29.7 C
Hyderabad
May 3, 2024 04: 45 AM
Slider మహబూబ్ నగర్

వనపర్తి జిల్లా కోర్టును మోడల్ కోర్టుగా తీర్చిదిద్దుతాం

#wanaparthybar

తెలంగాణ హైకోర్టు పరిధిలో సత్వర న్యాయం అందించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని, కోర్టులలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నాగార్జున, జస్టిస్ సాంబశివరావులు వెల్లడించారు. 

శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రిన్సిపల్ కోర్టు భవనాన్ని అదనపు సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టును మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ నాగార్జున మాట్లాడుతూ తెలంగాణ  హైకోర్టు పరిధిలోని అన్ని జిల్లాల కోర్టులో మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు  హైకోర్టు పలు చర్యలు తీసుకుందని ఆయన అన్నారు.

శనివారం వనపర్తికి చెందిన  హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగార్జునకు స్థానిక న్యాయవాదులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు పౌర సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇటీవల కాలంలోనే 15 కొత్త కోర్టులు మంజూరయ్యాయని చెప్పారు. గతంలో ఉమ్మడి జిల్లా కేంద్రాలలోనే కోర్టులుండేవనీ దీంతో కేసుల సంఖ్య గణనీయంగా పెరగటం వల్ల ఇబ్బందులు పడాల్సి వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం కొత్త జిల్లా లలోనూ  కోర్టుల సంఖ్య పెరిగిందనీ, సత్వర న్యాయం లభిస్తున్నదని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త కోర్టులలో సౌకర్యాల కల్పనకు తమకు సహకరిస్తున్నదని జస్టిస్ నాగార్జున ఆనందం వ్యక్తం చేశారు.వనపర్తితో తనకెంతో అనుబంధం ఉన్నదనీ ఇక్కడే పుట్టి న్యాయవాది గా ప్రాక్టీస్ చేస్తూ హైకోర్టు జస్టిస్ గా ఎదిగాననీ వివరించారు.వనపర్తి జిల్లా ప్రిన్సిపుల్ కోర్టును రాష్ట్రంలోనే మోడల్ కోర్టుగా రూపొందిస్తున్నట్లు జస్టిస్ నాగార్జున చెప్పారు. హైకోర్టు తరహాలో ఇక్కడ సౌకర్యాలు కల్పించటంలో స్థానిక మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తమకు సహకరించడం ఆనందంగా ఉన్నదని చెప్పారు. కోర్టులో 200 కంప్యూటర్లు, లైబ్రరీ, ఫర్నీచర్ ఇతర సౌకర్యాలని కల్పించామన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు త్వరలో అదనపు జిల్లా కోర్టులను ఇచ్చేందుకు హైకోర్టు సుముఖంగా ఉన్నదని జస్టిస్ నాగార్జున వెల్లడించారు.  వనపర్తిలో స్పెషల్ మ్యాజిస్ట్రేట్ కోర్టు (మార్నింగ్ కోర్టు)ను త్వరలో ఏర్పాటు చేస్తామని జస్టిస్ నాగార్జున హామీ ఇచ్చారు.

మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ వనపర్తిలో జిల్లా కోర్టు ఏర్పాటు చేసుకోవడం అదృష్టమని ఆయన అన్నారు. కొత్త జిల్లా ఏర్పాటు చేసుకొని అన్ని రంగాలలో అభివృద్ధి జరుగుతున్నదని, జిల్లా ప్రజలకు, కక్షిదారులకు సత్వర న్యాయం జరిగేందుకు సుదూర ప్రాంతాలకు వెళ్ళవలసిన అవసరం లేకుండా జిల్లా కోర్టులు ఏర్పాటు చేయడం శుభ పరిణామమని ఆయన తెలిపారు. 1984లో సబ్ కోర్ట్ ఏర్పాటు చేసినట్లు, 1995లో రెవెన్యూ డివిజన్ అయిందని మంత్రి తెలిపారు.

ప్రస్తుతం తెలంగాణ ఏర్పాటు అయ్యాక జిల్లా కోర్టులో రావడం మన అదృష్టం అన్నారు. టెక్నాలజీ పెరిగి సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, సామాన్య నేరాలు తగ్గుతున్నాయని ఆయన తెలిపారు. న్యాయ వ్యవస్థపై అందరికీ అవగాహన కలిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని, ప్రజల వద్దకే న్యాయమూర్తులు వెళ్లి న్యాయ వ్యవస్థ చట్టాలపై అవగాహన కల్పిస్తున్నారని ఆయన సూచించారు. రాష్ట్రంలో, జిల్లాలలో న్యాయశాఖ, శాసన శాఖ, కార్యనిర్వాహక శాఖల సమన్వయంతో సమాజ పురోగతికి దోహదం చేయాలని మంత్రి అన్నారు.

అనంతరం హైకోర్టు న్యాయమూర్తులను ఘనంగా సన్మానుంచారు. ఈ సందర్భంగా చిన్నారుల కూచిపూడి నృత్యం పలువురిని అలరించింది.

ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ ప్రధాన(హైకోర్టు) న్యాయమూర్తి డా. నాగార్జున, హై కోర్ట్ న్యాయమూర్తి సాంబశివ నాయుడు, ఉజెబ్ అహ్మద్ ఖాన్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు భరత్ కుమార్, ఉమ్మడి జిల్లా న్యాయమూర్తులు జయ ప్రసాద్, రజిని, నాగార్జున, మిత్ర, గౌస్ పాషా, రామేశ్వర్ రెడ్డి. మురళి, జడ్పీ చైర్మన్ ఆర్.లోకనాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, ఎస్పీ అపూర్వ రావు, జిల్లా న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు భరత్ కుమార్, ప్రధాన కార్యదర్శి విజయ భాస్కర్ సీనియర్ న్యాయవాదులు బక్షి చంద్రశేఖర్ రావు,మోహాన్ కుమార్, రామచంద్రారెడ్డి, దినేష్ రెడ్డి,వెంకటరమణ, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు, వనపర్తి మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు  పాల్గొన్నారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

అమెరికాకు వెళ్లిన మంత్రి కేటీఆర్

Sub Editor 2

వోట్ టు టీఆరెస్:దేశంలోనే ఆదర్శవంతంగా వేములవాడ

Satyam NEWS

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి

Satyam NEWS

Leave a Comment