హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితం టీఆర్ఎస్ కు అనుకూలంగా వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుండటంతో ఇక ఆర్టీసీ సమ్మెకు పూర్తిగా గ్రహణం పట్టినట్లుగానే భావించాల్సి ఉంటుంది. ఆర్టీసీ కార్మికులతో ఎట్టిపరిస్థితుల్లో చర్చలు జరిపేది లేదని భీష్మించుకుని కూర్చున్న ముఖ్యమంత్రి కేసీఆర్, హుజూర్ నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ సీటును కూడా గెలుచుకోవడంతో ఇక తెలంగాణలో తనకు ఎదురేలేదన్నట్లు ప్రవర్తించడం ఖాయం. దీని కారణంగా ప్రస్తుత్తం ఆర్టీసీ సమ్మెపై దెబ్బ పడబోతున్నట్లుగా అనిపిస్తున్నది.
హుజూర్ నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తే ప్రతిపక్షం గెలిస్తే కొంచెమైనా కేసీఆర్ మెత్తబడి ఉండేవారు. ఆ ప్రభావం ఆర్టీసీ సమ్మెపై సానుకూలంగా ఉండి ఉండేది. తాజాగా ఇప్పుడు అలా జరిగే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకా (ఉదయం 10 గంటలకు) కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న మండలాల రౌండ్లు ఇంకా ప్రారంభం కాలేదు కానీ ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డికి 15 నుంచి 17 వేల ఓట్ల ఆధిక్యత ఉన్నందున దాన్ని కవర్ చేయడం సాధ్యం కాకపోవచ్చు. అందుకే హుజూర్ నగర్ అసెంబ్లీ కౌంటింగ్ కేంద్రాల నుంచి కాంగ్రెస్ కౌంటింగ్ ఏజెంట్లు నిష్క్రమిస్తున్నారు.
హుజూర్ నగర్ ఉప ఎన్నిక రాజకీయాలకే పరిమితం కాకుండా ఆర్టీసీ సమ్మెతో ముందు నుంచి ముడిపడిపోయింది. ఆర్టీసీ కార్మికులు కూడా తొలి రోజు నుంచి తమ సమ్మె తాము చేయకుండా రాజకీయ పార్టీల చుట్టూ తిరగడం మొదలు పెట్టారు. కాంగ్రెస్, బిజెపిలు ఆర్టీసీ సమ్మెను తమ ఎజెండాలో వేసుకుని మరీ పోరాటం జరిపాయి. ఎప్పుడైతే ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులకు కాంగ్రెస్, బిజెపిలు మద్దతు తెలిపారో అప్పుడే ఈ సమ్మెకు రాజకీయ రంగు వచ్చేసింది. దీన్ని కొనసాగించేందుకు హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికను వేదికగా చేసుకొందామని కాంగ్రెస్ ప్లాన్ వేసుకున్నది.
దాంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా హుజూర్ నగర్ ఉప ఎన్నిక కోసం ఆర్టీసీ సమ్మెతో కాంగ్రెస్ పార్టీ కలిసి పని చేస్తున్నదనే నిర్ణయానికి వచ్చారు. ఇక బిజెపి అత్యాశకు పోయి, ఆర్టీసీ సమ్మె ద్వారా రాజకీయ లబ్ది పొందాలని శతవిధాలా ప్రయత్నం చేసింది. ఈ విషయాలను సత్యం న్యూస్ ముందే చెప్పింది. ఆర్టీసీ సమ్మెను రాజకీయ పార్టీలతో ముడిపెట్టడం ఆర్టీసీ కార్మిక సంఘాలు చేసిన మొదటి తప్పు.
హుజూర్ నగర్ ఉప ఎన్నికతో ముడిపెట్టుకోవడం (పైకి చెప్పకపోయినా) రెండో తప్పు. కాంగ్రెస్ బిజెపిలు కూడా రాజకీయ అత్యాశకు పోయి కార్మికుల సమ్మెలో జోక్యం చేసుకోవడం వారి ప్రధమ తప్పు. సమ్మెను ఉపయోగించుకుని రాష్ట్రంలో బలపడదామని చూడడం రాజకీయ పార్టీల రెండో తప్పు. ఇలా వరుసగా తప్పులు చేసిన ఆర్టీసీ కార్మికులు, కాంగ్రెస్, బిజెపి పక్షాలూ హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం వచ్చిన తర్వాత ఎవరికి వారు సమ్మె నుంచి లేదా సమ్మెకు ఇచ్చే మద్దతు నుంచి ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితులు రావచ్చు. హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం ఇంత పని చేస్తుందని చాలా మంది అనుకోకపోయి ఉండవచ్చు.