గోదావరి ఉగ్రరూపం దాల్చటంతో తూర్పు గోదావరి జిల్లాలోని ముంపు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. శబరి, ఇంద్రావతి జలాశయాల నుంచి భారీగా నీరు విడుదల చేస్తుండటంతో ప్రవాహం అంతకంతకూ జోరందుకుంటోంది. తూర్పు మన్యంలోని దేవీపట్నం మండల వాసులు జలదిగ్బంధంలో అవస్థలు పడుతున్నారు. విద్యుత్, తాగునీరు లేక నరకయాతన అనుభవిస్తున్నారు. దేవీపట్నం మండలంపై వరద ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ మండలంలోని పలు గ్రామాల ప్రజలు వరదలో బతకలేక ఇళ్లను వదిలేసి తరలిపోతున్నారు. నీట మునిగిన రహదారుల గుండానే ట్రాక్టర్లలో ప్రయాణిస్తున్నారు. పోలవరం కాఫర్ డ్యాం వల్ల వరదనీరు వెనక్కిమళ్లి తమ గ్రామాలను ముంచేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోదావరి ఉపనదులు ఉప్పొంగుతున్నాయి. గోదావరి ఉపనదులు గౌతమి, వైనతేయ, వశిష్ట ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. వరద ఉద్ధృతికి దేవీపట్నం మండలం గొందూరు గ్రామంలోని గండిపోచమ్మ ఆలయం నీటమునిగింది. ఎటపాక, కూనవరం మండలాల్లో పంటపొలాల్లోకి వరద చేరింది. వీఆర్‌పురం-చింతూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బోడసకుర్రు వద్ద పల్లెపాలెం నీట మునిగింది. యానాం ఓడలరేవు, అంతర్వేది వద్ద నదీ పాయలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. చాలా గ్రామాలు నీటిలోనే ఉండిపోయాయి. కోనసీమ ప్రాంతవాసులు సైతం బిక్కుబిక్కుమంటున్నారు. లంకగ్రామాల ప్రజల ముంపు భయంతో ఉన్నారు. ఐ.పోలవరం, ముమ్మిడివరం, అయినవిల్లి మండలాల్లో గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అయినవిల్లి మండలం ఎదురుబీడెం వద్ద కాజ్‌వే నీట మునిగి… అద్దంకివారి లంక, విరవెల్లిపాలెం, పల్లపులంక గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
previous post