హైదరాబాద్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి(CEO) గా డా. కూరపాటి కృష్ణయ్య బాధ్యతలు స్వీకరించారు. డా. కూరపాటి కృష్ణయ్య 40 సంవత్సరాల అనుభవజ్ఞడైన ఆర్థోపెడిక్ సర్జన్. ఆయన గతంలో మెడిసిటీ హాస్పిటల్ CEO పని చేశారు.
టోటల్ జాయింట్ రీప్లేస్మెంట్, ప్రైమరీ మరియు రివిజన్ కాంప్లెక్స్ ట్రామా మరియు ఇంటర్ లాకింగ్ నెయిలింగ్ లాంటి అత్యాధునిక శస్త్ర చికిత్సలలో ఎంతో గుర్తింపు పొందిన వైద్యులు డా. కృష్ణయ్య. విలువలతో కూడిన వైద్య విధానాలకు కట్టుబడిన వ్యక్తిగా ఆరోగ్య సేవలలో కరుణ, జాలి, దయలకు ఖచ్చితమైన స్థానం ఉండాలని భావించే డా. కృష్ణయ్య బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇనిస్టిట్యూట్ విలువలలో ఖచ్చితంగా ఇమిడిపోయే వ్యక్తి. నూతన CEO గా బాధ్యతలు స్వీకరించిన డా. కృష్ణయ్య ని చైర్మన్ నందమూరి బాలకృష్ణ నేతృత్వంలోని ట్రస్టు బోర్డు సభ్యులు ఆహ్వానించారు.
ఆరోగ్య సేవల విభాగంలో అత్యున్నత శ్రేణి నాణ్యతా ప్రమాణాలను స్థాపించడంలో ఆయన ట్రాక్ రికార్డ్ ను గుర్తు చేసుకున్నారు. ఎందరో వైద్య విద్యార్థులకు శిక్షణ అందించడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పేరు గడించిన సంస్థలైన రాయల్ కాలేజీ ఆఫ్ సర్జన్స్, ఎడిన్ బర్గ్ మరియు యూనివర్శిటీ ఆప్ లివర్ పూల్ ల నుండి డా. కె కృష్ణయ్య ప్రశంసలు అందుకొన్నారు.
ఎంతో ఖచ్చితత్వంతో కూడిన శస్త్ర చికిత్స నిపుణునిగా డా. కృష్ణయ్య ఆర్థోపెడిక్స్ విభాగంలో అత్యున్నత శ్రేణి ప్రమాణాలను స్థాపించడమే కాకుండా ఆంధ్ర ప్రదేశ్ లో అత్యాధునిక శస్త్ర చికిత్స విధానాలను అవలంబించడంలో మార్గదర్శకత్వం వహించారు. వైద్య చికిత్సలలో నైపుణ్యం కలిగి ఉండడమే కాకుండా వైద్య పరిశోధనా రంగానికి కూడా డా. కృష్ణయ్య ఎంతో సేవలు అందించారు.
KIMS ఫౌండేషన్ మరియు రీసెర్చి సెంటర్ (KFRC) డైరెక్టర్ గా ICMR అనుమతి పొందిన స్టెమ్ సెల్ రీసెర్చి కేంద్రాన్ని నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించారు. CCMB, యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ మరియు IIT, హైదరాబాద్ లాంటి ప్రతిష్టాత్మకమైన పరిశోధనా సంస్థలతో కలసి పరిశోధన మరియు క్లినికల్ విషయాలలో కలసి పని చేశారు. సెరెబ్రల్ పాల్సీ (మస్తిష్క పక్షవాతం) తో భాద పడే చిన్నారులకు 30 సంవత్సరాలుగా ఉచిత వైద్య సేవలును అందిస్తూ సమాజ సేవ పట్ల తనకున్న నిబద్ధతను డా. కృష్ణయ్య చాటుకొన్నారు.
ఉగాది విశిష్ట పురస్కారం అవార్డు, స్వర్ణ కంకణం అవార్డు మరియు ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం వారి నుండి ఆర్థోపెడిక్ విభాగంలో అందించిన సేవలకు గాను ప్రత్యేక అవార్డును డా. కృష్ణయ్య అందుకొన్నారు.
ఇలా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ కు నూతన CEO గా చేరడం పట్ల ఎంతో ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ క్యాన్సర్ చికిత్సా విభాగంతో ఎంతో పేరెన్నిక కలిగిన సంస్థలో చేరడాన్ని గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. ఎంతో నైపుణ్యతతో కూడిన హాస్పిటల్ సిబ్బందితో కలసి పని చేయడం తో పాటూ గత వైభవాన్ని కొనసాగిస్తూ రోగులకు అందించే సేవలు, అత్యాధునిక పరిశోధన లలో మరింత ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తానని తెలిపారు.
ఇలా ఎంతో అనుభవజ్ఞుడైన డా. కూరపాటి కృష్ణయ్య నియామకం బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ లో సరికొత్త అధ్యాయానికి స్వీకారం చుట్టనుంది. నూతన CEO బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో బసవతారకం ఇండో అమరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ ట్రస్టు భోర్డు సభ్యులు జె యస్ ఆర్ ప్రసాద్, యం భరత్, డా. నోరి దత్తాత్రేయ, డా. పోలవరపు రాఘవరాపు లతో హాస్పిటల్ కు చెందిన మెడికల్ మరియు నాన్ మెడికల్ HODs పాల్గొన్నారు.