39.2 C
Hyderabad
April 28, 2024 13: 17 PM
Slider ముఖ్యంశాలు

ఆత్మహత్యలు వద్దు… ఆశతో జీవించండి

#vijayanagarampolice

ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లా పోలీసులు, మిమ్స్ సైక్రియాటిస్టు విభాగం ఆధ్వర్యంలో నగరంలో ని కోట జంక్షన్ వద్ద ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఎం.దీపిక ముఖ్య అతిధిగా హాజరై, ర్యాలీని ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక మాట్లాడుతూ ప్రతీ ఏడాది ఆత్మహత్యల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలుగుతుందన్నారు. గతేడాది 250 ఉంటే ఈ ఏడాది ఇప్పటి వరకు ఆ సంఖ్య 150కి చేరుకోవడం బాధాకరమన్నారు. శరీర ఆరోగ్యం బాగులేకుంటే చికిత్స పొందేందుకు వైద్యుడ్ని సంప్రదిస్తాం. అదే విధంగా మానసిక స్థితి బాగులేకుంటే సైక్రియాటిస్టు లేదా సైకాలజిస్టును సంప్రదించడం చాలా అవసరమని, వారిని సంప్రదించడం తప్పు అన్న ఆలోచనలు వద్దన్నారు.

సమస్య ఏదైనా ధైర్యంతో ఎదుర్కొనేందుకు నిపుణుల సలహాలతో ప్రయత్నం చేయాలన్నారు. ఇటువంటి స్థితిలో ఉన్న వ్యక్తులకు కుటుంబ సభ్యులు, స్నేహితులు అండగా ఉండాలన్నారు. చాలామంది వ్యక్తులు తమ సమస్యలను పెద్దదిగా ఊహించుకుంటూ, భయపడుతూ, ఆందోళన చెందుతూ, తీవ్ర ఒత్తిడితో, క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకొంటూ దురదృష్టవసాత్తు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు.

ఆత్మహత్యలకు పాల్పడే విధంగా ఎవరైనా ప్రేరేపిస్తే, వారిపై చట్టపరమైన తప్పవని హెచ్చరించారు. మన స్నేహితులు, కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా మానసిక స్థితి సరిగ్గా లేనట్లుగా గమనిస్తే, వారిని సైకాలజిస్టు లేదా సైక్రియాటిస్టును సంప్రదించే విధంగా చూడాలన్నారు.

ఒక్క సారి ఆలోచించండి….

క్షణికావేశంతో ఎవ్వరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, ఆశతో, ఒక్కసారి ఆలోచన చేయాలన్నారు. ఎవరైనా తమ సమస్యను పోలీసుల దృష్టికి తీసుకొని వస్తే, వారికి సహాయం అందిస్తామని జిల్లా ఎస్పీ ఎం.దీపిక అన్నారు. మిమ్స్ మానసిక వైద్య విభాగం నిపుణులు డా. హేమంత్ మాధవ్ మాట్లాడుతూ మన చుట్టూ చాలామంది మనుషులు ఉంటూ, సహాయం కోసం వారు చెందే ఆక్రందన, ఆవేదనను మనం అర్ధం చేసుకోవాలన్నారు.

వారి ఆవేదన వినినట్లయితే వారిలో ఆత్మన్యూనత భావం తొలగిపోతుందని, ఆత్మహత్యలకు పాల్పడాలన్న ఆలోచనల నుండి దూరమవుతా రన్నారు. సినీ గేయ రచయిత కాకర్ల గాంధీ మాస్టారు ఆత్మహత్యలను నియంత్రించడానికి రచించిన పాటను గానం చేసారు.

అదే విధంగా భారతీయ మానసిక వైద్యుల సంఘం రూపొందించిన పోస్టరును జిల్లా ఎస్పీ ఎం.దీపిక ఆవిష్కరించారు. అనంతరం, అవగాహన ర్యాలీకి హాజరైన వారితో ఆత్మహత్యలకు పాల్పడమని, ఆత్మహత్యలు పాల్పడే ఆలోచనలు ఉన్న వారికి సహాయాన్ని అందిస్తానని వన్ టౌన్  సీఐ డా. బి. వెంకటరావు ప్రమాణం చేయించారు.

ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవ సందర్భంగా మిమ్స్ వైద్య కళాశాల విద్యార్థులకు నిర్వహించిన వ్యాస రచన, వక్తృత్వ పోటీల్లో విజేతలుగా నిలిచిన జి. సాయి సింధూజ, యోగిత శర్మలకు జిల్లా ఎస్పీ ఎం. దీపిక బహుమతులను ప్రధానం చేసారు. నగరంలో ని కోట జంక్షన్ వద్ద అవగాహన ర్యాలీని జిల్లా ఎస్పీ ఎం. దీపిక ప్రారంభించి, ర్యాలీలో స్వయంగా పాల్గొన్నారు.

ర్యాలీ కోట జంక్షన్ నుండి మూడు లాంతర్లు, గంట స్ధంభం వద్ద వన్ టౌన్ పిఎస్ మీదుగా హెడ్ పోస్టాఫీసు వద్ద గల మిమ్స్ అర్బన్ హెల్త్ సెంటరు వద్ద ముగిసింది. పోలీసు బ్యాండ్ తో ప్రజలకు అత్మహత్యలను నివారించాలని, మానసిక స్థితి బాగులేని వారికి సహాయపడాలని, ఆశతో జీవించాలని నినాదాలు చేసారు.

ఈ కార్యక్రమంలో మిమ్స్ మానసిక వైద్య నిపుణులు డా. హేమంత్ మాధవ్, విజయనగరం డిఎస్పీ టి.త్రినాధ్, ట్రాఫిక్ డిఎస్పీ ఎల్.మోహనరావు, ఏఆర్ డిఎస్పీ ఎల్.శేషాద్రి, వన్ టౌన్ సీఐ డా. బి.వెంకటరావు,టూటౌన్ సీఐ సిహెచ్. లక్ష్మణరావు, ఆర్ పి.నాగేశ్వరరావు, మిమ్స్ పిఆర్వో నర్సింహ మూర్తి, పలువురు ఎస్ఐలు, మిమ్స్ విద్యార్థులు, మహిళా సంరక్షణ పోలీసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం జిల్లా

Related posts

వృద్ధ గొర్రెల కాపరి హత్య కేసు ఛేదించిన కొల్లాపూర్ సీఐ

Satyam NEWS

బీసీ నాయకులకు ప్రముఖ దేవస్థానాల పాలక మండలిలో చోటు

Bhavani

మేడే జయప్రదం చేసేందుకు కార్మికులు సిద్ధం కావాలి

Satyam NEWS

Leave a Comment