29.7 C
Hyderabad
May 1, 2024 03: 45 AM
Slider విజయనగరం

అనధికార నిర్మాణాలను ఉపేక్షింది లేదు..

municipality

విజయనగరం మున్సిపల్ కార్పోరేషన్ లో అనధికార నిర్మాణాలపై క్షేత్ర స్థాయిలో సచివాలయం వ్యవస్థ ద్వారా పరిశీలిస్తున్నామని వీఎంసీ కమీషనర్ శ్రీరాములనాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు నగరంలో ని వీఎంసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆన మాట్లాడారు. ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దే ప్రక్రియలో  ప్రజలందరూ సహకారం అందివ్వాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఆర్ శ్రీ రాములు నాయుడు కోరారు. .

అందరి సహకారంతో నగరాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా దశలవారీగా ప్లాస్టిక్ వినియోగానికి స్వస్తి చెప్పే విధంగా ప్రయత్నిస్తున్నామన్నారు. ఇప్పటికే పర్యావరణానికి ప్లాస్టిక్ వల్ల కలిగే దుష్ప్రభావాలపై విస్తృత ప్రచారం చేపట్టామన్నారు.

ఇటు ప్రజలు, అటు వర్తకులలో పూర్తి చైతన్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ ప్రక్రియలో ప్రజల నుండి వచ్చే నూతన ఆవిష్కరణలను అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. భవిష్యత్తు తరాల కోసం ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించేందుకు కృషి చేయాల్సిన అవసరం అందరిపైనా ఉందన్నారు.

గుడ్డ సంచులను వినియోగించాలని చెప్పారు. ఇందుకోసం మెప్మా ఆధ్వర్యంలో తయారుచేసే గుడ్డ సంచులను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 75 మైక్రాన్ల కన్నా తక్కువ మందం గల ప్లాస్టిక్ వస్తువులను నిషేధించడమైనదని వెల్లడించారు.

నగరంలో పారిశుద్ధ్య మెరుగుదలకు అనేక చర్యలు చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక పారిశుధ్య బృందాలను ఏర్పాటు చేసి కాలువలలో పూడికలను తొలగించేందుకు బృహత్తర కార్యాచరణ రూపొందించి, అమలు చేస్తున్నామన్నారు. దీని ద్వారా 370 కిలోమీటర్ల చిన్న కాలువలు, 19 కిలోమీటర్ల ప్రధాన కాలువలు ప్రక్షాళనకు కృషి చేస్తున్నామన్నారు.

వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అంట రోగాలు, జ్వరాలు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. దోమలు వృద్ధి కేంద్రాలను క్షేత్రస్థాయిలో ఇప్పటికే గుర్తించామని ఆయా ప్రదేశాలలో దోమల నియంత్రణ చర్యలు చేపడుతున్నామన్నారు. ఏంటీ లార్వా ఆపరేషన్లను ముమ్మరం చేస్తున్నామన్నారు. ప్రజలు కూడా వారానికి ఒక రోజు డ్రైడేను పాటించాలన్నారు. చెరువులు, కుంటలలో ఆయిల్ బాల్స్ వేసి దోమలు వృద్ధి చెందకుండా చర్యలు చేపడుతున్నామన్నారు.

దోమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఫాగింగ్  చేపట్టే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇందుకోసం 40 స్పేయర్లను వినియోగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసామన్నారు. నగరంలో  298 గుంతలు ఉన్నట్లుగా గుర్తించామన్నారు. వాటిని 39 లక్షల రూపాయలతో యుద్ధప్రాతిపదికన పూడ్చామని చెప్పారు.

కొత్తగా గుర్తించిన గుంతలను కూడా ఈ నెల 15వ తేదీలోగా పూడ్చేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వీధివిక్రయదారులకు క్రమ పద్ధతిలో వ్యాపారాలు చేసుకునేందుకు అవకాశం కల్పించామన్నారు. ట్రాఫిక్ పట్ల అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.

ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆస్తి పన్ను వసూళ్ళలో గణనీయమైన లక్ష్యాన్ని సాధించామని చెప్పారు. 24 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగిందన్నారు. కొత్తగా 6వేల గృహ సముదాయాలకు పన్నులు వేయడం జరిగిందన్నారు.

అదేవిధంగా కుళాయి పన్ను వసూలు ను ముమ్మరం చేస్తామన్నారు. అనధికార కుళాయి కనెక్షన్లను గుర్తించడం, వినియోగంలో ఉన్న కనెక్షన్లకు పన్నులు వసూలు చేయడం ప్రాధాన్యతాంశాలుగా తీసుకున్నామన్నారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్)అమలు లో భాగంగా నగరంలో 53 చెత్త తరలించే వాహనాల నిర్వహణకు గాను మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు.

కేవలం చెత్త తరలించేందుకే యూజర్ చార్జీలను వసూలు చేస్తున్నామన్న విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. సుమారు 3.25 లక్షల జనాభా ఉన్న నగరంలో కేవలం 600 మంది పారిశుద్ధ్య కార్మికులు మాత్రమే పరిశుభ్రతా చర్యలు చేపడుతున్నారన్న విషయాన్ని గుర్తించాలన్నారు.

రహదారుల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామన్నారు. ఈమధ్య 12 కోట్ల రూపాయలతో 14 కిలోమీటర్ల కాలువలు, 7.5 కిలోమీటర్ల రహదారులను నిర్మించామన్నారు. మరో 18 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ప్రజా ఫిర్యాదులను స్వీకరించేందుకు ఇక నుండి నగరపాలక సంస్థ కార్యాలయం నందు ప్రతి సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

అనధికార భవన నిర్మాణాలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. తామిచ్చిన ప్లాన్ ప్రకారం భవన నిర్మాణాలు జరుగుతున్నాయా లేదా అన్నది క్షేత్రస్థాయిలో సచివాలయ వ్యవస్థ ద్వారా పరిశీలిస్తున్నామని చెప్పారు. అందరి సహాయ సహకారాలతో నగరాన్ని అభివృద్ధి దిశగా పయనింపజేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో సహాయ కమిషనర్ ప్రసాదరావు, ఏసీపీ అమ్మాజీ రావు, ఈఈ డాక్టర్ కిల్లాన దిలీప్, ప్రజారోగ్య అధికారి డాక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు.

Related posts

బండి సంజయ్ ఎల్ఐసీ ప్రైవేటీకరణ చేయద్దని దీక్ష చేయగలవా?

Satyam NEWS

భగ్గుమన్న భాజపా శ్రేణులు: దిష్టిబొమ్మల దహనం

Satyam NEWS

పవర్ వార్: కేంద్రంలో ఢీ కొడుతున్న జగన్ ప్రభుత్వం

Satyam NEWS