దేశాన్ని నెమ్మదిగా ఆక్రమిస్తున్న ఆర్ధిక మాంద్యాన్ని కట్టడి చేసేందుకు తీసుకునే చర్యలపై కేంద్ర ప్రభుత్వం వేగంగా స్పందించడం లేదని మూడీస్ వెల్లడించిన విషయాలు మన దేశ ఆర్ధిక శాఖకు నచ్చడం లేదు. వృద్ధిరేటు సాధనకు ఉపకరించే చర్యలను ఆర్ధిక శాఖ వేగంగా తీసుకోవడం లేదని చెప్పిన మూడీస్ మాటలు ఆర్ధిక శాఖకు నచ్చే అవకాశం లేదు. అయితే వాస్తవ పరిస్థితి మూడీస్ చెప్పిన దానికి దగ్గరగా, ఆర్ధిక శాఖ చెబుతున్న దానికి దూరంగా ఉన్నదనేది మాత్రం వాస్తవం.
ఆసియాలోనే మూడవ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థ అయిన భారత్ ఇంత నిరాశాజనకంగా తయారుకావడం మంచి పరిణామం కాదు. వృద్ధి రేటు పడిపోవడాన్ని అరికట్టే చర్యలు సమర్ధంగా తీసుకోలేకపోతున్నట్లు అన్ని సెక్టార్ల నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మూడీస్ అంచనాలు ఒక్క సారిగా ఎంతో సంచలనం కలిగించాయి. ప్రస్తుతం దేశ వృద్ధి రేటు 2013 స్థాయికి పడిపోయింది. జూన్ తో ముగిసిన త్రైమాసికంలో వృద్ధి రేటు 5 శాతం మాత్రమే నమోదు అయింది. ఈ ఫలితాలు రావడం దేశానికి ఒక పెద్ద షాక్.
రాబోయే రోజుల్లో వృద్ధి రేటు మరింతగా పడిపోయే అవకాశాలే కనిపిస్తున్నాయనేది మూడీస్ అంచనా. ఆర్ధిక మాద్యం దరి చేరకుండా భారత ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని అయినా ప్రపంచ ఆర్ధిక మందగమన ప్రభావం ఎక్కువగా పడుతున్నదని ఆర్ధిక శాఖ చేస్తున్న వాదన పట్ల ఎవరూ సంతృప్తి చెందడం లేదు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా మనమే ఉన్నామని ఇప్పటికీ మన ఆర్ధిక శాఖ చెబుతూనే ఉన్నది.
అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) తాజా నివేదిక ప్రకారం కూడా ఈ ఏడాది దేశ వృద్ధిరేటు 6.1 శాతంగా ఉంటుందనే అంచనా ను ఆర్ధిక శాఖ గుర్తు చేస్తున్నది. 2020 లో వృద్ధి రేటు 7 శాతానికి ఉంటుందని కూడా ఐఎంఎఫ్ తాజా నివేదికలో స్పష్టం చేసిందనే విషయాన్ని ఆర్ధిక శాఖ చెబుతున్నది. అయితే మన ఆర్ధిక శాఖకు నచ్చే విషయాలు మూడీస్ చెప్పడం లేదు. మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ భారత రేటింగ్ అవుట్ లుక్ ను తగ్గించిన విషయం వెల్లడి కాగానే ఆర్ధిక శాఖ తీవ్రంగా స్పందించింది.
మూడీస్ అంచనా వేసిన విధంగా పరిస్థితి లేదని ఆర్ధిక మాంద్యం అదుపులో ఉందని ఆర్ధిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేస్తున్నది. మూడీస్ వేసిన అంచనాలు తప్పు కావాలని, కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ చెప్పిన లెక్కలే కరెక్టు కావాలని కోరుకోని భారతీయుడు ఉండడు. అయితే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ కల్పన తదితర విషయాలలో, పారిశ్రామికాభివృద్ధి సాధించే విషయంలో పూర్తిగా వెనుకబడి ఉన్న మాట మాత్రం వాస్తవం. దీనివల్లే ఆర్ధిక మాంద్యం దేశాన్ని వేగంగా ఆక్రమిస్తుందని దేశానికి చెందిన ఆర్ధిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్ధిక మందగమనాన్ని అందరూ అంచనా వేస్తున్నా కూడా దాన్ని ఎదుర్కొనేందుకు తీసుకునే చర్యల పట్లే ఎవరూ సంతృప్తి వ్యక్తం చేయడం లేదు.