39.2 C
Hyderabad
April 28, 2024 13: 10 PM
Slider కడప

పులివెందులలో జగన్ కు ఎదురు దెబ్బ?

#jagan

పులివెందులలో ముఖ్యమంత్రి జగన్ ఈ సారి గెలుస్తారా? ఈ ప్రశ్నకు పలు సందేహాలే సమాధానాలుగా వస్తున్నాయి. వై ఎస్ రాజశేఖరరెడ్డి సమయం నుంచి కూడా చాలా కాలంగా పులివెందులకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా వై ఎస్ వివేకానందరెడ్డి చూసేవారు. అయితే ఇప్పుడు వై ఎస్ వివేకానందరెడ్డి లేరు. ఆయనను కొందరు దారుణంగా గొడ్డలితో హతమార్చి అడ్డుతొలగించుకున్నారు.

వివేకా మర్డర్ ను కేవలం రాజకీయం కోసమే చేశారని గతంలో వై ఎస్ షర్మిల సీబీఐకి కూడా తెలిపారు. సీబీఐ కూడా ఆ కోణంలోనే కేసు దర్యాప్తు చేసి అరెస్టులు కొనసాగించింది. వివేకానందరెడ్డి లేని కారణంగా పులివెందులలో జగన్ కు ప్రజలకు మధ్య గ్యాప్ విపరీతంగా పెరిగిపోయింది. కడప ఎంపి అవినాష్ రెడ్డి లేదా ఆయన తండ్రి భాస్కరరెడ్డి వివేకా లేని లోటు తీర్చలేకపోతున్నారు. అంతే కాకుండా జగన్ కూడా పులివెందుల రాజకీయాలపై శ్రద్ధ చూపడం లేదు. ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ఆయన నాలుగు లేదా ఐదు సార్లు మాత్రమే పులివెందులలో పర్యటించారు. అప్పుడు కూడా అందరిని కలవలేదు. ఈ నేపథ్యంలోనే జగన్ ఈ సారి పులివెందులలో మళ్లీ గెలుస్తారా అనే ప్రశ్న తలెత్తుతున్నది.

పులివెందులలో టీడీపీ బలోపేతమవుతుండటంతో వైసీపీ కంచుకోటకు మెల్లగా బీటలు పడుతున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన జగన్‌ నియోజకవర్గంలో పట్టు కోల్పోకుండా చూసుకోవడానికి జాగ్రత్త పడాల్సిన పరిస్థితులు తలెత్తాయి. పులివెందుల నియోజకవర్గంలో మండలానికి పదిమంది చొప్పున ప్రభావం చూపగలిగిన వైసీపీ నేతలు, గ్రామానికి ఐదుగురు చొప్పున క్రియాశీల కార్యకర్తలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలతో జగన్ తన పులివెందుల పర్యటన సందర్భంగా భేటీ ఏర్పాటు చేశారు.

సొంత మండలమైన సింహాద్రిపురంతోపాటు నాలుగు మండలాలు ఒక రోజు, పులివెందులతో పాటు మూడు మండలాల ముఖ్యులతో సమావేశానికి మరో రోజు ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రతి మండలం నుంచి 250నుంచి 300మందికి ఇడుపులపాయలో ప్రవేశం కల్పిస్తూ జాబితా రూపొందించారు.

దీనికి సీఎం కార్యాలయం పాస్ లు జారీ చేయడాన్నే స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ ఎమ్మెల్యేని తాము కలవాలంటే తాము పాస్ తీసుకోవాలా అంటూ జగన్ ను నిలదీశారు. సమావేశం ప్రారంభంకాగానే సీఎం జగన్‌ ఏదో చెప్పబోగా సింహాద్రిపురం మండలానికి చెందిన కొందరు లేచి ‘పదేండ్ల నుంచి పార్టీ జెండా మోస్తున్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు పడ్డాం. అధికారం వచ్చి ఐదేళ్లు అవుతున్నా మాకు ఒరిగిందేమీ లేదు’ అని అనడంతో జగన్‌తోపాటు అక్కడున్న ఇతర నేతలు ఉలిక్కి పడ్డారు. వెంటనే తేరుకున్న జగన్‌.. ‘ఏందన్నా కొట్లాటకు వచ్చినారా?’ అని అసహనంతో ప్రశ్నించారు. అయినా వాళ్లు వెనక్కి తగ్గలేదు.

‘మా బాధలు చెప్పడానికే వచ్చాం. ఎన్నికల్లో లక్షలు ఖర్చు చేశాం. పులివెందులలో అభివృద్ధి పనులు చేసి కోట్లలో బిల్లుల కోసం ఎదురు చూస్తున్నాం. గ్రామాల్లో ఒక్క పని జరగడం లేదు. రేపు ఎన్నికల్లో ప్రజల దగ్గరికి వెళ్లి ఏమని ఓట్లు అడగాలి? ఎక్కడి నుంచి తెచ్చి ఖర్చు పెట్టాలి? అని జగన్ ను ప్రశ్నించారు. సమావేశం నుంచి వైసీపీ ముఖ్య కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో బయటికి వచ్చారు. ‘మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణా రెడ్డి, నెల్లూరులో కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, ఒంగోలులో బాలినేని వాసుకూడా ఆయన్నే నమ్మారు. పదండి పోదాం. వై ఎస్ రాజశేఖర్‌ రెడ్డితోనే మనం రాజకీయాలు వదిలేయాల్సింది’ అంటూ తీవ్రంగా వ్యాఖ్యానిస్తూ వారు వెళ్లిపోయారు.

ఈ సంఘటనతో జగన్ కు ఒక్క సారిగా మతిపోయినంత పని అయింది. బాబాయి మర్డర్, ఇటీవల తెలుగుదేశం పార్టీ నాయకుడు బీటెక్ రవి అక్రమ అరెస్టు కారణంగా జగన్ ప్రతిష్ట మొత్తం ఉమ్మడి కడప జిల్లాతో బాటు పులివెందుల నియోజకవర్గంలో ఘోరంగా దెబ్బతిన్నది. వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు, ఆయన కుమార్తె సునీత న్యాయ పోరాటం ప్రజల్లో బాగా చర్చనీయాంశం అయ్యాయి. ఇది వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నది. దానికితోడు తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రచారం చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీకి ప్రజాదరణ పెరుగుతుండటంతో బాటు జగన్ కు తీవ్ర వ్యతిరేకత కనిపించడం రాబోయే ఎన్నికల్లో పులివెందులలో ప్రభావం చూపిస్తుందనడంలో సందేహం లేదు.

కొద్ది రోజుల కిందట తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పులివెందులలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తే లక్షలాది మంది జనం హాజరయ్యారు. సభకు హాజరు కావడమే కాకుండా చంద్రబాబు మాటలు శ్రద్ధగా విన్నారు. చంద్రబాబు ప్రసంగిస్తుండగా బాబాయి మర్డర్ కేసు గురించి మాట్లాడాల్సిందిగా స్థానిక ప్రజలు వత్తిడి తీసుకువచ్చారు. స్థానిక ప్రజల కోరిక మేరకు చంద్రబాబునాయుడు వై ఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసు గురించి ప్రస్తావించారు.

చంద్రబాబు వివేకా మర్డర్ కేసు గురించి చెబుతుంటే ప్రజల నుంచి విపరీతంగా స్పందన వచ్చింది. ఆ నాటి నుంచే పులివెందుల ప్రజల్లో మార్పు వస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. వివేకా హత్య ఈ సారి జగన్ గెలుపుపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నది. గత ఎన్నికల్లో జగన్ కు సానుభూతి కురిపించిన వివేకా మర్డర్ విషయం ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా మారబోతున్నది.

Related posts

గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లకు ముస్తాబైన ప‌రేడ్ గ్రౌండ్స్

Satyam NEWS

శ్రీ వాణి ట్రస్ట్ టిక్కెట్ పై ఇద్దరిని దర్శనానికి అనుమతించండి

Satyam NEWS

అఖిల భారత అందాల శ్రీమతి పోటీలలో రన్నర్ గా ప్రియాంక భరత్

Satyam NEWS

Leave a Comment