35.2 C
Hyderabad
April 27, 2024 13: 03 PM
Slider సంపాదకీయం

అప్పుల కుప్పగా మారిన తెలంగాణ విద్యుత్ రంగం

#CURRENT

ఆంధ్రోళ్లను తిట్టి సెంటిమెంటు రెచ్చగొట్టి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ విద్యుత్ రంగంలో చేసిన తప్పులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజిస్తే తెలంగాణ లో కరెంటు కష్టాలు వస్తాయని అప్పటిలో చెప్పిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాటలను పదే పదే ప్రస్తావిస్తూ కేసీఆర్ తాను చేసిన ఘనకార్యాలను చెప్పుకునేవారు.

దేశంలో తానే ముందుగా 24 గంటల కరెంటు ఇచ్చినట్లుగా కూడా చెప్పుకుంటారు. ఆయన కన్నా ముందే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా చంద్రబాబు ఉన్న సమయంలో 24 గంటల కరెంటు ఇచ్చారన్న విషయం కేసీఆర్ మరచిపోయినట్లు నటించేవారు. వాస్తవానికి విభజిత ఆంధ్రప్రదేశ్ కు కరెంటు లోటు ఉండేది. అయితే దాన్ని కేవలం ఒకటిన్నర సంవత్సర కాలంలోనే సరిదిద్ది చంద్రబాబునాయుడు నిరవధిక కరెంటు అందచేశారు.

దేశంలో 24 గంటల కరెంటు ఇచ్చిన రాష్ట్రంగా చంద్రబాబునాయుడి నేతృత్వంలోని ఆ నాటి ఏపి ప్రభుత్వం రికార్డు సాధించింది. దీన్ని మరుగున పరిచే విధంగా కేసీఆర్ వ్యవహరించేవారు. చంద్రబాబునాయుడి తర్వాత వచ్చిన జగన్ రెడ్డి మళ్లీ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టడంతో చంద్రబాబు సాధించిన రికార్డును ప్రజలు మర్చిపోవాల్సి వచ్చింది. చేసిన పనులను సాధించిన ఘనతను చెప్పుకోవడానికి తెలుగుదేశం నాయకులు అంతగా ఆసక్తి చూపలేదు.

ఇక తెలంగాణ విషయానికి వస్తే కేసీఆర్ ప్రభుత్వం కరెంట్ గురించి చాలా గొప్పగా చెప్పుకుంది. కనురెప్ప పాటు కూడా కరెంట్ పోదని ప్రచారం చేశారు. అదే తాము అధికారంలోకి రాక పోతే మళ్లీ విద్యుత్ పరిస్థితి పాత రోజులకు వెళ్లిపోతుందని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. వారు అలా ఎందుకు అన్నారో కానీ గత పదేళ్లలో విద్యుత్ సంస్థలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి.

భారీ మొత్తం వెచ్చించి బయట కొనడమే తప్ప… ఉత్పత్తి పెంచుకునే ప్రయత్నం చేయలేదు. పదేళ్లలో 60 వేల కోట్లకు పైగా విద్యుత్ సంస్థల అప్పులు పెరిగిపోయాయి. ట్రాన్స్ కో, జెన్‌కో విద్యుత్ సంస్థలను ఏపి, తెలంగాణ మధ్య విభజించినప్పుడు తెలంగాణకు ఉన్న అప్పు రూ. 22,423 కోట్లు. ఇప్పుడు బీఆర్ఎస్ సర్కార్ దిగిపోయే నాటికి వాటి అప్పులు రూ. 81, 156 కోట్ల రూపాయలు.

అంటే దాదాపుగా ఏడాదికి ఆరు వేల కోట్ల చొప్పున అప్పులు పెరిగిపోతూనే ఉన్నాయి. విద్యుత్ ఉత్పత్తి లేదు భారీ ఖర్చుతో కొనుగోలు అసలు విద్యుత్ సంస్థల అప్పులన్నీ దీర్ఘ కాలిక ప్రయోజనాల కోసం… ఆస్తుల సృష్టి కోసం ఉపయోగించలేదు. బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్ కొనుగోలు కోసం తీసుకున్న రుణాలే ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటివే రూ. 30 వేల కోట్లు ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. వీటికి వడ్డీనే నెలకు వెయ్యికోట్లు చెల్లించాల్సి వస్తోంది. కేవలం నిరంతరాయంగా కరెంట్ ఇస్తున్నామని చెప్పుకోవడానికి.. విద్యుత్ సంస్థల్ని నిండా ముంచారన్న అభిప్రాయం నిపుణుల్లో వినిపిస్తోంది.

కొత్త ప్లాంట్ల నిర్మాణం విషయానికి వస్తే రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ 7700 మెగావాట్లు, ఏపీకి 9500 మెగా వాట్ల స్థాపిత సామర్థ్యంతో ప్లాంట్లు దక్కాయి. గతతో పోలిస్తే ఆ సామర్థ్యం తెలంగాణలో 18500 మెగా వాట్లకు పెరిగింది. ఏపీలో 20500 మెగా వాట్లకు పెరిగింది. అంటే… ఎన్నో వేల కోట్లు అప్పులు చేసిన తెలంగాణ కంటే ఏపీలోనే విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరిగింది. చంద్రబాబు ఏపీలో ఐదేళ్లు సీఎంగా ఉన్న సమయంలో విద్యుత్ పరిస్థితిని మెరుగు పరిచారు.

రేట్లు తగ్గించే ఆలోచన చేశారు. కొత్త ప్లాంట్ల నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వ తీరు వివాదాస్పదమయింది. యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ ఇప్పటికీ రెడీకాలేదు. డిజైన్ సరిగ్గా లేకపోవడం బొగ్గు ఎక్కువగా వినియోగించుకునే డిజైన్ వాడటంతో పాటు అటవీ ప్రాంతం డిస్ట్రర్బ్ అవుతుందని ఎన్టీటీ అనుమతులు కూడా రాలేదు. నాలుగు వేల మెగావాట్లు ఆ ప్లాంట్ల నుంచి రావాల్సి ఉంది.

భద్రాద్రి పవర్ ప్రాజెక్టులోనూ భారీ స్కాం జరిగిందన్న విమర్శలు వచ్చాయి. రెండు డిస్కంల నష్టాలు రూ.50 వేల కోట్లు అప్పులే కొండంత ఉంటే… విద్యుత్ పంపిణీ సంస్థల నష్టాలు ఊహించనంతగా పెరిగిపోయాయి. రెండు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు రూ. 50వేల కోట్లకుపైగా అప్పు ఉన్నట్లుగా తేలింది. బొగ్గు సరఫరా చేస్తున్న సింగరేణి సంస్థలకూ వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. ఏం చేసైనా సరే నిరంతరాయ విద్యుత్ ఇవ్వాలన్న కేసీఆర్ ఆదేశాలను అధికారులు ఇలా ఉపయోగించుకున్నారు. విచ్చలవిడిగా బయట నుంచి కొనుగోలు చేసి… విద్యుత్ సంస్థలపై అప్పుల భారం పెట్టారు. ఇప్పుడు కోలుకోలేనంతగా విద్యుత్ సంస్థలపై భారం పెరిగిపోయింది.

దీనికి కేసీఆర్ సమాధానం చెప్పాల్సి ఉంది.

Related posts

కండగలిగిన కవిరాయడు గురజాడ

Satyam NEWS

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు

Sub Editor

వ‌ల‌స కార్మికుల‌కు ఐకేఆర్ ఫౌండేష‌న్ ట్ర‌స్ట్ బాస‌ట‌

Satyam NEWS

Leave a Comment