కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వచ్చే నెల 7న నిర్వహించే సీతారాముల కల్యాణం వేదికను ఈ సారి మార్పు చేశారు. రామయ్య క్షేత్రంలో పరిమిత భక్తుల నడుమ నిర్వహించాలని తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు.
శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు, సీతారాముల కల్యాణం నిర్వహించాలా వద్దా అని వైద్య, ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి నివేదించారు. సామూహిక భక్తుల రద్దీ ఉన్న ఆర్భాటంగా చేయొద్దని సూచించినట్లు తెలిసింది. గతంలో రాములోరి కల్యాణం చేసినట్లు తరహాలోనే ఈ దఫా చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు.
పూర్వం నుంచి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సమయంలో జానకిరాముల పరిణయ ఘట్టాన్ని రామయ్య క్షేత్రంలో నిర్వహించేవారు. 2007లో రాజ గోపురం (తూర్పు ద్వారం) ముంగిట్లోకి కల్యాణ వేదికను మార్పు చేశారు. ఆ తర్వాత 2014 వరకు తూర్పు సోపానాలపై చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఒంటిమిట్టలో అధికారికంగా నవమి వేడుకలను చేయాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. 2015 మార్చి 27-ఏప్రిల్ 6 వరకు ఉత్సవాలను దేవదాయ శాఖ పర్యవేక్షణలో చేయాలని నిర్ణయించారు. 2015 సెప్టెంబరు 9న తిరుమల తిరుపతి దేవస్థానాలలో విలీనం చేశారు.
ఆలయానికి సమీపంలో ఉన్న మాన్యం భూముల్లో కల్యాణ వేదికను నిర్మించారు. 2016 ఏప్రిల్ 14-24 (కల్యాణం-20న), 2017 ఏప్రిల్ 4-14 (రాములోరి పెళ్లి-10న), 2018 మార్చి 2 ఏప్రిల్-3 వరకు (పరియణం-మార్చి 30), 2019 ఏప్రిల్-12-22 (రామయ్య కల్యాణం-ఏప్రిల్ 18) వైభవంగా నిర్వహించారు.
ఈ సారి కూడా వచ్చే 1 నుంచి 11వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి భయంతో మళ్లీ పరిమిత భక్తులతో గుడిలో చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు.