Slider ప్రత్యేకం

2025 నాటికి క్షయ వ్యాధి నిర్మూల‌నే ల‌క్ష్యం

TBeradication

టిబి నిర్మూలనలో మూడు జిల్లాల‌కు జాతీయ‌ అవార్డులు

తెలంగాణలో 2025 నాటికి పూర్తి స్థాయిలో క్ష‌య వ్యాధి (టిబి) నిర్మూల‌నే లక్ష్యంగా నిర్ధేశించుకుని టిబి ప‌రీక్ష‌లు, వైద్యం వేగ‌వంతం చేస్తున్న‌ట్లు తెలంగాణ టిబి విభాగం జాయింట్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎ. రాజేశం వెల్ల‌డించారు. ప్ర‌తి ఒక ల‌క్ష జ‌నాభాకు ఏడాదికి 198 టిబి  కేసులు నమోదు అవుతుండ‌గా ఈ సంఖ్య‌ను 2025 నాటికి 43 కి త‌గ్గించ‌డమే లక్ష్యంగా కృషి చేస్తున్న‌ట్లు చెప్పారు.

ఇందులో భాగంగా టిబి ప‌రీక్ష‌ల సంఖ్య భారీగా పెంచ‌డంతోపాటు వైద్య స‌హాయం త‌క్ష‌ణ‌మే అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు తెలిపారు. దీని కోసం ప్ర‌భుత్వంతోపాటు ప్రైవేటు, కార్పొరేటు, ఎన్‌జిఒ, మీడియాతోపాటు టిబి నుంచి కోలుకున్న‌ టిబి ఛాంపియ‌న్‌ లను భాగ‌స్వామ్యం చేస్తున్నట్లు ప్ర‌క‌టించారు. ఈ నెల 24న అంత‌ర్జాతీయ టిబి దినోత్స‌వం పుర‌స్క‌రించుకొని ప‌త్రికా స‌మాచార కార్యాల‌యం (పిఐబి) భాగ‌స్వామ్యంతో తెలంగాణ టిబి విభాగం ఆధ్వ‌ర్యంలో మంగ‌ళ‌వారం ‘టిబి నిర్మూల‌న‌, జాగ్ర‌త్త‌లు – మీడియా పాత్ర’ అనే అంశంపై వ‌ర్క్‌షాప్ నిర్వ‌హించారు.

పిఐబి డైరెక్ట‌ర్ శృతిపాటిల్ అధ్య‌క్ష‌త వ‌హించిన ఈ కార్య‌క్ర‌మంలో డాక్ట‌ర్ ఎ. రాజేశం తోపాటు తెలంగాణ టిబి కేంద్రం సాంక్ర‌మిక వ్యాధుల నిపుణులు డాక్ట‌ర్ సి.సుమ‌ల‌త పాల్గొన్నారు.  నూత‌నంగా అందుబాటులోకి వ‌చ్చిన కాట్రిడ్జ్ బేస్డ్ న్యూక్లియ‌క్ యాసిడ్ యాంప్లిఫికేష‌న్ టెస్టింగ్‌ (CBNAAT) యంత్రాల‌ను తెలంగాణ‌లో నారాయ‌ణ‌పేట జిల్లా మినహా అన్ని జిల్లా కేంద్రాల‌లో అందుబాటులోకి తెచ్చిన‌ట్లు వెల్ల‌డించారు.

హైద‌రాబాద్‌లో CBNAAT మెషీన్లు 8 ఏర్పాటుచేసిన‌ట్లు తెలిపారు. ఈ ప‌రీక్ష‌లో గంట‌లోనే ప‌రీక్ష ఫ‌లితంతోపాటు టిబి తీవ్ర‌త స్థాయిని గుర్తించవ‌చ్చ‌ని తెలిపారు. వీటితోపాటు ప్ర‌తి రెవెన్యూ డివిజ‌న్ ప‌రిధిలో ట్రూనాట్ (TrueNAAT) ప‌రీక్ష యంత్రాల‌ను ఇప్ప‌టికే 90 ఏర్పాటుచేయ‌గా, వ‌చ్చే మే నెలాఖ‌రు నాటికి మ‌రో 50 ట్రూనాట్ ప‌రీక్ష ప‌రిక‌రాలు ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

హైద‌రాబాద్‌ లో ఉన్న ప్ర‌భుత్వ ఛాతీ ఆసుప‌త్రిని అపెక్స్ టిబి ఆసుప‌త్రిగా గుర్తించ‌డంతోపాటు మ‌ల్టీ డ్ర‌గ్ థెర‌పీ, డ్ర‌గ్ రెసిస్టెన్స్ టిబి చికిత్స పొందేవారి కోసం ప్ర‌త్యేక వార్డులు ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. టిబి వ్యాధి గ్ర‌స్తులు ఎవ‌రైనా స‌హాయం కోసం 1800 116666 హెల్ప్ లైన్ నెంబ‌రులో సంప్ర‌దించ‌వ‌చ్చ‌ని ప్ర‌క‌టించారు.

ప్రైవేటురంగంలోనూ ఉచిత ప‌రీక్ష‌, వైద్యం

శాశ్వ‌తంగా టిబి నిర్మూల‌న ల‌క్ష్యంగా ప్ర‌భుత్వ రంగంతోపాటు ఇక‌పై ప్రైవేటు రంగంలోనూ ఉచితంగా అన్ని ర‌కాల వైద్య ప‌రీక్ష‌లతోపాటు వైద్యం కూడా అందిస్తున్న‌ట్లు డాక్ట‌ర్ రాజేశం తెలిపారు. ఈ మేర‌కు అన్ని కార్పొరేటు, ప్రైవేటు ఆసుప‌త్రుల‌తో క‌లిసి ప‌ని చేస్తున్న‌ట్లు చెప్పారు. 2022 లో 80 వేల కేసుల‌ను గుర్తించాల‌ని ల‌క్ష్యంగా నిర్దేశించుకున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. 

జాతీయ స్థాయిలో టిబి నిర్మూల‌న‌లో ముందున్న నిజామాబాద్‌ జిల్లాకు ఈ నెల 24న న్యూఢిల్లీలో జ‌రుగనున్న ప్ర‌పంచ టిబి దినోత్స‌వ కార్య‌క్ర‌మంలో కేంద్ర ప్ర‌భుత్వం సిల్వ‌ర్ మెడ‌ల్ అంద‌జేయ‌నున్న‌ట్లు తెలిపారు. భ‌ద్రాద్రి కొత్త‌గూడెం, ఖ‌మ్మం జిల్లాల‌కు కాంస్య ప‌త‌కం ద‌క్క‌నుంద‌ని వెల్ల‌డించారు.

తెలంగాణ‌లో ప్ర‌త్యేకంగా టిబి నుంచి కోలుకున్నవారిని టిబి ఛాంపియ‌న్స్‌ గా గుర్తించి శిక్ష‌ణ ఇచ్చి, వారి ద్వారా ప్ర‌జ‌ల‌లో అవ‌గాహ‌న క‌ల్పిస్తున్న‌ట్లు డాక్ట‌ర్ రాజేశం తెలిపారు. తొలుత 58 మందికి శిక్ష‌ణ ఇవ్వ‌గా కేంద్ర ప్ర‌భుత్వం దేశ వ్యాప్తంగా ఈ విధానాన్ని అమ‌ల్లోకి తెస్తోంద‌న్నారు. ప్ర‌స్తుతం 600 మందికి రాష్ట్రవ్యాప్తంగా టిబి ఛాంపియ‌న్స్ ప్ర‌త్యేక మొబైల్ యాప్ దీక్ష ద్వారా ఆన్‌ లైన్‌ లో శిక్ష‌ణ పూర్తి చేసిన‌ట్లు తెలిపారు.

టిబి వ్యాధిబారిన ప‌డినవారికి కేంద్ర ప్ర‌భుత్వం ‘‘నిక్ష‌య్ పోష‌ణ యోజ‌న’’ కింద ప్ర‌తి నెల రూ.500 చొప్పున వ్యాధి నుంచి బ‌య‌డ‌ప‌డే వ‌ర‌కు ఆర్థిక స‌హాయం అందిస్తున్న‌ట్లు డాక్ట‌ర్ రాజేశం తెలిపారు. టిబి తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండి మ‌ల్టి డ్ర‌గ్ థెర‌పీ తీసుకునేవారికి రూ.1200 ర‌వాణా ఛార్జీలు ఇవ్వనున్న‌ట్లు తెలిపారు. గిరిజ‌న ప్రాంతాల‌తో వీటికి అద‌నంగా మ‌రో రూ.750 అందిస్తున్న‌ట్లు చెప్పారు. టిబి నిర్మూల‌న‌లో మీడియా, ప‌త్రిక‌లు కూడా భాగ‌స్వామ్యం కావాల‌ని పిఐబి డైరెక్ట‌ర్ శృతిపాటిల్ ఈ సంద‌ర్భంగా పిలుపునిచ్చారు.

ఈ స‌ద‌స్సులో పాల్గొన్న టిబి ఛాంపియ‌న్స్ షేక్ ఫ‌ర్హా, త‌ర‌ణం బేగం, వినోద్ త‌దిత‌రులు త‌మ అనుభ‌వాలు తెలియజేస్తూ… టిబి గుర్తించిన త‌ర్వాత వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో క్ర‌మం తప్ప‌కుండా మందులు వాడ‌టంతోపాటు, పౌష్టికాహారం తీసుకోవాల‌ని సూచించారు. టిబి బారిన ప‌డిన వారికి కుటుంబ స‌భ్యులు పూర్తి మ‌ద్ధుతు ఇవ్వ‌డంతోపాటు స‌మాజం కూడా వారిప‌ట్ల ఎటువంటి వివ‌క్ష చూప‌కూడద‌ని వారు తెలిపారు.

Related posts

కూరగాయలు పంచిన అమెరికా వైసీపీ డాక్టర్ల బృందం

Satyam NEWS

మిర్చి పంటల్లో చీడపీడల వ్యాప్తి ఎదుర్కోవడానికి వ్యూహాలు

Satyam NEWS

కేటీఆర్…మళ్ళీ రాళ్లేయడాని కే వస్తున్నారా…?

Satyam NEWS

Leave a Comment