సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అటవీ శాఖ అధికారులు, ఉద్యోగులకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశం జారీ చేశారు. ఆకుపచ్చని తెలంగాణ, పర్యావరణహిత రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి కేసీయార్ పరితపిస్తున్నారని, ఆయన స్వప్నాన్ని నిజం చేసేందుకు ప్రతీ ఒక్కరూ పునరంకితం కావాలని అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు జన్మదినాన్ని పురస్కరిచుకుని ఫిబ్రవరి 17న అటవీ శాఖలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు అందరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని ఆదేశించారు. ఈ మేరకు ప్రధాన అటవీ సంరక్షణ అధికారి (పీసీసీఎఫ్) శోభతో మంత్రి మాట్లాడారు. అడవుల సంక్షణ, పునరుద్దరణపై ప్రజల్లోనూ విస్త్రత అవగాహన కల్పించే దిశగా అటవీ శాఖ ఉద్యోగులు పనిచేయాలని మంత్రి సూచించారు. సీఎం ఆశయ సాధనకు అనుగుణంగా పనిచేసి ఆకుపచ్చ తెలంగాణ సాధన లక్ష్యంగా అటవీ శాఖ అధికారులు పని చేయాలన్నారు.