36.2 C
Hyderabad
April 27, 2024 22: 02 PM
Slider సంపాదకీయం

కందకు లేని దురద ఈ కత్తిపీటకు ఎందుకు?

#garikapati

కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు? అనేది సామెత. చిరంజీవి తమ్ముడిగా మాత్రమే పేరు పొందిన నాగబాబు ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుపై చేసిన ట్వీట్ ను చూస్తే ఈ సామెత గుర్తుకువస్తుంది. చిరంజీవి పెద్ద నటుడే కావచ్చు. సభా మర్యాద అనేది ఒకటి ఉంటుంది. ఎవరైనా సభలో ప్రసంగిస్తున్నప్పుడు లేచివెళ్లిపోవడం మధ్యలో అడ్డుకోవడం లేదా ఏదైనా వెకిలిచేష్టలతో ఎగతాళి చేస్తూ హావభావాలు ప్రదర్శించడం సభామర్యాదలను ఉల్లంఘించినట్లు అవుతుంది.

దసరా పండుగను పురస్కరించుకుని విజయదశమి తర్వాత రోజు అప్పటి బీజేపీ నాయకుడు, ఇప్పటి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ‘‘అలయ్ బలయ్’’ అనే కార్యక్రమాన్ని గత కొద్ది సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన గవర్నర్ హోదాలో ఉండటంతో ఆయన తరపున ఆయన కుమార్తె విజయలక్ష్మి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, వారసత్వానికి అద్దం పట్టేలా ఈ కార్యక్రమం ఉంటుంది.

రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు, పలువురు ప్రముఖులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తోంది. దీనిలో భాగంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఆలింగనం చేసుకుని తమ ఆత్మీయతను వెలిబుచ్చుతారు. ఇంతటి మహత్తర కార్యక్రమంలో పాల్గొన్న ఇద్దరు ప్రముఖుల మధ్య జరిగిన ఒక చిన్న సంఘటనను తీవ్ర వివాదంగా మార్చిన వ్యక్తి నాగబాబు.

తన అన్నపై తనకు ఎనలేని అభిమానం ఉండటం తప్పులేదు. పైగా ఆయన తనకు జీవితాన్నిచ్చిన వ్యక్తి. అయితే ఈ సంఘటనలో ప్రమేయం ఉన్న మరో వ్యక్తి కూడా అంతకు తక్కువేం కాదు. ఆధ్యాత్మిక ప్రవచనాలతో జనాన్ని ఉర్రూతలూగించే మహామనిషి. మూఢనమ్మకాలను పారదోలేందుకు, హిందూ ధర్మాన్ని విస్తరించేందుకు, సనాతన సాంప్రదాయాలను పాటించేలా యువతకు మార్గదర్శనం చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న వ్యక్తి ఆయన.

అలాంటి వ్యక్తి అయిన గరికపాటి నరసింహారావును కించపరుస్తూ తన అన్నను పొగుడుకుంటూ నాగబాబు ట్వీట్ పెట్టి తన చిన్న బుద్ధిని ప్రపంచానికి వెల్లడించుకున్నారు. గరికపాటి నరసింహరావు పేరు ప్రస్తావించకుండా ఏపాటి వాడికైనా చిరంజీవి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ ఉండటం పరిపాటేనని నాగబాబు వ్యాఖ్య.

చిరంజీవి ప్రాముఖ్యత పట్ల గరికపాటి వారు అసూయ పడ్డారా? ఏమిటీ వ్యాఖ్య? ఏమైనా అర్ధం ఉందా? చిరంజీవి మెగాస్టార్ అయితే అది సినీ ప్రపంచానికి సంబంధించింది. రాజకీయాలలో ఆయన ఒక విఫల నాయకుడు. అయితే ఈ విఫల నాయకుడిని ఎవరూ కూడా ఆ దృష్టితో చూడరు. మెగాస్టార్ ఇమేజ్ ఆయనను అన్నిటికీ అతీతుడిని చేసింది.

అంత మాత్రాన చిరంజీవిని చూసి గరికపాటి వారు అసూయపడ్డారని చెప్పడం ఎంత వరకు సమంజసం? ఆ రోజు చిరంజీవి, ప్రవచనకర్త అష్టావధాని గరికపాటి నరసింహరావు మరి కొద్ది మంది ప్రముఖులు వేదికపై ఉన్నారు. కార్యక్రమానికి వచ్చిన కొద్ది మంది చిరంజీవితో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు. అభిమానులు అడగడంతో వారితో చిరంజీవి ఫోటోలు దిగుతున్నారు.

ఇదే సమయంలో గరికపాటి నరసింహరావు ప్రసంగిస్తున్నారు. ఆయన ప్రసంగిస్తుండగా.. కార్యక్రమానికి హాజరైన వారు చిరంజీవితో ఫోటోలు దిగుతుండటంతో.. గరికపాటి నరసింహరావు మధ్యలో ప్రసంగం ఆపి.. ఫోటో సెషన్ ఆపాలని, లేకపోతే తాను కార్యక్రమం నుంచి వెళ్లిపోతానని ప్రకటించారు.

ఈ మాట విన్న వెంటనే చిరంజీవి వచ్చి తనకు కేటాయించిన సీట్లో కూర్చున్నారు. ఆ తర్వాత గరికపాటి నరసింహరావు తన ప్రసంగాన్ని కొనసాగించారు. అనంతరం గరికపాటి నరసింహరావు వద్దకు వెళ్లిన చిరంజీవి ఫోటో సెషన్ పై వివరణ ఇచ్చారు. గరికపాటి నరసింహరావు ప్రవచనాలంటే తనకు ఎంతో ఇష్టమని ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు. భవిష్యత్తులో అవకాశం ఉంటే మిమల్ని మా ఇంటికి ఆహ్వానించుకుంటానని గరికపాటి నరసింహరావుని ఉద్దేశించి అన్నారు.

గరికపాటి నరసింహరావు కూడా ఆ ఘటనను పక్కనపెట్టి చిరంజీవితో సరదాగా మాట్లాడారు. ఈ ఘటనపై చిరంజీవి, గరికపాటి నరసింహరావు కార్యక్రమం తర్వాత ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇద్దరూ ఇంత హూందాగా ఉన్నప్పుడు చిరంజీవి తమ్ముడు చిరంజీవి స్థాయిని తగ్గించే విధంగా వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు కరెక్టు? నాగబాబు చేసిన ఈ అనాలోచిత వ్యాఖ్యలకు ఇప్పుడు చిరంజీవి అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు.

గరికపాటి వారి ప్రసంగాలను అడ్డుకుంటారట. గరికపాటి నరసింహారావు ఆదాయం కోసం ప్రవచనాలు చెప్పడం లేదు. ఆయన ప్రవచనాలను అడ్డుకున్నంత మాత్రాన ఆయనకు ఒరిగే నష్టం ఏమీ లేదు. చిరంజీవికి కలిసి వచ్చేది కూడా ఏదీ లేదు. అలయ్ బలయ్ పెట్టిందే కలిసి ఉండాలనే సందేశం విస్తరించేందుకు. బండారు దత్తాత్రేయకు రాజకీయంగా బద్ధ విరోధి అయిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు ఈ కార్యక్రమానికి క్రమం తప్పకుండా వస్తున్నారు.

బండారు దత్తాత్రేయను ఆలింగనం చేసుకుని తన ఆత్మీయతను వెల్లడిస్తారు. అందుకు దత్తన్న కూడా హనుమంతరావును అక్కున చేర్చుకుంటారు. ఇదీ అలయ్ బలయ్ స్ఫూర్తి. అంతే కాని కాట్లకుక్కలా కొట్టుకోవడం కోసం కాదు అలబ్ బలయ్ పెట్టింది. వివాదం ముగించేందుకు గరికపాటి వారికి నాగబాబు క్షమాపణలు చెబితే నాగబాబు గౌరవం, దానితో బాటు చిరంజీవి గౌరవం కూడా పెరుగుతుంది.  

Related posts

వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్

Satyam NEWS

ఇళ్ల వద్దనే ఈద్-ఉల్-ఫితర్ ప్రార్థనలు

Satyam NEWS

శ్రీరాం సాగ‌ర్ జలాశయంలో చేప పిల్లల్ని వదిలిన మంత్రులు

Satyam NEWS

1 comment

darlasrinuvasuluachari October 8, 2022 at 10:21 AM

చాలా చక్కగా చెప్పారు సార్

Reply

Leave a Comment