అమరావతి సహా రాష్ట్రంలోని పట్టణాల పురోగతిపై ఆరువారాల్లో నివేదిక సమర్పించాలని నూతనంగా ఏర్పాటు చేసిన కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. కమిటీ కన్వినర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీఎస్ రావును నియమించింది. సభ్యులుగా ప్రొఫెసర్ మహవీర్, డాక్టర్ అంజలీమోహన్, డాక్టర్ శివానందరెడ్డి, ప్రొఫెసర్ కేటీ రవిచంద్రన్, ప్రొఫెసర్ అరుణాచలం పని చేయనున్నారు. రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు రాష్ట్ర సమగ్ర పురోగతి కోసం ఈ నిపుణుల కమిటీ పని చేయనుంది. పర్యావరణం, వరదల నిర్వహణలో నిపుణుడైన వ్యక్తికి ఈ కమిటీలో అవకాశం కల్పించనున్నారు. కమిటీ సభ్యుల జీతభత్యాలకు సంబంధించిన వివరాలను తదుపరి ఉత్తర్వుల్లో పేర్కొననున్నారు.
అమరావతిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న తరుణంలో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కమిటీ నివేదికను బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉండటంతో.. మరో వారాల్లో అమరావతి భవితవ్యం తేలే అవకాశం ఉందని భావిస్తున్నారు.