మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆదేశాలతోనే ముంబై లో గ్యాంగ్ స్టార్ ల హవా కొనసాగేదని ఒక దశ లో గ్యాంగ్ స్టార్స్ తనకి ఇష్టమైన అధికారులను మంత్రులను నియమించుకునేవారని శివ సేన పార్టీ ఎంపీ, ఆ పార్టీ అధికార ప్రతినిథి అయిన సంజయ్ రావత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ అవార్డ్స్ ఫంక్షన్‌కి హాజరైన సంజయ్ రావత్ అక్కడ ఓ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీతో కలిసి అధికారాన్ని పంచుకుంటున్న శివసేన పార్టీకి చెందిన ఓ ఎంపీ, పార్టీ అధికార ప్రతినిథి ఇలా వ్యాఖ్యానించడం ఏంటని తీవ్రస్థాయిలో చర్చలు కూడా మొదలయ్యాయి. ముంబైలో ఒకనాటి గ్యాంగ్‌స్టర్ కరీం లాలాను కలిసేందుకు ఇందిరా గాంధీ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లేదని వ్యాఖ్యానించి సంజయ్ రావత్ ఓ సరికొత్త వివాదానికి తెరతీశారు.
ముంబైకి పోలీస్ కమిషనర్‌గా ఎవరు రావాలనేది కూడా దావుద్ ఇబ్రహీం, చోటా షకీల్, శరద్ శెట్టి లాంటి అండర్ వరల్డ్ డాన్స్ నిర్ణయించేవారని సంజయ్ రావత్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. మంత్రివర్గంలో, సచివాలయంలో ఎవరు ఉండాలనేది కూడా గ్యాంగ్‌స్టర్సే నిర్ణయించే వారని సంజయ్ రావత్ ఆరోపించారు. ముంబైలో అండర్ వరల్డ్ మాఫియా గురించి చెప్పుకొస్తూ ఒకప్పుడు ముంబైలో అండర్ వరల్డ్ డాన్స్ రాజ్యమేలే వారు కానీ ఇప్పుడు లేరని దేశం విడిచి పారిపోయారని అన్నారు.
హాజీ మస్తాన్ ఎప్పుడైనా సచివాలయం వద్దకు వస్తే ఆయన్ని కలిసేందుకు అందరూ కిందకు దిగొచ్చేవారని తెలిపారు. ఇక మాజీ ప్రధాని ఇందిరా గాంధీ అయితే ఏకంగా దక్షిణ ముంబైలోని కరీం లాలా ఇంటికే వెళ్లే కలిసేవారని సంజయ్ రావత్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి.