అనంతపురం జిల్లాకు చెందిన చెన్నారెడ్డి (70) అనే వృద్ధుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఒక్క సారి ఆలోచించుకున్నాడు. చనిపోయే ముందు తాను ఎవరికీ బాకీ ఉండకూడదనుకున్నాడు. ఎప్పుడో ఒక సారి నెల్లూరులోని మైపాడు బీచ్ లోని ఒక షాప్ లో 50 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు.
దాంతో ఆ అప్పు తీర్చి అక్కడే ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడు. అప్పు తీర్చాడు. పురుగుల మందు తెచ్చుకున్నాడు. కట్ చేస్తే… రెండు రోజుల నుంచి చిన్నారెడ్డి కనిపించకపోవడంతో అనంతపురంలోని అతని బంధువులు అక్కడి డిఎస్ పి ని కలిశారు. ఆయన కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా చెన్నారెడ్డి మైపాడు బీచ్ లో ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. అక్కడ నుంచి ఇందుకూరుపేట ఎస్ఐకి అక్కడ నుండి సమాచారం ఇచ్చారు. సీన్ కట్ చేస్తే….ఎస్ఐ నరేష్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మైపాడు బీచ్ వద్దకు వెళ్లి ముమ్మరంగా గాలింపు చేపట్టారు.
బీచ్ లో ఓ మూలన కూర్చుని ఉన్న వృద్ధుడ్ని గుర్తుపట్టి అదుపులోకి తీసుకున్నారు. తనకు ఆరోగ్యం సహకరించక పోవడం వల్లే ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడ్డట్లు చెన్నారెడ్డి తెలిపారు. వెంటనే అతడికి కౌన్సిలింగ్ చేసి బంధువులకు అప్పగించారు. కథ సుఖాంతం అయింది.
ఒక్క ఫోన్ కాల్ కు ఆగమేఘాల మీద స్పందించి పెద్దాయన ప్రాణాలు కాపాడిన ఎస్సై నరేష్ ను బంధువులతో పాటు ఇందుకూరుపేట గ్రామస్తులు కూడా ప్రత్యేకంగా అభినందించారు.