42.2 C
Hyderabad
April 30, 2024 18: 09 PM
Slider సంపాదకీయం

Form house case: టీఆర్ఎస్ పార్టీ ఇంత బలహీనంగా ఉందా?

#formhouse

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసిందా? లేదా? అనే విషయం పక్కన పెడితే ‘‘ఫామ్ హౌస్ కేసు’’ కు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రం చాలానే ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు అనధికారికంగా విడుదల చేస్తున్న ఆడియో లీక్ లు పరిశీలిస్తే టీఆర్ఎస్ పార్టీ ఎంత డొల్లగా ఉందో అర్ధం అవుతున్నది. నానాజాతి సమితి లాగా సిద్ధాంతాలతో, తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేకుండా అన్ని పార్టీలకు చెందిన అవకాశవాదుల్ని పార్టీలో చేర్చుకుంటే ఎలా ఉంటుందో కూడా ఆ ఆడియో లీక్ లు పరిశీలిస్తే అనిపిస్తున్నది.

టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసే ప్రయత్నమే చేసిందనుకుందాం. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎలా అమ్ముడు పోతారు? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఎనిమిదేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న టీఆర్ఎస్ ఇంత డొల్లతనంతో ఉంటుందా? అందుకే సీఎం కేసీఆర్ ఇప్పటికైనా తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో మరిన్ని పరిణామాలు జరగక తప్పదు.

బీజేపీ కాకపోతే మరో పార్టీ…. లేదా టీఆర్ఎస్ లోనే మరో నాయకుడు…. ఈ డొల్లతనాన్ని అవకాశంగా మలచుకుంటే కేసీఆర్ కు కష్టాలు తప్పవు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేస్తున్నదని ప్రజల్లో సానుభూతి పొందేందుకు డ్రామా ఆడి వుంటే అది వేరే సంగతి. కానీ ఆడియో టేపులు చూస్తే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ‘‘సీరియస్’’ గానే పార్టీ మారేందుకు అంగీకరించి బేరసారాలు సాగించినట్లుగా అర్ధం వస్తున్నది. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డబ్బులు దొరకకపోవడం వల్ల కేసు నిలబడుతుందో లేదో ఇప్పుడే చెప్పలేం కానీ… టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం కచ్చితంగా డబ్బులు తీసుకోవడానికే ఫామ్ హౌస్ కు వెళ్లినట్లుగా భావించాల్సి వస్తుంది.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే తమకు సమాచారం ఇచ్చారని పోలీసులు చెబుతున్న విషయం కచ్చితంగా వాస్తవం అయ్యే అవకాశం లేదు. ఆ ఎమ్మెల్యేలే సమాచారం ఇచ్చి ఉంటే పోలీసులు తెరవెనుక ఉండి తతంగం అంతా వీడియో రికార్డు చేసి మరీ తెచ్చుకునే వాళ్లు కాదు. పోలీసులు ఆ వీడియో రికార్డులను ముందుగా ఎవరికి ఇచ్చిఉంటారో ఊహించడం పెద్ద కష్టమైన పనేం కాదు. ఆ వీడియో టేపులు, ఈ ఆడియో టేపులు పూర్తిగా పరిశీలించి సదరు ఎమ్మెల్యేలకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఉంటారు.

లేకపోతే ఫామ్ హౌస్ నుంచి నేరుగా ప్రగతి భవన్ కు ఆ ఎమ్మెల్యేలను తరలించి ఉండేవారే కాదు. ఆ నలుగురు ఎమ్మెల్యేల సెల్ ఫోన్ లు పోలీసులు స్వాధీనం చేసుకోలేదు. అవి చేరాల్సిన చోటికి సేఫ్ గా చేరేలాగా చర్యలు తీసుకున్నారు. ఎక్కడకు చేరాలో అక్కడకు ఆ సెల్ ఫోన్లు చేరిన తర్వాతే ఆడియో క్లిప్ లు బయటకు వచ్చాయి. ఇదంతా చూస్తుంటేనే ‘‘ఫామ్ హౌస్ కేసు’’ టీఆర్ఎస్ ను పార్టీ పరంగా ఎంత బలహీనంగా ఉందో తెలియపరుస్తున్నది.

ప్రభుత్వ పరంగా, పోలీసు వ్యవస్థ పై పట్టు బాగా ఉండటం వల్ల టీఆర్ఎస్ పార్టీ ఇలాంటి ‘‘కుట్ర’’ నుంచి బయట పడగలిగింది. కానీ సాధారణ పరిస్థితి ఉండి ఉంటే టీఆర్ఎస్ పుట్టిమునిగి పోయేదనడంలో సందేహం లేదు. బీజేపీ కేవలం నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినంత మాత్రాన ప్రభుత్వం పడిపోయేది కాదు. అయితే జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ కు ఇది పరువు తీసే అంశం. సొంత ఎమ్మెల్యేలను కాపాడుకోలేనంత బలహీనంగా ఉన్న నాయకుడు ఇతర రాష్ట్రాల రాజకీయాలను ఎలా ప్రభావితం చేయగలడు? అందుకే కేసీఆర్ ఇప్పటికైనా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

జాగ్రత్తలు అంటే… పోలీసులను, నిఘాను పటిష్టం చేయడం కాదు… జాగ్రత్తలు అంటే ఉద్యమకారులను, తెలంగాణకు అంకితభావంతో పని చేసేవారిని పార్టీలోకి తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర విస్తృత ప్రయోజనాలను కాపాడే ఆలోచనలు కలవారిని దగ్గరకు చేర్చుకోవాలి. అలా కాకుండా కేవలం ఎమ్మెల్యే సీటు గెలుచుకోవడానికి వ్యాపారులను, ధనవంతులను దగ్గరకు చేర్చుకుంటే పరిస్థితి ఇలానే ఉంటుంది.

ఉద్యమకారులకు దూరం పెట్టి అవకాశవాదుల్ని దగ్గరకు చేరుస్తున్నారనే అపవాదు ఇప్పటికే సాధారణ ప్రజల్లో బలంగా నాటుకుపోయి ఉంది. ఆ పరిస్థితుల్లో ఈ అవకాశవాదులు ఇతర పార్టీలకు అమ్ముడు పోకుండా ఉంటారనే గ్యారెంటీ కూడా ఉండదు. ఈ అంశం పై మాత్రం కేసీఆర్ జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ పార్టీకి రానున్న రోజుల్లో తీరని నష్టం జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

సత్యమూర్తి పులిపాక, చీఫ్ ఎడిటర్, సత్యంన్యూస్.నెట్  

Related posts

విహార యాత్రలో విషాదం

Satyam NEWS

ఖాట్మండులో ఏడుగురు భారతీయ పర్యాటకుల మృతి

Satyam NEWS

స్పోర్ట్స్ మీట్ లో సందడి చేసిన జిహెచ్ఎంసి మహిళా కార్పొరేటర్లు

Satyam NEWS

Leave a Comment