38.2 C
Hyderabad
April 29, 2024 21: 50 PM
Slider ప్రత్యేకం

ఎనాలసిస్: మార్చుకుంటారా? మరుగునపడిపోతారా??

#Chandrababu Naidu TDP

సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ ఆత్మపరిశీలన చేసుకునే ప్రయత్నం చేస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానం రావాల్సి ఉంది. తెలుగుభాష ఆత్మగౌరవం నినాదంతో ఒక్కసారిగా రాజకీయ తెరంగ్రేటం చేసి

సంచలనం సృష్టించిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ డా. నందమూరి తారక రామారావు జయంతినాడు మహానాడు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

తెలుగుభాషపై ఉన్న అభిమానంతో తాను స్థాపించిన రాజకీయ పార్టీకి ‘ తెలుగుదేశం ‘ అని నామకరణం చేసి… 9 నెలల స్వల్పకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఘన చరిత్ర ఎన్టీఆర్ సొంతం. అటు తెలుగు సినిమా రంగంలో… ఇటు రాజకీయ రంగంలో రారాజులా వెలిగిన ఎన్టీఆర్ ఇప్పటికీ తెలుగుదేశం పార్టీకి బలమైన సిగ్నేచర్.

జగన్ విధానాలను వ్యతిరేకించడమే విధానమా?

ఇక విషయంలోకి వస్తే….. మే 27,28 తేదీలలో తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించింది.  కరోనా సంక్షోభం దృష్ట్యా పరిమిత స్థాయిలో మహానాడు వేడుకలు ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలు వ్యతిరేకిస్తూ పలు తీర్మానాలు ప్రకటించారు.

ఈ సమావేశాలలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచక పాలన చేస్తూ అన్నివర్గాల ప్రజలను వేధిస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో రౌడీయిజం పెరిగిందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల దందాకు అడ్డూఅదుపు లేదని తెదేపా నాయకులు విమర్శించారు.

బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తామంటున్నారు

పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీని  స్థాపించిన నాటి నుంచి బలహీన వర్గాలు , బీసీలు మద్దతు ఇస్తూనే ఉన్నాయని వారికి సభా ముఖంగా ధన్యవాదాలు తెలిపారు. ఇక ముందు కూడా బీసీలకు, బలహీన వర్గాలకు తెదేపా సముచిత స్థానం ఇవ్వనుందని ఆయన అన్నారు.

మూడు రాజధానుల ఏర్పాటు పేరుతో రాష్ట్ర ప్రజల మధ్య విబేధాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ కట్టడిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మొత్తంగా గమనిస్తే ….మహా నాడు క్రతువు కేవలం అధికార పార్టీపై ఆరోపణలు చేయడానికి తప్ప ,తెలుగుదేశం పార్టీలో ఉన్న అసంతృప్తిని చల్లార్చే చిన్నపాటి ప్రయత్నం కూడా జరగలేదని ఆ పార్టీ శ్రేయోభిలాషులు నొచ్చుకున్నట్లు తెలిసింది.

ఓటమిపై ఇప్పటికీ చర్చ జరగకపోతే ఎలా?

అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏడాది క్రితం  జరిగిన ఎన్నికలలో అనూహ్యంగా ఎదురైన ఘోరపరాజయంపై ఇప్పటివరకు కూలంకష చర్చ జరుగకపోవడం సహేతుకంగా లేదని తెదేపాకు చెందిన సీనియర్ నేతల విమర్శలను పరిగణలోకి తీసుకోవాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.

ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలమైన ఓటుబ్యాంక్ ఉన్న అతిపెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీ.  బడుగుబలహీన వర్గాలలో ఉన్న పట్టు చెక్కుచెదరలేదని పార్టీ అధినాయకత్వం గుర్తించాలి. అగ్రనాయకులకే పరిమితమైన రాజ్యాధికారం సకల వర్గావారికి అందించాలన్న ఉద్దేశంతో ఎన్టీఆర్ అప్పట్లోనే కొత్త తరహా రాజకీయానికి తెర తీశారు.

మరీ ఇంత దారుణమైన ఓటమికి కారణం?

అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తు చంద్రబాబు నాయుడు కూడా అన్ని వర్గాలు కలుపుకుని సామాజిక సమతుల్యతను పాటించారు. కానీ…..గత ఏడాది జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షహోదాకే పరిమితం కావడం రాజకీయ పరిశీలకులకు ఆశ్చర్యం కలిగించింది.

పార్టీ వర్గాలు కూడా ఫలితాలు ఆ స్థాయిలో ఉంటాయని ఊహించలేదు. రాజకీయాలలోగాని, యుద్ధంలో గాని నెగ్గడానికి వైరిపక్షం బలాన్ని, బలహీన తను ముందుగా అంచనా వేయాలని రాజనీతిజ్ఞుల సలహా. రాజకీయ కోవర్టులు పెరిగిన కుహనా రాజకీయ వ్యవస్థలో ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని ఆశించడం  అవివేకం.

జగన్ పాదయాత్ర వల్లే సానుభూతి

తెదేపా అయిదేళ్ళ పాలనలో చోటుచేసుకున్న అనేక దూకుడు అంశాలను , తప్పుడు నిర్ణయాలనుతనకు అనుకూలంగా మలచుకుని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినట్లు విశ్లేషకులు విపులీకరించారు. అంతే కాదు… ఆనాటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన సుదీర్ఘ పాదయాత్ర ఓటర్లలో సానుభూతి కలిగించడం ఆ పార్టీ విజయావకాశాలను సులభతరం చేసినట్లు వారు తెలిపారు.

తెలుగుదేశం పార్టీ తన ఓటమికి దారితీసిన కారణాలపై ఇప్పటికైనా పారదర్శకంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. పార్టీని నమ్ముకున్న లక్షలాది కార్యకర్తలకు నైతికమద్దతు ఇవ్వడం ఆపార్టీ అధినాయకత్వం ముందున్న తక్షణ కర్తవ్యం. ఎన్నికలలో గెలుపోటములు సహజం.

సంక్షేమ కార్యక్రమాలు జగన్ ఇమేజ్ పెంచుతున్నాయా?

అత్యంత బలమైన రాజకీయ హేమాహేమీలకే కొన్నిసార్లు పరాజయం తప్పదని చరిత్ర చెబుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలలో ఆపార్టీ ఇమేజ్ ను పెంచుతున్న తీరు గమనీయం. అమ్మ ఒడి, జగనన్న దీవెన పథకాల పేరుతో అందిస్తున్న ఆర్థిక సాయం లబ్ది దారులను ఆకర్షించడం ఖాయం.

తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేపట్టిన భారీస్థాయి ప్రాజెక్టు వ్యవహారాలలో  రివర్స్ టెండరింగ్ విధానం అమలుచేసి కోట్ల రూపాయలు మిగిల్చినట్లు వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంది. దీనిపై మీడియా కూడా అనుకూల వ్యాఖ్యలు చేయడంతో రాష్ట్ర ప్రజలలో తెదేపా పై ఉన్న అనుమానం బలపడింది.

రాజధాని ప్రాంతంపై అనుమాన మేఘాలు

అమరావతి వ్యవహారం మొదటి నుంచి సంశయాలకు, సందేహాలకు కేంద్రబిందువైంది. భూముల సేకరణ మొదలు వాటిని అభివృద్ధి నిమిత్తం విదేశీ కన్సల్టెంట్ లకు ఇవ్వాలని కసరత్తు చేయడం ముఖ్యంగా ఆ ప్రాంతంలో భూములిచ్చిన ప్రజలకు తీవ్ర ఆందోళన కలిగించాయి. ఇప్పటికీ రాజధాని ప్రాంత ప్రజలు ఆందోళన చేస్తున్నారు.

వాస్తవానికి తెలుగుదేశం పార్టీపట్ల విధేయత, ఆ పార్టీ అధి నాయకుడు చంద్రబాబు నాయుడుపై ఉన్న విశ్వసనీయత 2014 ఎన్నికలలో ఆ పార్టీ కి విజయాన్ని అందించాయి. కానీ, తెదేపాలో అంతర్గత ప్రజాస్వామ్య లక్షణాలు లోపించడం, కొత్తగా తలెత్తిన కుల సమీకరణలు ఆ పార్టీ సానుభూతి పరులకు రుచించలేదు.

నాయకత్వం మార్పు ఇప్పుడు అనివార్యమా?

పాలనలో వరుస వైఫల్యాలను అధి నాయకత్వం గుర్తించకపోవడం, ప్రత్యేక కోటరీ నెలకొనడం వంటి అంశాలు తెదేపా సీనియర్ నేతలు జీర్ణించుకోలేక, పార్టీ నేతకు వివరించలేక దూరం పాటించడం పార్టీ అపజయానికి మరో ప్రబల కారణం. తెలుగుదేశం పార్టీలో నాయకత్వం మార్పు అనివార్యమని ఇటీవల సామాజిక మాధ్యమాల లోపుకార్లు షికార్లు చేస్తున్నాయి.

నందమూరి కుటుంబం నుంచి బలమైన వ్యక్తి తెదేపా పగ్గాలు చేపట్టేందుకు రంగం సిద్ధమైందని సూడో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు తప్పుకుంటే పార్టీకి ఉన్న కేడర్ విచ్చిన్నమవుతుందని తెదేపాతో సుదీర్ఘ అనుబంధం ఉన్న నేతలు భావిస్తున్నారు.

జగన్ వ్యతిరేకతను అందిపుచ్చుకుంటారా?

జాతీయస్థాయిలో చక్రం తిప్పిన తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసి , పార్టీ శ్రేణులు, కార్యకర్తలలో మునుపటి ఉత్సాహం నింపడానికి తెదేపా అధినాయకత్వం ముందడుగు వేయాల్సిన సరైన సమయం ఇది.

కరోనా సంక్షోభ సమయంలో తెదేపా శ్రేణులు తగిన రీతిలో స్పదించ లేదని వస్తున్న విమర్శలు ఆ పార్టీ గుర్తించాలి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి హైకోర్టు నుంచి ఎదురవుతున్న వ్యతిరేకతను అందిపుచ్చుకునే అవకాశాన్ని వదులు కోరాదని తెదేపా శ్రేయోభిలాషుల సూచన శిరోధార్యం.

బలమైన పాలకపక్షం చేస్తున్న తప్పులను ఎత్తి చూపి ప్రజలను చైతన్యం  చేయాల్సిన బాధ్యతను ప్రతిపక్ష పార్టీ నిర్లక్ష్యం చేయడం ఆ పార్టీకే తీరని నష్టం. అందుకు తెలుగుదేశం పార్టీ కూడా మినహాయింపు కాదు.

కృష్ణారావు

Related posts

గిడ్డంగుల సంస్థ చైర్ ప‌ర్స‌న్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన రజనీ

Bhavani

బైరి నవీన్ ను అరెస్ట్ చేయాలి: కైలాసగిరి అయ్యప్ప సేవ సమితి

Satyam NEWS

ప్రియాంక గాంధీ ట్వీట్స్:కాంగ్రెస్ పార్టీ ఇంకా కష్టపడాలి

Satyam NEWS

Leave a Comment