS

Leave a Comment