థాయ్ లాండ్ యువరాణి మహా చక్రి సిరింధోరన్ హైదరాబాద్ లోని చారిత్రాత్మక ఫలక్ నుమా ప్యాలెస్ ను సందర్శించారు. రెండు రోజుల పాటు ఆమె ఈ తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ లో విడిది చేశారు. రెండు రోజుల కిందట థాయ్ లాండ్ యువరాణి వస్తున్నారని తెలిసి తాజ్ హోటల్ యాజమాన్యం అన్ని ఏర్పాటు చేసింది. ఆమె ఆతిథ్యంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లూ చేసింది.
రాయల్ హైనెస్ ప్రిన్సెస్ మహా చక్రి ని తాజ్ కృష్ణ హైదరాబాద్ ఏరియా డైరెక్టర్ అండ్ జనరల్ మేనేజర్ ఇయాన్ దుబైర్ ఆహ్వానించారు. తాజ్ ఫలక్ నుమా ఫ్యాలెస్ జనరల్ మేనేజర్ పర్వీందర్ బుల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని రాయల్ హైనెస్ ప్రిన్సెస్ మహా చక్రి కి ఘన స్వాగతం పలికారు. రాజకుమారి ప్యాలెస్ మొత్తాన్ని సందర్శించి పురాతన చిత్రాలను కూడా చూశారు.
ఆనాటి అపురూప చిత్రాలను చూసిన రాజకుమారి సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేశారు. హైదరాబాద్ చరిత్ర సుసంపన్నమైనదని ఆమె కొనియాడారు. రాయల్ కిచెన్ నుంచి వచ్చిన ప్రత్యేక మెనుతో రాజకుమారికి డిన్నర్ ఏర్పాట్లు చేశారు. రాజకుమారితో కలిసి థాయ్ లాండ్ ప్రతినిధి బృందం ప్రసిద్ధ దర్బార్ హాలులో విందు చేసింది.