30.7 C
Hyderabad
May 5, 2024 03: 32 AM
Slider ప్రత్యేకం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవితవ్యంపై వచ్చే నెలలో కోర్టు తీర్పు?

#YSJaganmohanReddy

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవితవ్యం జనవరి 29న తేలనుంది. మీరు కరెక్టే చదివారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏమిటో ఆ రోజుకు తేలిపోతుంది. ఆ రోజు ఢిల్లీ హైకోర్టులో కేసు వాదనలు ముగుస్తాయి.

అదే రోజు కానీ ఆ తర్వాత కొద్ది రోజులకు గానీ తీర్పు వెలువడే అవకాశం ఉంది. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పేరుపై జరుగుతున్న వ్యాజ్యం అది. మహబూబ్ పాషా అనే నాయకుడు ముందుగా వైఎస్ఆర్ పార్టీ అనే నామకరణంతో పార్టీ పెడుతున్నట్లు ఎన్నికల సంఘం అనుమతి కోరారు.

అయితే వ్యక్తి పేరుతో పార్టీ పెట్టే అవకాశం లేదని ఎన్నికల సంఘం ఆయన అభ్యర్ధనను తిరస్కరించింది. దాంతో ఆయన అన్నా వై ఎస్ ఆర్ పార్టీ అని పెట్టుకున్నారు. తర్వాత యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనే పేరుతో శివకుమార్ అనే నాయకుడు పార్టీ పెట్టగా ఆయన నుంచి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ పార్టీని కొనుక్కున్నారు.

అప్పటి నుంచి వై (యువజన) ఎస్ (శ్రామిక)ఆర్ (రైతు) కాంగ్రెస్ పార్టీ పేరుతో ఆయన పార్టీ నడుపుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ 151 స్థానాలు సాధించి కొత్త రికార్డు స్థాపించింది. అదే పార్టీ పేరుతో నర్సాపురం పార్లమెంటు స్థానం నుంచి గెలిచిన కె.రఘురామకృష్ణంరాజు కు ప్రభుత్వంతో విభేదాలు వచ్చాయి.

షోకాజ్ నోటీసుతో అసలు చర్చ మొదలు

ప్రభుత్వ నిర్ణయాలతో వ్యతిరేకించిన ఆయనకు పార్టీ నుంచి షోకాజ్ నోటీసు ఇచ్చారు. అదీ కూడా వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పేరు ఉన్న లెటర్ హెడ్ పై రఘురామకృష్ణం రాజుకు షోకాజ్ నోటీసును విజయసాయిరెడ్డి ఇవ్వడంతో అసలు వివాదం మొదలైంది.

తాను గెలిచింది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నుంచి అని, తనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని రఘురామకృష్ణం రాజు తెగేసి చెప్పడమే కాకుండా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేశారు. ఈ అంశాలన్నింటిపైన ఢిల్లీ హైకోర్టులో కేసు దాఖలు అయింది.

ఆ కేసులో ఇప్పటికే విచారణ జరిగింది. వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని పార్టీ అఫిడవిట్ దాఖలు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కూడా సమాధానం తీసుకున్నారు. ఢిల్లీ హైకోర్టు ఈ కేసులో తుది వాదనలు విన్న తర్వాత తీర్పు వెలువరించే అవకాశం కనిపిస్తున్నది.

వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి వాదనతో కోర్టు ఏకీభవిస్తుందా లేక తీర్పు వేరే విధంగా ఉంటుందా అనే అంశం మనం చెప్పేది కాదు. పార్టీ పేరు పైనే వ్యాజ్యం నడుస్తున్నందున ఏం జరుగుతుందనేది తీవ్ర ఆసక్తి రేపుతున్నది. పార్టీ పేరు మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తే పరిణామాలు ఏ విధంగా ఉంటాయనే విషయంపై కూడా పార్టీ వర్గాలలో చర్చ జరుగుతున్నది.

కొత్త పార్టీ పెట్టాల్సిన పరిస్థితి వచ్చినా, పార్టీ పేరు మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చినా ఇప్పటికే ఎన్నికైన 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపిల భవితవ్యం ప్రశ్నార్ధకమౌతుంది. అన్నా వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మహబూబ్ పాషా ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి పార్లమెంటు స్థానానికి తెలంగాణ లోని నాగార్జున సాగర్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించారు.

Related posts

అశ్లీల చిత్రాల ఘటనలో SVBC ఉద్యోగుల సస్పెన్షన్‌

Satyam NEWS

గుర‌జాడ విశ్వ‌విద్యాల‌య స్థాప‌న‌: విద్య‌, ఉద్యోగావకాశాలకు మేలిమ‌లుపు

Satyam NEWS

టార్గెట్ : భారత్ లో దాడులకు ఐఎస్ఐ కుట్ర

Satyam NEWS

Leave a Comment